తగ్గిన ‘జాతీయ’ ప్రభ | Lok Sabha elections 2024: national parties count fell from 14 to 6 | Sakshi
Sakshi News home page

Leap of faith: తగ్గిన ‘జాతీయ’ ప్రభ

Published Mon, Mar 25 2024 4:31 AM | Last Updated on Mon, Mar 25 2024 4:31 AM

Lok Sabha elections 2024: national parties count fell from 14 to 6 - Sakshi

సార్వత్రిక సమరంలో సత్తా చాటలేకపోతున్న జాతీయ పార్టీలు

70 ఏళ్లలో 14 నుంచి ఆరుకు తగ్గిన జాతీయ పార్టీల సంఖ్య

ఎన్నికల కుంభమేళాలో దేశవ్యాప్తంగా వేలాది రాజకీయ పార్టీలు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. ప్రస్తుతం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 2,500కు పైగా రాజకీయ పార్టీలున్నాయి. కానీ 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 53 పార్టీలు బరిలో నిలిచాయి. అందులో 14 మాత్రమే జాతీయ పార్టీలు. మిగతావి రాష్ట్ర పార్టీలు.

దేశవ్యాప్తంగా కోట్లాది ఓటర్లను ఆకర్షించి అత్యంత ప్రజాదరణ పొందిన పార్టీలుగా ఖ్యాతికెక్కిన జాతీయ పార్టీలు నెమ్మదిగా ప్రభ కోల్పోతున్నాయి. సత్తా చాటలేక చతికిలపడుతూ తమ ‘జాతీయ’ హోదాను కోల్పోతున్నాయి. అలా ఈ ఏడు దశాబ్దాల కాలంలో ఎనిమిది పార్టీలు ‘జాతీయ’ హోదా కోల్పోయాయి. డెభై ఏళ్లలో కొన్ని జాతీయ పార్టీలు విలీనం కాగా కొత్తవి ఉద్భవించాయి. తాజాగా 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి జాతీయ పార్టీల సంఖ్య ఆరుకు పరిమితమైంది.

 దేశంలో ఎన్నికల పర్వాన్ని అక్షరబద్దం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రచురించిన ‘లీప్‌ టు ఫెయిత్‌’ పుస్తకంలో పలు ఆసక్తికర విషయాలున్నాయి. జాతీయ పార్టీ ట్యాగ్‌లైన్‌ తమకూ కావాలని 1951 లోక్‌సభ ఎన్నికలకు ముందు 29 రాజకీయ పార్టీలు పట్టుబట్టాయి. అయితే వాటిలో 14 పార్టీలకే ఆ హోదా దక్కింది. అయితే మెజారిటీ పార్టీలు దాన్ని నిలబెట్టుకోలేకపోయాయి. కేవలం నాలుగు పార్టీలు.. కాంగ్రెస్, ప్రజా సోషలిస్ట్‌ పార్టీ, సీపీఐ, జనసంఘ్‌ ఆ హోదాను నిలుపుకున్నాయి.

అఖిల భారతీయ హిందూ మహాసభ, ఆలిండియా భారతీయ జనసంఘ్, రెవల్యూషనరీ సోషలిస్ట్‌ పార్టీ, ఆలిండియా షెడ్యూల్డ్‌ క్యాస్ట్స్‌ ఫెడరేషన్, ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌(మార్కిస్ట్‌), ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌(రూకర్‌), కృషికార్‌ లోక్‌పార్టీ, బొల్‌‡్షవిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా, రెవల్యూషనరీ కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా జాతీయ హోదా కోల్పోయాయి. దీంతో 1957 ఎన్నికలనాటికి పార్టీల సంఖ్య 15కు పడిపోయింది.

వాటిలో నాలుగింటికే జాతీయ హోదా కొనసాగింది. అయితే 1962 ఎన్నికలనాటికి జాతీయ పార్టీల సంఖ్య ఆరుకు, అన్ని పార్టీల సంఖ్య 29కి పెరిగింది. సోషలిస్ట్‌ (ఎస్‌ఓసీ), స్వతంత్ర (ఎస్‌డబ్ల్యూఏ) పార్టీలు జాతీయ హోదా పొందాయి. 1951 ఎన్నికల తర్వాత సీపీఐ ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగి పుష్కర కాలం ఆ హోదాలో కొనసాగింది. కానీ 1964లో పార్టీలోని సోవియట్, చైనా కమ్యూనిస్ట్‌ వర్గాలు వేరు కుంపటి పెట్టాయి. దీంతో సీపీఐ (మార్కిస్ట్‌) పురుడుపోసుకుంది.

1992లో 7 జాతీయ పార్టీలు
1992 లోక్‌సభ ఎన్నికల్లో ఏడు నేషనల్‌ పార్టీలు.. బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, జనతాదళ్, జనతా పార్టీ, లోక్‌దళ్‌ పోటీలో ఉన్నాయి. 1996 సాధారణ ఎన్నికల్లో మొత్తం 209 పార్టీలు అధికారం కోసం పోటీపడ్డాయి.

