public welfare schemes
-
సంక్షేమం భళా..మౌలికం ఎలా ?
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార సాధనే లక్ష్యంగా అన్ని రాజకీయ పక్షాలు సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్నాయి. ప్రధానంగా సంక్షేమాన్నే నమ్ముకుని ఎన్నికల హామీలిస్తున్నాయి. ప్రచారంలో కానీ, పార్టీ ప్రణాళికల్లో కానీ సంక్షేమ ఆధారిత అంశాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. అధికార భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), కాంగ్రెస్‌తో పాటు బీఎస్పీ కూడా ఇదే బాటలో నడుస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మాత్రం ఇంతవరకు మేనిఫెస్టో విడుదల చేయలేదు. ఇక బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) సంక్షేమ సూత్రాన్నే ప్రధానంగా అనుసరించినా.. అభివృద్ధి, ఉపాధి అంశాలకు కూడా చోటిస్తూ తన ఎన్నికల ప్రణాళిక విడుదల చేసింది. అయితే దేశాభివృద్ధికి కీలకమైన రెండు ప్రధానమైన అంశాలకు సంబంధించి ఏ పార్టీ కూడా స్పష్టమైన హామీలు ఇవ్వడం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కీలకమైన విద్య, వైద్యానికి సంబంధించి తమ విధానమేమిటో? బడ్జెట్లో ఏ మేరకు నిధులు పెంచుతారన్న అంశాలను ఎక్కడా చెప్పడం లేదు. ప్రస్తుత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ విద్య, వైద్యంపై చేసిన వ్యయం చాలా తక్కువగా ఉండటం గమనార్హం. కాగా అతి ప్రధానమైన మౌలిక సదుపాయాల కల్పనపై కూడా దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు ఉన్నాయి. సంక్షేమం సరే.. సంక్షేమ పథకాలను ఎవరూ తప్పుబట్టడం లేదని, అదే సమయంలో సుస్థిర అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల పెంపునకు దోహదపడే కార్యక్రమాలపై పార్టీలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందనే అభి ప్రాయం వ్యక్తమవుతోంది. విద్య, వైద్య రంగానికి బడ్జెట్లో కేటాయింపులు, చేస్తున్న వ్యయం పరిశీలిస్తే ఇది స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో బడ్జెట్లో కేటాయించిన నిధులు కూడా వ్యయం చేయడం లేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. విద్యపై వ్యయం ఎంత పెరిగితే.. భవిష్యత్ కు అంత పెట్టుబడి అనే అంశాన్ని పార్టీలు విస్మరిస్తున్నాయని అంటున్నారు. అలాగే రహదారుల అభివృద్ధి, ప్రభుత్వ ఉద్యోగాల కల్పన, యూనివర్సిటీలు, పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాల గురించి ప్రధాన పార్టీలు పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలు కూడా విన్పిస్తుండటం గమనార్హం. ఎన్నికల హామీలు ఇలా.. కాంగ్రెస్: ఆరు గ్యారంటీల పేరిట పూర్తిస్థాయిలో ప్రచారం నిర్వహిస్తోంది. వివిధ రకాల డిక్లరేషన్లు ప్రకటిస్తోంది. మరిన్ని సంక్షేమ పథకాలపై కూడా ఆ పార్టీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి మహాలక్ష్మి పేరిట ప్రతి మహిళకు రూ. 