సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, ఎలాంటి ప్రలో భాలకు తావులేకుండా నిర్వహించడానికి కట్టుబడి ఉన్నామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్ స్పష్టం చేశారు. అన్ని రకాల ప్రలోభాలపై ప్రత్యేక నిఘా ఉంచుతామని ప్రకటించారు. ఎన్నికల్లో ధనం, మద్యం, ఇతర కానుకలు, మాదకద్రవ్యాల ప్రవాహాన్ని పూర్తిగా నియంత్రించాలని, వీటిపట్ల అత్యంత అప్రమత్తంగా ఉంటూ కఠినంగా వ్యవహరించాల్సిందిగా కేంద్ర, రాష్ట్రాల ఎన్నికల యంత్రాంగాన్ని ఆదేశించామని తెలిపారు. వారు కఠిన చర్యలు తీసుకునేలా తాము చేస్తామని చెప్పారు.
గత అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రలోభాల గురించి తాము విన్నామని, ఇలాంటి విషయంలో తమ చర్యలు ఎలా ఉంటాయో ఈసారి చూడబోతున్నారని అన్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడగానే అధికార యంత్రాంగం యావత్తూ డెప్యుటేషన్‌పై ఈసీ పరిధిలోకి వస్తుందని వివరించారు. ఎన్నికల్లో ప్రలోభాలకు గురి చేయడం, వాటికి ఫైనాన్స్ చేయడం, నిర్మూలించాల్సిన బాధ్యతల్లో ఉండి అవకాశం కల్పించడం నేరమేనని, ఐపీసీలోని పలు సెక్షన్లతో పాటు ప్రజాప్రాతినిధ్య చట్టం కింద శిక్షార్హులని రాజీవ్‌కుమార్ స్పష్టం చేశారు.
ఓటర్లందరూ తమ ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్య పండుగలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సన్నద్ధతను పరిశీలించడానికి మూడురోజుల రాష్ట్ర పర్యటనకు వచి్చన ఆయన.. గురువారం చివరిరోజు సహచర ఎన్నికల కమిషనర్లు అనూప్‌చంద్ర పాండే, అరుణ్ గోయల్, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు.
ఎస్‌ఎల్‌బీసీకి, ఆర్బీఐకి ప్రత్యేక ఆదేశాలు
‘బ్యాంకులు నగదు రవాణా వాహనాలను నిర్దేశిత సమయాల్లోనే నడిపించాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ)ని ఆదేశించాం. ఎన్నికల్లో అక్రమ నగదు రవాణాకు ఆ వాహనాలను వినియోగించే అవకాశం ఉందని గుర్తించాం. అంబులెన్సులు, ప్రభుత్వ వాహనాల్లో డబ్బు, ఇతర వస్తువుల అక్రమ రవాణా జరగకుండా తనిఖీలు చేయాలని సంబంధిత యంత్రాంగాలను కోరాం. చీరలు, కుక్కర్లు వంటి ఎన్నికల్లో పంపిణీ చేసే కానుకలను నిల్వ చేసే ప్రైవేటు గోదాముల వద్ద గట్టి నిఘా పెట్టాలని రాష్ట్ర దర్యాప్తు సంస్థలను కోరాం. రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌లతో పాటు ఎయిర్‌పోర్టులు, కార్గో ఫ్లయిట్లు, ప్రైవేటు ఎయిర్‌్రస్టిప్‌లు, రాజకీయ నేతలు వినియోగించే వాణిజ్యేతర విమానాలు, ప్రత్యేక విమానాలు సైతం తనిఖీ చేయాలని కోరాం.
పేమెంట్ వ్యాలెట్ల ద్వారా జరిగే ఆన్‌లైన్ నగదు లావాదేవీలపై నిఘా పెట్టాలని ఆర్బీఐ, ఎస్‌ఎల్‌బీసీకి సూచించాం. ఒకే ఖాతా నుంచి వందల సంఖ్యలోని ఖాతాలకు ఆన్‌లైన్ ద్వారా నగదు బదిలీ జరిగితే గుర్తించి విచారణ జరపాలని ఆదేశించాం. చిన్న చిన్న డ్రగ్ పెడ్లర్లపై చర్యలతోనే సరిపెట్టరాదని, పెద్ద మొత్తంలో మద్యం, మాదక ద్రవ్యాల సరఫరా, ఇతర అక్రమాలకు పాల్పడే కింగ్‌పిన్స్‌ను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించాం. రాష్ట్ర సరిహద్దులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న 148 చెక్‌పోస్టులను సీసీటీవీ కెమెరాల ద్వారా కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరంగా పర్యవేక్షిస్తాం..’ అని సీఈసీ తెలిపారు.
ఫిర్యాదులపై కలెక్టర్లు, ఎస్పీలు స్పందించాలి
‘రాజకీయ పార్టీలు, అభ్యర్థుల నుంచి వచ్చే ఫిర్యాదులన్నింటిపై విచారణ జరిపి వారికి సమాధానం ఇవ్వాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించాం. రాజకీయ పార్టీలు, అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు కల్పించాలని చెప్పాం. పోలింగ్ రోజుకి రెండు రోజుల కన్నా ముందే ఓటరు స్లిప్పులు పంపిణీ చేయాలని, ఈవీఎంలు/వీవీ ప్యాట్‌లను అధికారిక వాహనాల్లోనే రవాణా చేయాలని కోరాం. ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి సాధారణ పరిశీలకులు, పోలీసు పరిశీలకులు, వ్యయ పరిశీలకులను నియమిస్తాం. ఫిర్యాదుల స్వీకరణ కోసం వారి చిరునామాలు సైతం తెలియజేస్తాం. సామాజిక మాధ్యమాల్లో ఫేక్‌న్యూస్‌ను కట్టడి చేసేందుకు ప్రత్యేక సెల్స్ ఏర్పాటు చేస్తాం..’ అని రాజీవ్‌కుమార్ చెప్పారు.
ఫిర్యాదుల కోసం సీ–విజిల్ యాప్
‘ఎన్నికల్లో ప్రలోభాలు, ఇతర అక్రమాలపై ‘సీ–విజిల్’ యాప్ ద్వారా అక్కడికక్కడే ఫోటోలు తీసి పంపిస్తే 100 నిమిషాల్లోగా చర్యలు తీసుకుంటాం. ఫిర్యాదుదారుల గోప్యతను పరిరక్షిస్తాం. ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ ద్వారా ఓటరుగా నమోదు, జాబితాలో పేరు, పోలింగ్ కేంద్రం పరిశీలన వంటి సేవలను ఉపయోగించుకోవచ్చు. ప్రలోభాలకు తావులేకుండా ఎన్నికలు జరపాలని, ధన, మద్య ప్రవాహం లేకుండా చూడాలని అన్ని రాజకీయ పార్టీలు కోరాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర సాయుధ బలగాలను నియమించాలని, విద్వేష ప్రసంగాలు, సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌ను కట్టడి చేయాలని విజ్ఞప్తి చేశాయి. అభ్యర్థుల ఎన్నికల గరిష్ట వ్యయ పరిమితిని పెంచాలని ఓ పార్టీ కోరింది. త్వరలో వీటికి బదులిస్తాం..’ అని సీఈసీ తెలిపారు.
ధ్రువీకరణ తర్వాతే ఓట్ల తొలగింపులు
‘ఓటర్ల తొలగింపు కోసం వచ్చిన ఫామ్–7 దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన తర్వాతే చనిపోయిన, డూప్లికేట్ ఓటర్లను తొలగించాం. మా అంతట మేముగా ఎలాంటి ఓట్లు తొలగించలేదు. మరణ ధ్రువీకరణ పత్రం పరిశీలించిన తర్వాతే రిజిస్టర్డ్ మృతుల ఓట్లను తొలగించాం. 10 శాతం తొలగించిన ఓట్లను ఎంపిక చేసి పునఃపరిశీలన జరిపాం. 2022, 2023లో మొత్తం 22 లక్షల ఓట్లను తొలగించాం. చెంచు, కోలం, తోటి, కొండారెడ్డి వంటి గిరిజన తెగలవారిని 100 శాతం ఓటర్లుగా నమోదు చేశాం..’ అని రాజీవ్‌కుమార్ వివరించారు.
అభ్యర్థులు తమ నేర చరిత్రపై ప్రకటన ఇవ్వాలి
అభ్యర్థులు తమ నేరచరిత్రపై 3 వేర్వేరు సమయాల్లో ప్రముఖ పత్రికల్లో ప్రకటన ఇవ్వాల్సి ఉంటుందని సీఈసీ స్పష్టం చేశారు. నేర చరిత్ర కలిగిన అభ్యర్థులను ఎందుకు ఎంపిక చేశారన్న అంశాన్ని రాజకీయ పార్టీలు కూడా ఓటర్లకు తెలపాల్సి ఉంటుందన్నారు. కారణాలను ఒక జాతీయ, మరో ప్రాంతీయ పత్రికలో ప్రచురించాల్సి ఉంటుందని చెప్పారు.
ప్రలోభాలపై పక్కా నిఘా
Published Fri, Oct 6 2023 3:57 AM | Last Updated on Fri, Oct 6 2023 3:57 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment