వైఎస్ పథకాలతో పేదరికం తగ్గింది
- లోక్‌సభలో మేకపాటి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పథకాల కారణంగా పేదరికం తగ్గిందని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి చెప్పారు. 2004 నుంచి 2014 మధ్య కాలంలో రాష్ట్రంలో పేదరికం 29.5 శాతం నుంచి 9.5 శాతానికి తగ్గిందని తెలిపారు. రాష్ట్ర సీఎంగా వై.ఎస్.రాజశేఖరరెడ్డి అమలు చేసిన ఉపాధి, సంక్షేమ పథకాలే ఇందుకు కారణమని తెలిపారు.
సోమవారం లోక్‌సభలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారు వలసబాట పట్టకుండా తెచ్చిన ఉపాధి హామీ చట్టం మంచి ఫలితాలనే ఇచ్చిందనీ దీనిని కొనసాగించాలనీ కోరారు.
వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి హామీతో పాటు ఉచిత విద్యుత్తు, కిలో 2 రూపాయల బియ్యం పథకం, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ, ఇందిరమ్మ ఇళ్లు వంటి సంక్షేమ పథకాలు అమలుచేశారనీ తద్వారా 9.5 శాతానికి పేదరికం తగ్గిందన్నారు.