2,500, రూ.500కే గ్యాస్ సిలిండర్, బస్సుల్లో ఉచిత ప్రయాణం, రైతు భరోసా కింద ఏటా ఎకరాకు రూ.15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు, వరిపంట బోనస్ రూ.500, అన్ని కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, రూ.5 లక్షల ఆర్థిక సాయం, విద్యార్థులకు రూ.5 లక్షల వరకు వడ్డీ రహిత ఆర్థిక సహాయం, మహిళలకు రూ.4,000 పింఛను. బీఆర్ఎస్: ప్రధానంగా రైతుబంధు పెంపు, పెన్షన్ల పెంపు, రేషన్ షాపుల ద్వారా పేదలకు సన్న బియ్యం పంపిణీ, తెల్ల రేషన్‌కార్డు ఉన్న ప్రతి ఇంటికి రైతు బీమా తరహాలోనే రూ.5 లక్షల జీవితబీమా, అర్హులైన మహిళలకు నెలకు రూ.3 వేల భృతి, రూ.400కే సిలిండర్, ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితి రూ.15 లక్షలకు పెంపు, పేదలకు ఇళ్ల స్థలాలు, అగ్రవర్ణ పేదలకు రెసిడెన్షియల్ స్కూళ్లు, అస్సైన్డ్ భూములపై ఇక హక్కుదారులకే పూర్తి అధికారం. బీఎస్పీ: ఐదేళ్లలో యువతకు 10 లక్షల ఉద్యోగాలు. భూమిలేని ప్రతి పేద కుటుంబానికి ఒక ఎకరా భూమి, మహిళా సంఘాలకు ఏటా లక్ష రూపాయలు, ఉచిత వాషింగ్ మిషన్లు, వృద్ధులకు వసతి గృహం, ఉచిత వైద్యం, దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు తోడ్పాటు, మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్, ప్రతి మండలం నుంచి 100 మంది విద్యార్థులకు విదేశీ విద్య, పల్లె, పట్టణాల్లోని వారికి 150 రోజుల ఉపాధి, రూ.15 లక్షల వరకు ఆరోగ్య బీమా, ఆరోగ్యానికి రూ.25 వేల కోట్ల బడ్జెట్, రూ.5 వేల కోట్లతో గల్ఫ్ కార్మికుల సంక్షేమ నిధి, 600 సబ్సిడీ క్యాంటీన్లు, ఇల్లు లేని వారికి 550 చ.గజాల స్థలం, ఇల్లు కట్టుకునే వారికి రూ.6 లక్షల ఆర్థిక సాయం. నెగ్గడానికి షార్ట్‌కట్ మార్గాలు సుస్థిర అభివృద్ధి కార్యక్రమాలే అట్టడుగు వర్గాల ప్రజల నిజమైన అభివృద్ధికి దోహదపడతాయి. సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిందే.. కానీ అవి వారికి ఉపాధి కల్పించే విధంగా ఉండాలి. పార్టీల మేనిఫెస్టోలు చూస్తుంటే విద్య, వైద్యం, యువత, ఉపాధికి సంబంధించిన అంశాలను అవి పట్టించుకోవడం లేదు. కేవలం డబ్బు పంపిణీ చేయడం ద్వారా ఎన్నికల్లో గెలవాలన్న తపనే రాజకీయ నాయకుల్లో కనిపిస్తోంది. ఇది మంచిది కాదు. ఇప్పుడు ఇరవై ముప్పయ్ కోట్లు పెడితే తప్ప ఎన్నికల్లో నిలబడలేని పరిస్థితి ఉంది. ఎన్నికల్లో గెలిచాక అవినీతితో పెద్ద ఎత్తున సంపాదించాలనే దృష్టి ఉంటుంది తప్ప,అభివృద్ధి చేయాలనే తపన ఎందుకు ఉంటుంది? – ఆకునూరి మురళి, రిటైర్డ్ ఐఏఎస్ -
సైన్స్ అకాడమీ సాంకేతిక సలహాలివ్వాలి
హైదరాబాద్: ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు మరింత విజయవంతం కావాలంటే రాష్ట్ర సైన్స్ అకాడమీ ప్రభుత్వానికి శాస్త్ర, సాంకేతిక పరమైన సలహాలు, సూచనలు అందించాల్సిన అవసరమెంతైనా ఉందని పురపాలక, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు అన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహారోత్పత్తులు తయారు చేసేందుకు ఆధునిక పంటల విధానాలపై యువ శాస్త్రవేత్తలు పరిశోధనలు జరపాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు. సైన్స్ అకాడమీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)లో నిర్వహించిన యువ శాస్త్రవేత్తల అవార్డు ప్రదానోత్సవానికి హాజరైన మంత్రి మాట్లాడుతూ.. రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత రూ.25 వేల కోట్లు వెచ్చించి మంచినీటి సరఫరా, చెరువుల మరమ్మతులు, డ్యామ్‌ల నిర్మాణం చేపట్టామన్నారు. దీంతో వ్యవసాయ రంగం ప్రగతి పథంలో ముందుకు సాగుతోందన్నారు. ప్రస్తుతం పది మిలియన్ ఎకరాల భూమిలో సాగుబడి జరుగుతోందన్నారు. రాబోయే ఐదేళ్లలో మరో 8 లక్షల ఎకరాలను సాగుబడిలోకి తీసుకువచ్చేందుకు కృషి చేయనున్నట్లు చెప్పారు. అయితే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా మోనోపలి పంటల విధానం వల్ల అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంలో కొంత అంతరాయం జరుగుతుందన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు యువ శాస్త్రవేత్తలు కృషి చేయాలన్నారు. ప్రజలకు ఉపయోగపడే పరిశోధనలను సామాన్య మానవులకు తెలియజేయాల్సిన అవసరమెంతైనా ఉందన్నారు. నిరుద్యోగ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలి నిరుద్యోగ సమస్యను అధిగమించేందుకు పరిశోధనా సంస్థలు మార్గాలను కనుక్కోవాల్సిన అవసరముందన్నారు. ప్రజారోగ్యంపై కూడా దృష్టి సారించాలన్నారు. తక్కువ ఖర్చుతో రోగాల నివారణ జరిగే విధంగా మందుల తయారీ జరగాలని, ఆ దిశగా పరిశోధనా ఫలితాలు ఉండాలన్నారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన నలుగురు యువ శాస్త్రవేత్తలకు మంత్రి అవార్డులు, జ్ఞాపికలు అందజేశారు. అనంతరం పలు పుస్తకాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సెంట్రల్ వర్సిటీ మాజీ అధ్యాపకుడు ప్రొఫెసర్ గోవర్ధన్ మెహతా, సైన్స్ అకాడమీ ప్రతినిధులు, అధ్యాపకులు, పరిశోధనా విద్యార్థులు పాల్గొన్నారు. -
బాబుకు తెలిసింది స్కాములే
వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి ధ్వజం సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్కాములు తప్ప స్కీములు (ప్రజా సంక్షేమ పథకాలు) తెలియవని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి ధ్వజమెత్తారు. భూమన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తమకు మొత్తం 175 సీట్లు వస్తాయని చెప్పుకొంటున్న చంద్రబాబుకు 17 సీట్లకంటే ఎక్కువ రానే రావని భూమన జోస్యం చెప్పారు. ప్రజలు టీడీపీకి ఓట్లు వేస్తారనుకోవడం చంద్రబాబు భ్రమేనని తేల్చిచెప్పారు. బాబు పాల్పడుతున్న కుటిల రాజకీయాలను సమర్థిస్తే వచ్చే ఎన్నికల్లో టీడీపీకి పట్టే గతే బీజేపీకి కూడా పడుతుందని కరుణాకరరెడ్డి హెచ్చరించారు. ఆత్మస్థైర్యం కోల్పోయి ఎమ్మెల్యేల కొనుగోలు ‘‘చంద్రబాబు ఆత్మస్థైర్యం కోల్పోయి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు. బ్లాక్ మనీతో కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలంతా బ్లాక్ ఎమ్మెల్యేలే. మా పార్టీ(వైఎస్సార్సీపీ) ఎమ్మెల్యేలను బెదిరించి టీడీపీలో చేర్చుకుం టున్నారు. పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనను కూడా అలాగే చేర్చుకున్నారు. ’’ అని విమర్శించారు. ‘‘రాజ్యాంగ సవరణ చేయడం ద్వారా స్పీకర్ అధికారాలను ఎన్నికల సంఘానికి(ఈసీ) ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి’’ అని భూమన కరుణాకరరెడ్డి అన్నారు. -
