- హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్
విజయవాడ కల్చరల్ : ప్రజా సంక్షేమ పథకాల అమలుతోపాటు, లలిత కళలను పోషించినప్పుడే పాలకులు చరిత్రలో మిగిలిపోతారని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్ర కుమార్ అన్నారు. తెలుగు ప్రపంచ చిత్రకారుల సమాఖ్య (ట్యాప్) ఆదివారం సిద్ధార్థ కళాశాలలో నిర్వహించిన చిత్రకళా ప్రదర్శన, ఉగాది పురస్కార సభలో ఆయన ముఖ్యఅతి థిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చంద్రకుమార్ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ జీవించే కళను నేర్చుకోవాలని సూచించారు. ఇవ్వడంలో ఉన్న ఆనందం తీసుకోవడంలో ఉండదన్నారు. పదవులు శాశ్వతం కాదని, ప్రజా సంక్షేమ పథకాల అమలుతోపాటు, లలిత కళలను పోషించినప్పుడే పాలకులు చరిత్రలో మిగిలిపోతారని పేర్కొన్నారు. శ్రీకృష్ణదేవరాయలు, అశోకుడు కళలను, కళాకారులను గౌరవించడం వల్లే చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు.
పాలకులు ఆదిశగా అడుగులు వేయాలని కోరారు. చిత్రకారులు, కవులు ప్రతి సమాజిక సమస్యపైనా స్పందించి దానికి ఒక రూపం ఇస్తారని, అదే చరిత్రలో మిగిలిపోతుందని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకూ ప్రత్యేకంగా లలితకళా అకాడమీలు ఉండాలని ఆకాంక్షించారు. ఆంధ్రరాష్ట్రంలో ఏర్పడిన లలితకళా అకాడమీని సీమాంధ్రకు తరలించాలని, అప్పుడే కళాకారులకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
సీనియర్ పాత్రకేయుడు తుర్లపాటి కుటుంబరావు మాట్లాడుతూ 1993లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ అకాడమీలను రద్దుచేసిందని గుర్తుచేశారు. వాటిని పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజల తరుఫున కోరుతున్నానని అన్నారు. బీసీ సంక్షేమం, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాల్లాడుతూ కళలు, కళాకారులను ప్రతి ఒక్కరూ గౌరవిం చాలని కోరారు. తెలుగు ప్రపంచ చిత్ర కళాకారుల సమాఖ్య నిర్వహణలో విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు, ప్రసిద్ధ చిత్రకారుడు తోట వైకుంఠం, సి.ఎస్.ఎన్.పట్నాయక్, ఎస్.ఎం. పీరన్‌కు ఈ సందర్భంగా ఉగాది పురస్కారాలు అందజేశారు.
ఆకట్టుకున్న చిత్రకళా ప్రదర్శన
సీమాంధ్రలోని 13 జిల్లాల నుంచి వచ్చిన చిత్రకారుల తాము రూపొందించిన వందలాది చిత్రాలను ఈ సందర్భంగా ప్రదర్శించారు. రాష్ట్రవిభజన నేపథ్యంలో ఆళ్లగడ్డకు చెందిన విజయ్ చిత్రించిన దగాపడ్డ తమ్ముడు చిత్రం పలువురి ప్రశంశలు అందుకుంది. సాయంత్రం జరిగిన కళాకారుల సదస్సులో పలుకీలకమైన నిర్ణమాలు తీసుకున్నారు. లలిత కళాల అకాడమీని పుననుద్ధరించాలని, కళాకారులకు సముచితమైన స్థానం ఇవ్వాలని, 13 జిల్లాప్రతినిధులతో కమిటీ ఏర్పాటుచేసి, కళాకారుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.