నేడు ఢిల్లీకి సీఎస్, డీజీపీ
పోలింగ్‌కు ముందు ఆకస్మిక బదిలీలతో సమస్యలు ఉత్పన్నం
కొన్ని చోట్ల పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించినట్లు ఎన్నికల పరిశీలకుల నివేదిక
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తరువాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవటాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. దీనిపై స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె.ఎస్.జవహర్‌రెడ్డి, డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తాను ఆదేశించింది. ఈ నేపథ్యంలో వారిద్దరూ ఢిల్లీ వెళ్లి గురువారం మధ్యాహ్నం వివరణ ఇవ్వనున్నారు.
పోలింగ్ అనంతరం పల్నాడు, కారంపూడి, చంద్రగిరి, తాడిపత్రిలో ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి హెచ్చరించినా స్థానిక పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించటాన్ని తీవ్రంగా పరిగణించిన ఈసీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. కొంత మంది పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని, ప్రేక్షక పాత్ర పోషించారని కేంద్ర పరిశీలకులు ఈసీకి నివేదిక ఇచ్చారు.
ఆకస్మిక బదిలీలతో సమస్యలు..
సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి బందోబస్తు ఏర్పాట్లు చేసినా అక్కడ పోలీసు ఉన్నతాధికారులను ఈసీ హఠాత్తుగా బదిలీ చేయడంతోనే సమస్యలు ఉత్పన్నమైనట్లు అధికార యంత్రాంగం భావిస్తోంది. కొత్త అధికారులకు క్షేత్రస్థాయి పరిస్థితులపై సమగ్ర అవగాహన లేకపోవడంతో కొన్ని చోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నట్లు పేర్కొంటున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా బుధవారం సచివాలయంలో సమావేశమై చర్చించారు. విధి నిర్వహణలో ఏకపక్షంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్చించారు. వీరిని ఇప్పటికే గుర్తించామని, వారిపై తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment