వైఎస్ ఉంటే మరిన్ని మంచి పనులు జరిగేవి
ప్రధాని మోదీ కూడా మరిన్ని పథకాలు తేవాలి: ఎంపీ మేకపాటి
సాక్షి, న్యూఢిల్లీ: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో మరిన్ని మంచి పనులు జరిగేవని వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి చెప్పారు. వైఎస్ పేదల్లో పేదలకు సైతం ఆహార, విద్యా, ఆరోగ్య భద్రత అందించారని తెలిపారు. సామాజిక న్యాయ శాఖ బడ్జెట్ పద్దులపై శుక్రవారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘దేశంలోని పౌరులందరూ అక్షరాస్యులైతే సమాజంలోని అన్ని రుగ్మతలు రూపుమాసిపోతాయి. అందువల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశ పౌరులందరికీ విద్యను అందించాలి. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అట్టడుగు వర్గాల అభ్యున్నతికి అనేక పథకాలు తెచ్చింది.
ఎస్సీ, ఎస్టీ ప్రజలు కూడా వాణిజ్యవేత్తలుగా ఎదిగేందుకు అనేక అవకాశాలను కల్పిస్తోంది. అలాగే మరిన్ని పథకాలను తేవడం ద్వారా అట్టడుగు వర్గాల జీవితాలు మెరుగవ్వాలి. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలు తెచ్చారు. పేదలకు ఆహార భద్రత కల్పించారు. ఆరోగ్య, విద్యాభద్రత కూడా కల్పించారు. తద్వారా పేద పిల్లలు ప్రస్తుతం ఇంజనీర్లయ్యారు. వైద్యులయ్యారు. పేదల్లో పేదలు కూడా ఈ రోజు విద్యను పొందారంటే దానికి కారణం ఆయన అందించిన సంక్షేమ పథకాలే. ఆయన ఈ పథకాలు ప్రారంభించాక ఇతర రాష్ట్రాలు కూడా వాటిని అనుసరించాయి.
వైఎస్ ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కూడా కల్పించారు. ముస్లింలు, దళిత క్రైస్తవులను కూడా ఎస్సీలుగా పరిగణించాలని ఆయన ఆకాంక్షించారు. ఆయన బతికి ఉంటే ఇలాంటి మరిన్ని మంచి పనులు జరిగేవి..’ అని మేకపాటి చెప్పారు. సాధారణ వ్యక్తి నుంచి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన మోదీ కూడా ఇంకా అనేక సంక్షేమ పథకాలు తెస్తారని భావిస్తున్నట్లు చెప్పారు.