దేశానికే ఆదర్శం వైఎస్సార్
సాక్షి, హైదరాబాద్: ప్రజా సంక్షేమ పథకాల అమలులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి యావత్ భారత దేశానికే ఒక రోల్ మోడల్‌గా నిలిచారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి కొనియాడారు. ప్రజల ప్రాథమిక అవసరాలైన విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్, పారిశ్రామిక రంగాలను దృష్టిలో పెట్టుకుని వైఎస్ చేపట్టిన కార్యక్రమాలు చిరస్మరణీయమన్నారు. వైఎస్ 66వ జయంతి సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సభలో మేకపాటి మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అమలు పర్చిన తీరు వైఎస్ రాజకీయ పరిణతికి, దక్షతకు నిలువెత్తు నిదర్శనాలని చెప్పారు. వైఎస్ జీవించి ఉంటే తెలుగు ప్రజల భవిష్యత్తు ఇలా ఉండేదికాదని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ పేద ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూశారు కనుకనే సీఎంగా తన పాల నలో అన్ని వర్గాల సమస్యలను నెరవేర్చడంలో నిమగ్నమయ్యారని పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొనియాడారు. 2003లో వైఎస్ తన పాదయాత్రతో రాజకీయాల్లో సంచలన శకాన్ని ప్రారంభించారని, తెలుగుజాతి ఉన్నంతవరకూ వైఎస్ ఆదర్శప్రాయులుగా నిలిచి పోతారని పీఏసీ సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు శ్లాఘించారు. వైఎస్ ఆశయాలను ఆయన కుమారుడు వైఎస్ జగన్నెరవేర్చగలడని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వైఎస్ సిద్ధాంతాలకు అనుగుణంగా జగన్ సాగిస్తున్న పోరాటానికి అందరమూ మద్దతునిచ్చి అంకితభావంతో పనిచేద్దామని జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. కేంద్ర కార్యాలయంలో తొలుత నేతలందరూ వైఎస్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. కేక్‌ను కట్ చేసి అందరికీ పంచారు. రక్తదాన శిబిరం నిర్వహణతో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, జంగా కృష్ణమూర్తి, కె.శివకుమార్, లక్ష్మీ పార్వతి, నల్లా సూర్యప్రకాష్, కొండా రాఘవరెడ్డి, హెచ్.ఎ.రెహ్మాన్, ఆదం విజయకుమార్, జి.సురేష్‌రెడ్డి, చల్లా మధుసూదనరెడ్డి, బీష్వ రవీందర్, పుత్తా ప్రతాపరెడ్డి, కర్నాటి ప్రభాకర్‌రెడ్డి, ప్రపుల్లరెడ్డి, మహ్మద్ ముస్తఫా, వెల్లాల రామ్మోహన్, డి.శ్రీలక్ష్మి, సందీప్‌కుమార్, కె.అమృతాసాగర్, ఎ.ఉదయభాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. రంగుల కలలు చూపుతున్న బాబు ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు రంగుల కలలు చూపిస్తున్నారంటూ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్ అందరి అభివృద్ధిని ఆకాంక్షిస్తే.. బాబు ఏకపక్ష ధోరణిలో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బాబు నైతిక విలువలకు త్రిలోదకాలు పలికారనడానికి ప్రకాశం, కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలేతార్కాణమన్నారు. రవీంద్రభారతిలో వైఎస్సార్ యువసేన అధ్యక్షుడు చింతల రాజశేఖర్ ఆధ్వర్యంలో బుధవారం వైఎస్సార్ 66వ జయంతిని ఘనంగా నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా శృతిలయ ఆర్ట్ అకాడమీ అధ్యక్షురాలు ఆమని బృందం వైఎస్సార్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఆలపించిన గీతాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. ఏపీ మండలి మాజీ విప్ వై. శివరామిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా హాజరైన మేకపాటి, పార్టీ సీనియర్ నేతలు బొత్స, ఉమ్మారెడ్డి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం 66 కేజీల కేక్‌ను కట్ చేసి, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. -
ప్రణాళిక చెప్పిన నిజాలు
ఆదిలాబాద్ అర్బన్ : ప్రభుత్వం ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో నిర్వహించిన ‘మన ఊరు.. మన ప్రణాళిక..’తో క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. కనీస సౌకర్యాలు, వసతులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల తీరు బయటపడింది. వీటిని అధికారులు ప్రభుత్వం నిర్దేశించిన నమూనాలో పొందుపర్చారు. జిల్లాలో 52 మండలు ఉండగా, 866 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రభుత్వానికి నివేదించే గ్రామస్థాయి ప్రణాళికల తయారీ శుక్రవారంతో ముగిసింది. మరో రెండు రోజుల్లో మండల స్థాయి ప్రణాళిక నివేదికలు పూర్తి చేసి, ఈ నెల 15లోగా ప్రభుత్వానికి ప్రతిపాదించే జిల్లా స్థాయి ప్రణాళిక తయారు కానుంది. ప్రభుత్వం సేకరించిన అంశాలను ఒకసారి పరిశీలిస్తే.. పక్కా గృహాలు జిల్లాలోని 866 గ్రామ పంచాయతీల్లో 95,700 కుటుంబాలు ఇంకా గుడిసెల్లోనే ఉంటున్నా యి. పక్కా గృహాలు లేని నిరుపేదలు కుటుం బాలు 1,06,008 ఉన్నాయి. ప్రభుత్వం ఏటా పక్కా గృహాల పేరిట ఇళ్లు మంజూరు చేస్తున్న అర్హులైన లబ్ధిదారులకు అందడం లేదు. వ్యక్తిగత మరుగుదొడ్లు జిల్లాలోని గ్రామాల్లో 6,11,226 ఇళ్లు ఉన్నాయి. ఇందులో వ్యక్తిగత మరుగుదొడ్లు గల ఇళ్లు 1,66,049, వ్యక్తిగత మరుగుదొడ్లు ఉండి ఉపయోగించని ఇళ్ల సంఖ్య 25,708 ఉన్నాయి. ఇందులో వ్యక్తిగత మరుగుదొడ్లు లేని ఇళ్లు 4,28,346 ఉన్నాయి. అయితే అధికారులు 3,96,945 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించారు. వివిధ రకాల పింఛన్లు జిల్లాలో ప్రస్తుతం 65 ఏళ్లు దాటిన వృద్ధులు 1,41,298 మంది ఉన్నారు. వృద్ధాప్య పింఛన్ మంజూరైన వారు 1,01,707 మంది ఉన్నారు. అర్హత కలిగి ఉండి పింఛన్లు రాని పేద వారు 1,84,464 మంది ఉన్నారు. గ్రామాల్లో వితంతువులు 82,231 మంది ఉన్నారు. ప్రస్తుతం పింఛన్లు మంజూరైన వితంతువులు 60,039 మంది ఉన్నారు. అర్హత కలిగి ఉండి పింఛన్లు రాని వితంతువులు 76,978 మంది ఉన్నారు. వికలాంగులు 31,998 మంది ఉన్నారు. పింఛన్లు మంజూరైన వికలాంగులు 20,656 ఉన్నారు. అర్హత కలిగి ఉండి పింఛన్ రాని పేద వికలాంగులు ఇంకా 58,787 మంది ఉన్నారు. 1,265 మంది చేనేత కార్మికుల కుటుంబాలు ఉన్నాయి. పింఛన్లు మంజూరైన చేనేత పనివారు 443 మంది ఉన్నారు. ఇంకా 447 మందికి అర్హత ఉన్న రావడం లేదు. రేషన్ కార్డులు జిల్లాలోని గ్రామాల్లో అర్హత ఉండి తెలుపు రేషన్ కార్డులు లేని కుటుంబాలు 1,14,905 ఉన్నాయి. గ్రామాల్లో 40,516 పింక్ రేషన్ కార్డులు ఉన్నాయి. పింక్ రేషన్ కార్డులకు అర్హత ఉన్న 3,745 మందికి కార్డులు లేవు. అన్నపూర్ణ కార్డులు 5,041 ఉన్నాయి. అర్హత ఉన్న అన్నపూర్ణ కార్డులు లేని వారు 7,407 మంది ఉన్నారు. అంత్యోదయ కార్డులు 52,210 ఉన్నాయి. అర్హత ఉండి అంత్యోదయ కార్డులు లేని వారు 22,864 మంది ఉన్నారు. బడికి వెళ్లని పిల్లలు జిల్లాలో 6 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలు 3,58,840 మం ది ఉండగా, ఇందులో 9,041 మంది పిల్లలు బడికి వెళ్ల డం లేదు. ఈ లెక్కన చూసుకుంటే 20 ఏళ్లలోపు ఉన్న పిల్లలు ఇంకా 45,425 మంది బడికి వెళ్లడం లేదు. పాఠశాలలు జిల్లాలో పాఠశాలలు 3,071 ఉన్నాయి. ఇందులో గదులు లేని పాఠశాలలు 1,268 ఉన్నాయి. మరుగుదొడ్లు గల పాఠశాలలు 1,138 ఉంటే, మరుగుదొడ్లు లేని పాఠశాలలు 1,933 ఉన్నాయి. 1,873 పాఠశాలలకు అటస్థలాలు, 2,440 బడులకు ప్రహరీ లేవు. చేతిపంపులు జిల్లాలో ఇప్పటి వరకు తాగునీరు అందుబాటులో లేని గ్రామాలు 959 ఉన్నాయి. 866 గ్రామ పంచాయతీల్లో 18,84 చేతిపంపులు పని చేస్తే, 4,807 చేతి పంపులు పని చేయడం లేదు. జిల్లాలో రక్షిత మంచినీటి సరఫరా ట్యాంకులు 1,450 పని చేస్తే, ఇంకా 630 ట్యాంకులు పని చేయడం లేదు. కాన్పులు 2013-14 సంవత్సరంలో 8,671 కాన్పులు ఇంట్లోనే జరిగాయి.అదే ఏడాదిలో ఐదేళ్లలోపు చిన్నారులు 847 మంది చనిపోయారు. 2013-14లో కాన్పు అయిన మూడు నెలలకే చనిపోయిన తల్లులు 58 మంది ఉ న్నారు. జిల్లాలో 2,661 లింకు రోడ్లు, 662 డంపింగ్ యార్డులు, 813 ఆట స్థలాలను అభివృద్ధి చేయాలి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 1,59,152 వీధిదీపాలు పని చేస్తే, 36,431 వీధిదీపాలు పని చేయడం లేదు. -
లలిత కళలను పోషిస్తేనే గుర్తింపు
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ విజయవాడ కల్చరల్ : ప్రజా సంక్షేమ పథకాల అమలుతోపాటు, లలిత కళలను పోషించినప్పుడే పాలకులు చరిత్రలో మిగిలిపోతారని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్ర కుమార్ అన్నారు. తెలుగు ప్రపంచ చిత్రకారుల సమాఖ్య (ట్యాప్) ఆదివారం సిద్ధార్థ కళాశాలలో నిర్వహించిన చిత్రకళా ప్రదర్శన, ఉగాది పురస్కార సభలో ఆయన ముఖ్యఅతి థిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రకుమార్ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ జీవించే కళను నేర్చుకోవాలని సూచించారు. ఇవ్వడంలో ఉన్న ఆనందం తీసుకోవడంలో ఉండదన్నారు. పదవులు శాశ్వతం కాదని, ప్రజా సంక్షేమ పథకాల అమలుతోపాటు, లలిత కళలను పోషించినప్పుడే పాలకులు చరిత్రలో మిగిలిపోతారని పేర్కొన్నారు. శ్రీకృష్ణదేవరాయలు, అశోకుడు కళలను, కళాకారులను గౌరవించడం వల్లే చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. పాలకులు ఆదిశగా అడుగులు వేయాలని కోరారు. చిత్రకారులు, కవులు ప్రతి సమాజిక సమస్యపైనా స్పందించి దానికి ఒక రూపం ఇస్తారని, అదే చరిత్రలో మిగిలిపోతుందని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకూ ప్రత్యేకంగా లలితకళా అకాడమీలు ఉండాలని ఆకాంక్షించారు. ఆంధ్రరాష్ట్రంలో ఏర్పడిన లలితకళా అకాడమీని సీమాంధ్రకు తరలించాలని, అప్పుడే కళాకారులకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. సీనియర్ పాత్రకేయుడు తుర్లపాటి కుటుంబరావు మాట్లాడుతూ 1993లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ అకాడమీలను రద్దుచేసిందని గుర్తుచేశారు. వాటిని పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజల తరుఫున కోరుతున్నానని అన్నారు. బీసీ సంక్షేమం, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాల్లాడుతూ కళలు, కళాకారులను ప్రతి ఒక్కరూ గౌరవిం చాలని కోరారు. తెలుగు ప్రపంచ చిత్ర కళాకారుల సమాఖ్య నిర్వహణలో విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు, ప్రసిద్ధ చిత్రకారుడు తోట వైకుంఠం, సి.ఎస్.ఎన్.పట్నాయక్, ఎస్.ఎం. పీరన్కు ఈ సందర్భంగా ఉగాది పురస్కారాలు అందజేశారు. ఆకట్టుకున్న చిత్రకళా ప్రదర్శన సీమాంధ్రలోని 13 జిల్లాల నుంచి వచ్చిన చిత్రకారుల తాము రూపొందించిన వందలాది చిత్రాలను ఈ సందర్భంగా ప్రదర్శించారు. రాష్ట్రవిభజన నేపథ్యంలో ఆళ్లగడ్డకు చెందిన విజయ్ చిత్రించిన దగాపడ్డ తమ్ముడు చిత్రం పలువురి ప్రశంశలు అందుకుంది. సాయంత్రం జరిగిన కళాకారుల సదస్సులో పలుకీలకమైన నిర్ణమాలు తీసుకున్నారు. లలిత కళాల అకాడమీని పుననుద్ధరించాలని, కళాకారులకు సముచితమైన స్థానం ఇవ్వాలని, 13 జిల్లాప్రతినిధులతో కమిటీ ఏర్పాటుచేసి, కళాకారుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. -
వైఎస్సార్‌సీపీతోనే అభివృద్ధి సాధ్యం: దినేష్‌రెడ్డి
కుషాయిగూడ, న్యూస్‌లైన్: ఒంట్లో శక్తి ఉన్నంత వరకూ ప్రజాసేవకే అంకితమవుతానని వైఎస్సార్సీపీ మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి దినేష్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఈసీఐఎల్ మహేష్ నగర్లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయం, ప్రచార రథాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాల అమలు కేవలం తమ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందన్నారు. రెండు ప్రాంతాల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పార్టీ చర్లపల్లి డివిజన్ అధ్యక్షుడు మేకల నవీన్ నాయుడు.. దినేష్‌రెడ్డికి మహానేత వైఎస్ భారీ చిత్రపటాన్ని బహుకరించారు. కార్యక్రమంలో నాయకులు కుమార్ యాదవ్, పురుషోత్తంరెడ్డి, డాక్టర్ కొండారెడ్డి, విజయ్ తదితరులు పాల్గొన్నారు కీసర: దినేష్‌రెడ్డి సోమవారం కీసరలో రోడ్‌షో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తమ పార్టీకి మహిళలు బ్రహ్మరథం పడుతున్నారని, వారి అండతో వైఎస్సార్ సీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం దినేష్‌రెడ్డి కీసరగుట్టలో శివుడి అభిషేక సేవలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా సేవాదళ్ కన్వీనర్ సుఖేందర్‌రెడ్డి, కీసర ఇన్ చార్జి ముజీబ్ పాల్గొన్నారు. -
జననేత జగనే ముఖ్యమంత్రి : కొడాలి నాని
గుడ్లవల్లేరు, న్యూస్‌లైన్ : ఈ రాష్ట్రానికి మాట తప్పని, మడమ తిప్పని జననేత వై.ఎస్.జగన్మోహనరెడ్డే ముఖ్యమంత్రి కానున్నారని గుడివాడ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అసెంబ్లీ అభ్యర్థి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) స్పష్టం చేశారు. కౌతవరంలో శనివారం రాత్రి వైఎస్సార్ సీపీలో పలువురు భారీ సంఖ్యలో చేరారు. ఆయన మాట్లాడుతూ తండ్రి ఆశయసాధన కోసం ప్రజా సంక్షేమ పథకాల్ని అమలు చేసేందుకే జగన్ మోహనరెడ్డి వైఎస్సార్ సీపీని స్థాపిం చారన్నారు. అందుకోసం 16నెలల జైలు అనుభవించారని గుర్తు చేశారు. ఎంత కాలం బతికామని కాదు ఎలా బతికామన్న సిద్ధాంతానికి నిలుస్తూ.. ప్రాణం పోగొట్టుకున్నా మాట తప్పని నాయకుడు తమ పార్టీ అధినేత జగన్ అని ఆయన అభివర్ణించారు. ఎన్టీఆర్‌ను బహిష్కరించిన బాబు.. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయిన చంద్రబాబు ఓటమి పాలై, తర్వాత తన మామ ఎన్టీఆర్ కాళ్ల మీద పడి మళ్లీ టీడీపీలో స్థానం సంపాదించుకున్నాడని కొడాలి నాని విమర్శించారు. నక్క వినయాలతో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచేందుకు పొంచి ఉన్న బాబు 1994లో అన్నగారిని పార్టీ నుంచి బహిష్కరించి తన కుయుక్తులతో ఆ పీఠాన్ని దక్కించుకున్నాడని ఆరోపించారు. ఇటీవల బీజేపీతో పొత్తు పెట్టుకుని...రాత్రికి రాత్రి వద్దంటూ... మళ్లీ కొన్ని సీట్లను తనకు అనుకూలంగా మలుచుకుని నమ్మక ద్రోహానికి చిరునామాగా నిలిచాడని ఎద్దేవా చేశారు. అంటరాని వ్యక్తి కొడాలి నాని అయితే మీరెవరు? టీడీపీ ఎమ్మెల్యేగా తన నియోజకవర్గ ప్రజలకు ఆ పార్టీలో ఉన్నా ఈ సారి న్యాయం చేయాలేనన్న నమ్మకంతో జగన్ పార్టీలో చేరానని కొడాలి నాని అన్నారు. అంతమాత్రాన తాను ఏదో ఒక సామాజిక వర్గానికి అన్యాయం చేసిన వ్యక్తిగా అంటరాని వాడిగా కొందరు చిత్రీకరిస్తున్నారన్నారు. అలాంటపుడు చంద్రబాబు కాంగ్రెస్ నుంచి టీడీపీకి, రావి వెంకటేశ్వరరావు పీఆర్పీ నుంచి టీడీపీకి, పిన్నమనేని వెంకటేశ్వరరావు కాంగ్రెస్ నుంచి టీడీపీకి వస్తే వారిని ఏమని అభివర్ణించాలని ప్రశ్నించారు. పులిచింతల మహానేత ఘనతే... వైఎస్ హయాంకు ముందు నాలుగు టీఎంసీలు మాత్రమే జిల్లాకు సాగునీరు అందించే పరిస్థితి ఉండేదని, ఆధునికీకరణ పనుల్లో భాగంగా పులిచింతల ప్రాజెక్ట్‌ను రూ.700కోట్లతో నిర్మించడమనేది ఆయన ఘనతేనని కొడాలి నాని గుర్తు చేశారు. మరో కాటన్ దొరగా మహానేత రైతుల గుండెల్లో చెరగని ముద్ర వేశారన్నారు. వైఎస్సార్ సీపీ నేతలు కోగంటి ధనుంజయ, కొసరాజు వెంకటాద్రిచౌదరి, వడ్లమూడి నాగమోహన్(చిన్ని), అల్లూరి లక్ష్మణరావు, వడ్లమూడి యుగంధర్, కోటప్రోలు నాగు, గ్రామ సర్పంచి పడమటి సుజాత తదితరులున్నారు.