కాంగ్రెస్, ఆలిండియా కాంగ్రెస్‌ (తివారీ), బీజేపీ, సీపీఐ, సీపీఎం, జనతా పార్టీ, సమతా పార్టీ, జనతాదళ్‌ రూపంలో ఎనిమిది పార్టీలకు జాతీయ హోదా దక్కింది. 1998 ఎన్నికలకొచ్చేసరికి పార్టీల సంఖ్య 176కు పడిపోయింది. ఈ దఫా కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, జనతాదళ్, సీపీఐ, సీపీఎం, సమతా పార్టీ జాతీయ హోదాతో పోటీపడ్డాయి. 1999లో పార్టీల సంఖ్య 160కి పడిపోయింది. బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, జేడీ(ఎస్‌), జేడీ(యూ) జాతీయ పార్టీలుగా అదృష్టం పరీక్షించుకున్నాయి.

2014లో 464 పార్టీలు
2014 ఎన్నికల్లో ఏకంగా 464 పార్టీలు రంగంలోకి దూకాయి. జాతీయ పార్టీల సంఖ్య ఆరుకు తగ్గింది. ఆనాడు బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ, బీఎస్పీలకు మాత్రమే జాతీయ హోదా ఉంది. 2016లో మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ తొలిసారిగా జాతీయ హోదా సాధించి ఎన్నికల్లో పోటీ చేసింది. 2019లోనూ ఎక్కువ సీట్లు సాధించేందుకు శ్రమించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 674 పార్టీలు పోటీ చేయగా వాటిలో బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ, తృణమూల్‌ రూపంలో ఏడు జాతీయ  పార్టీలుగా నిలిచాయి. తర్వాత తృణమూల్‌ కాంగ్రెస్,  ఎన్సీపీ, సీపీఐ జాతీయ హోదా కోల్పోయాయి.

జాతీయ హోదా ఇలా...
నిబంధనావళి ప్రకారం కనీసం మూడు రాష్ట్రాల నుంచి కనీసం రెండు శాతం ఎంపీ సీట్లను గెలిచిన పార్టీకే జాతీయ పార్టీ హోదా దక్కుతుంది. లేదంటే నాలుగు రాష్ట్రాల్లో పోలై చెల్లిన ఓట్లలో ఆరు శాతం ఓట్లు ఆ పార్టీకి పడాలి. కనీసం నాలుగు రాష్ట్రాల్లో అప్పటికే రాష్ట్ర పార్టీ హోదా ఉండాలి.
► జాతీయ పార్టీ దేశవ్యాప్తంగా పోటీ చేస్తే ఆ పార్టీ అభ్యర్థులకు ఒకే ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
► దేశ రాజధానిలో పార్టీ కార్యాలయం ఏర్పాటుకు ప్రత్యేకంగా స్థలం కేటాయిస్తారు.  

జేపీ.. జనతా ప్రయోగం
జయప్రకాశ్‌ నారాయణ్‌ (జేపీ), రామ్‌ మనోహర్‌ లోహియా, ఆచార్య నరేంద్ర దేవ్‌ ఏర్పాటుచేసిన సోషలిస్ట్‌ పార్టీ మూలాలు కాంగ్రెస్‌ వామపక్ష విభాగమైన కాంగ్రెస్‌ సోషలిస్ట్‌ పార్టీ (సీఎస్‌పీ)లో ఉన్నాయి. జేపీ సోషలిస్ట్‌ పార్టీని జేబీ        కృపలానీ సారథ్యంలోని కిసాన్‌ మజ్దూర్‌ ప్రజా పార్టీలో విలీనం చేసి ప్రజా సోషలిస్ట్‌ పార్టీ (పీఎస్‌పీ)ని ఏర్పాటుచేశారు. ఆ తర్వాత పీఎస్‌పీ నుంచి జేపీ బయటికొచ్చారు.
► 1975లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించడంతో జేపీ మళ్లీ జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు. జేపీతో పాటు విపక్షాలు నేతలందరూ జైలు పాలయ్యారు.
► జేపీ విడుదలయ్యాక కొందరు పీఎస్‌పీ నేతలతో కలిసి భారతీయ లోక్‌దళ్‌ను స్థాపించారు.
► ఎమర్జెన్సీకారణంగా దేశంలోని విపక్ష పార్టీలపై నిషేధం కత్తి వేలాడటంతో ఇందిరను ఢీకొట్టేందుకు అంతా కలిసి జనతా పార్టీకి ప్రాణం పోశారు. 1977లో ఇందిరను ఓడించి జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచి్చంది.

జాతీయ పార్టీగా ఆప్‌
తృణమూల్‌ కాంగ్రెస్, ఎన్సీపీ, సీపీఐ జాతీయ పార్టీ హోదాను కోల్పోయాక గతేడాది కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ హోదా సాధించడం విశేషం. ప్రస్తుత లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, బీఎస్‌పీ, సీపీఎం, నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ, ఆప్‌ మాత్రమే జాతీయహోదాలో తలపడుతున్నాయి. 543 లోక్‌సభ స్థానాలకు మొత్తం ఏడు దశల్లో పోలింగ్‌ జరగనుంది.

  – సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement