దేశానికే ఆదర్శం వైఎస్సార్ | nation Ideal YSR | Sakshi
Sakshi News home page

దేశానికే ఆదర్శం వైఎస్సార్

Published Thu, Jul 9 2015 4:42 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM

nation Ideal YSR

సాక్షి, హైదరాబాద్: ప్రజా సంక్షేమ పథకాల అమలులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి యావత్ భారత దేశానికే ఒక రోల్ మోడల్‌గా నిలిచారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి కొనియాడారు. ప్రజల ప్రాథమిక అవసరాలైన విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్, పారిశ్రామిక రంగాలను దృష్టిలో పెట్టుకుని వైఎస్ చేపట్టిన కార్యక్రమాలు చిరస్మరణీయమన్నారు. వైఎస్ 66వ జయంతి సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సభలో మేకపాటి మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అమలు పర్చిన తీరు వైఎస్ రాజకీయ పరిణతికి, దక్షతకు నిలువెత్తు నిదర్శనాలని చెప్పారు.

వైఎస్ జీవించి ఉంటే తెలుగు ప్రజల భవిష్యత్తు ఇలా ఉండేదికాదని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ పేద ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూశారు కనుకనే సీఎంగా తన పాల నలో అన్ని వర్గాల సమస్యలను నెరవేర్చడంలో నిమగ్నమయ్యారని పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొనియాడారు. 2003లో వైఎస్ తన పాదయాత్రతో రాజకీయాల్లో సంచలన శకాన్ని ప్రారంభించారని, తెలుగుజాతి ఉన్నంతవరకూ వైఎస్ ఆదర్శప్రాయులుగా నిలిచి పోతారని పీఏసీ సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు శ్లాఘించారు.  

వైఎస్ ఆశయాలను ఆయన కుమారుడు వైఎస్ జగన్‌నెరవేర్చగలడని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వైఎస్ సిద్ధాంతాలకు అనుగుణంగా జగన్ సాగిస్తున్న పోరాటానికి అందరమూ మద్దతునిచ్చి అంకితభావంతో పనిచేద్దామని జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. కేంద్ర కార్యాలయంలో తొలుత నేతలందరూ వైఎస్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. కేక్‌ను కట్ చేసి అందరికీ పంచారు. రక్తదాన శిబిరం నిర్వహణతో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.

ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, జంగా కృష్ణమూర్తి, కె.శివకుమార్, లక్ష్మీ పార్వతి, నల్లా సూర్యప్రకాష్, కొండా రాఘవరెడ్డి, హెచ్.ఎ.రెహ్మాన్, ఆదం విజయకుమార్, జి.సురేష్‌రెడ్డి, చల్లా మధుసూదనరెడ్డి, బీష్వ రవీందర్, పుత్తా ప్రతాపరెడ్డి, కర్నాటి ప్రభాకర్‌రెడ్డి,  ప్రపుల్లరెడ్డి, మహ్మద్ ముస్తఫా, వెల్లాల రామ్మోహన్, డి.శ్రీలక్ష్మి, సందీప్‌కుమార్, కె.అమృతాసాగర్, ఎ.ఉదయభాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.
 
రంగుల కలలు చూపుతున్న బాబు
ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు రంగుల కలలు చూపిస్తున్నారంటూ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్ అందరి అభివృద్ధిని ఆకాంక్షిస్తే.. బాబు ఏకపక్ష ధోరణిలో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బాబు నైతిక విలువలకు త్రిలోదకాలు పలికారనడానికి ప్రకాశం, కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలేతార్కాణమన్నారు. రవీంద్రభారతిలో వైఎస్సార్ యువసేన అధ్యక్షుడు చింతల రాజశేఖర్ ఆధ్వర్యంలో బుధవారం వైఎస్సార్ 66వ జయంతిని ఘనంగా నిర్వహించారు.

సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా శృతిలయ ఆర్ట్ అకాడమీ అధ్యక్షురాలు ఆమని బృందం వైఎస్సార్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఆలపించిన గీతాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. ఏపీ మండలి మాజీ విప్ వై. శివరామిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా హాజరైన మేకపాటి, పార్టీ సీనియర్ నేతలు బొత్స, ఉమ్మారెడ్డి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం 66 కేజీల కేక్‌ను కట్ చేసి, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement