
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఆరు, తెలంగాణలో రెండు నమోదిత గుర్తింపులేని రాజకీయ పార్టీ (ఆర్‌యూపీపీ)లను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తమ జాబితా నుంచి తొలగించింది. తెలంగాణలో 14 ఆర్‌యూపీపీలను క్రియాశీలకంగా లేని పార్టీలుగా గుర్తించింది. మే 25న ఆర్‌యూపీపీల విధివిధానాలను అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించిన చర్యల్లో భాగంగా మంగళవారం దేశవ్యాప్తంగా 86 పార్టీలను జాబితా నుంచి తొలగించగా, ఉనికిలోలేని 253 పార్టీలను క్రియారహిత ఆర్‌యూపీపీలుగా ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు ఉనికిలోలేని పార్టీల సంఖ్య 537కి చేరింది.
ఇప్పటివరకు ఎన్నికల సంఘం జాబితా నుంచి తొలగించిన ఆర్‌యూపీపీల సంఖ్య 284కు చేరింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ‘పార్టీ రిజిస్టర్ అయిన ఐదేళ్లలోపు ఎన్నికల సంఘం నిర్వహించే ఎన్నికల్లో పోటీచేయాలి. ఆ తర్వాత పోటీచేయడం కొనసాగించాలి. పార్టీ ఆరేళ్లపాటు ప్రతి ఎన్నికల్లో పోటీచేయకపోతే రిజిస్టర్డ్ పార్టీల జాబితా నుంచి పార్టీ తొలగించబడుతుంది’ అని ఈసీఐ ప్రకటనలో తెలిపింది.
ఏపీలో ఈసీఐ జాబితా నుంచి తొలగించిన పార్టీలివీ..
ఆలిండియా ముత్తాహిదా ఖ్వామీ మహాజ్, భారత్‌దేశం పార్టీ, ఇండియన్స్ ఫ్రంట్, జాతీయ తెలుగు అభివృద్ధి సేవాసమూహం, మన పార్టీ, ప్రజాభారత్ పార్టీ.