న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎలక్షన్ కమిషన్ శనివారం షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు స్పందించాయి. ఎన్నికల షెడ్యూల్‌ను స్వాగతిస్తున్నట్టు పలువురు రాజకీయ నేతలు పేర్కొన్నారు. (ఐదు రాష్ట్రాల ఎన్నికలు, ఆన్‌లైన్‌లో నామినేషన్ వేసే అవకాశం)
అధికారాన్ని నిలబెట్టుకుంటాం
ఉత్తరప్రదేశ్‌లో అధికారాన్ని నిలబెట్టుకుంటామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విశ్వాసం వ్యక్తం చేశారు. మార్చి 10న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అఖండ మెజారిటీతో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, ఇందులో ఎటువంటి సందేహాలు అవసరం లేదని వ్యాఖ్యానించారు.
ఈ తేదీలతో యూపీలో భారీ మార్పు
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధమయ్యారని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. తాజాగా ప్రకటించిన ఎన్నికల తేదీలు యూపీలో భారీ మార్పును తీసుకురానున్నాయని పేర్కొన్నారు. ఈసీ విధించిన నిబంధనలను తమ పార్టీ పాటిస్తుందని స్పష్టం చేశారు. అధికార బీజేపీ ఈ మార్గదర్శకాలను అనుసరించేలా చూడాల్సిన బాధ్యత ఈసీపై ఉందన్నారు.
ప్రవర్తనా నియమావళికి కట్టుబడతాం
ఉత్తరాఖండ్ ఎన్నికల తేదీల ప్రకటనను గతిస్తున్నామన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత హరీశ్ రావత్. ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు, ప్రవర్తనా నియమావళికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన తెలిపారు.
మీడియా ద్వారా ప్రచారం చేస్తాం
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోందని పంజాబ్ మంత్రి రాజ్ కె వెర్కా పేర్కొన్నారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో కఠినమైన నిబంధనలను విధించాలని తాము కోరుకున్నామని ఆయన వెల్లడించారు. పంజాబ్ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో పోలింగ్ శాతం నమోదవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను సోషల్ మీడియా, టీవీ, ఇతర మీడియా ద్వారా ప్రచారం చేస్తామని చెప్పారు.
మా కోసం పంజాబ్ ప్రజల ఎదురుచూపు
పంజాబ్ ప్రజలు ఈసారి తమకు అధికారం కట్టబెడతారని శిరోమణి అకాలీదళ్‌అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ దీమా వ్యక్తం చేశారు. శాంతి, మత సామరస్యానికి కట్టుబడే బలమైన ప్రభుత్వం కోసం పంజాబీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని అన్నారు. ప్రస్తుత పాలకులు పాలనను సర్కస్‌గా మార్చారని విమర్శించారు. కాంగ్రెస్ పాలనకు ప్రజలు ముగింపు పలికేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
కాంగ్రెస్, బీజేపీ ఉచ్చులో పడొద్దు
వర్చువల్, ఇంటింటి ప్రచారానికి సిద్ధమవుతున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తెలిపారు. పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినా బీజేపీ ఓటు వేసినట్టేనని ఆయన అన్నారు. గోవా, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఇది నిరూపితమయిందని.. ఇప్పుడు చండీగఢ్‌లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోందని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ ఉచ్చులో పడొద్దని పంజాబ్ ఓటర్లకు సిసోడియా విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment