సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార సాధనే లక్ష్యంగా అన్ని రాజకీయ పక్షాలు సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్నాయి. ప్రధానంగా సంక్షేమాన్నే నమ్ముకుని ఎన్నికల హామీలిస్తున్నాయి. ప్రచారంలో కానీ, పార్టీ ప్రణాళికల్లో కానీ సంక్షేమ ఆధారిత అంశాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. అధికార భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్), కాంగ్రెస్‌తో పాటు బీఎస్పీ కూడా ఇదే బాటలో నడుస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మాత్రం ఇంతవరకు మేనిఫెస్టో విడుదల చేయలేదు.
ఇక బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) సంక్షేమ సూత్రాన్నే ప్రధానంగా అనుసరించినా.. అభివృద్ధి, ఉపాధి అంశాలకు కూడా చోటిస్తూ తన ఎన్నికల ప్రణాళిక విడుదల చేసింది. అయితే దేశాభివృద్ధికి కీలకమైన రెండు ప్రధానమైన అంశాలకు సంబంధించి ఏ పార్టీ కూడా స్పష్టమైన హామీలు ఇవ్వడం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
కీలకమైన విద్య, వైద్యానికి సంబంధించి తమ విధానమేమిటో? బడ్జెట్‌లో ఏ మేరకు నిధులు పెంచుతారన్న అంశాలను ఎక్కడా చెప్పడం లేదు. ప్రస్తుత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కానీ, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ విద్య, వైద్యంపై చేసిన వ్యయం చాలా తక్కువగా ఉండటం గమనార్హం. కాగా అతి ప్రధానమైన మౌలిక సదుపాయాల కల్పనపై కూడా దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
సంక్షేమం సరే..
సంక్షేమ పథకాలను ఎవరూ తప్పుబట్టడం లేదని, అదే సమయంలో సుస్థిర అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల పెంపునకు దోహదపడే కార్యక్రమాలపై పార్టీలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందనే అభి ప్రాయం వ్యక్తమవుతోంది. విద్య, వైద్య రంగానికి బడ్జెట్‌లో కేటాయింపులు, చేస్తున్న వ్యయం పరిశీలిస్తే ఇది స్పష్టంగా కనిపిస్తుంది.
కొన్ని సందర్భాల్లో బడ్జెట్‌లో కేటాయించిన నిధులు కూడా వ్యయం చేయడం లేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. విద్యపై వ్యయం ఎంత పెరిగితే.. భవిష్యత్ కు అంత పెట్టుబడి అనే అంశాన్ని పార్టీలు విస్మరిస్తున్నాయని అంటున్నారు. అలాగే రహదారుల అభివృద్ధి, ప్రభుత్వ ఉద్యోగాల కల్పన, యూనివర్సిటీలు, పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాల గురించి ప్రధాన పార్టీలు పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలు కూడా విన్పిస్తుండటం గమనార్హం.
ఎన్నికల హామీలు ఇలా..
కాంగ్రెస్: ఆరు గ్యారంటీల పేరిట పూర్తిస్థాయిలో ప్రచారం నిర్వహిస్తోంది. వివిధ రకాల డిక్లరేషన్లు ప్రకటిస్తోంది. మరిన్ని సంక్షేమ పథకాలపై కూడా ఆ పార్టీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి మహాలక్ష్మి పేరిట ప్రతి మహిళకు రూ. 2,500, రూ.500కే గ్యాస్ సిలిండర్, బస్సుల్లో ఉచిత ప్రయాణం, రైతు భరోసా కింద ఏటా ఎకరాకు రూ.15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు, వరిపంట బోనస్ రూ.500, అన్ని కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, రూ.5 లక్షల ఆర్థిక సాయం, విద్యార్థులకు రూ.5 లక్షల వరకు వడ్డీ రహిత ఆర్థిక సహాయం, మహిళలకు రూ.4,000 పింఛను.
బీఆర్‌ఎస్: ప్రధానంగా రైతుబంధు పెంపు, పెన్షన్ల పెంపు, రేషన్ షాపుల ద్వారా పేదలకు సన్న బియ్యం పంపిణీ, తెల్ల రేషన్‌కార్డు ఉన్న ప్రతి ఇంటికి రైతు బీమా తరహాలోనే రూ.5 లక్షల జీవితబీమా, అర్హులైన మహిళలకు నెలకు రూ.3 వేల భృతి, రూ.400కే సిలిండర్, ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితి రూ.15 లక్షలకు పెంపు, పేదలకు ఇళ్ల స్థలాలు, అగ్రవర్ణ పేదలకు రెసిడెన్షియల్ స్కూళ్లు, అస్సైన్డ్ భూములపై ఇక హక్కుదారులకే పూర్తి అధికారం.
బీఎస్పీ: ఐదేళ్లలో యువతకు 10 లక్షల ఉద్యోగాలు. భూమిలేని ప్రతి పేద కుటుంబానికి ఒక ఎకరా భూమి, మహిళా సంఘాలకు ఏటా లక్ష రూపాయలు, ఉచిత వాషింగ్ మిషన్లు, వృద్ధులకు వసతి గృహం, ఉచిత వైద్యం, దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు తోడ్పాటు, మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్, ప్రతి మండలం నుంచి 100 మంది విద్యార్థులకు విదేశీ విద్య, పల్లె, పట్టణాల్లోని వారికి 150 రోజుల ఉపాధి, రూ.15 లక్షల వరకు ఆరోగ్య బీమా, ఆరోగ్యానికి రూ.25 వేల కోట్ల బడ్జెట్, రూ.5 వేల కోట్లతో గల్ఫ్ కార్మికుల సంక్షేమ నిధి, 600 సబ్సిడీ క్యాంటీన్లు, ఇల్లు లేని వారికి 550 చ.గజాల స్థలం, ఇల్లు కట్టుకునే వారికి రూ.6 లక్షల ఆర్థిక సాయం.
నెగ్గడానికి షార్ట్‌కట్ మార్గాలు
సుస్థిర అభివృద్ధి కార్యక్రమాలే అట్టడుగు వర్గాల ప్రజల నిజమైన అభివృద్ధికి దోహదపడతాయి. సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిందే.. కానీ అవి వారికి ఉపాధి కల్పించే విధంగా ఉండాలి. పార్టీల మేనిఫెస్టోలు చూస్తుంటే విద్య, వైద్యం, యువత, ఉపాధికి సంబంధించిన అంశాలను అవి పట్టించుకోవడం లేదు. కేవలం డబ్బు పంపిణీ చేయడం ద్వారా ఎన్నికల్లో గెలవాలన్న తపనే రాజకీయ నాయకుల్లో కనిపిస్తోంది.
ఇది మంచిది కాదు. ఇప్పుడు ఇరవై ముప్పయ్ కోట్లు పెడితే తప్ప ఎన్నికల్లో నిలబడలేని పరిస్థితి ఉంది. ఎన్నికల్లో గెలిచాక అవినీతితో పెద్ద ఎత్తున సంపాదించాలనే దృష్టి ఉంటుంది తప్ప,అభివృద్ధి చేయాలనే తపన ఎందుకు ఉంటుంది? – ఆకునూరి మురళి, రిటైర్డ్ ఐఏఎస్
Comments
Please login to add a commentAdd a comment