జననేత జగనే ముఖ్యమంత్రి : కొడాలి నాని
గుడ్లవల్లేరు, న్యూస్‌లైన్ : ఈ రాష్ట్రానికి మాట తప్పని, మడమ తిప్పని జననేత వై.ఎస్.జగన్‌మోహనరెడ్డే ముఖ్యమంత్రి కానున్నారని గుడివాడ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అసెంబ్లీ అభ్యర్థి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) స్పష్టం చేశారు. కౌతవరంలో శనివారం రాత్రి వైఎస్సార్ సీపీలో పలువురు భారీ సంఖ్యలో చేరారు.
ఆయన మాట్లాడుతూ తండ్రి ఆశయసాధన కోసం ప్రజా సంక్షేమ పథకాల్ని అమలు చేసేందుకే జగన్ మోహనరెడ్డి వైఎస్సార్ సీపీని స్థాపిం చారన్నారు. అందుకోసం 16నెలల జైలు అనుభవించారని గుర్తు చేశారు. ఎంత కాలం బతికామని కాదు ఎలా బతికామన్న సిద్ధాంతానికి నిలుస్తూ.. ప్రాణం పోగొట్టుకున్నా మాట తప్పని నాయకుడు తమ పార్టీ అధినేత జగన్ అని ఆయన అభివర్ణించారు.
ఎన్టీఆర్‌ను బహిష్కరించిన బాబు..
టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయిన చంద్రబాబు ఓటమి పాలై, తర్వాత తన మామ ఎన్టీఆర్ కాళ్ల మీద పడి మళ్లీ టీడీపీలో స్థానం సంపాదించుకున్నాడని కొడాలి నాని విమర్శించారు. నక్క వినయాలతో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచేందుకు పొంచి ఉన్న బాబు 1994లో అన్నగారిని పార్టీ నుంచి బహిష్కరించి తన కుయుక్తులతో ఆ పీఠాన్ని దక్కించుకున్నాడని ఆరోపించారు. ఇటీవల బీజేపీతో పొత్తు పెట్టుకుని...రాత్రికి రాత్రి వద్దంటూ... మళ్లీ కొన్ని సీట్లను తనకు అనుకూలంగా మలుచుకుని నమ్మక ద్రోహానికి చిరునామాగా నిలిచాడని ఎద్దేవా చేశారు.
అంటరాని వ్యక్తి కొడాలి నాని అయితే మీరెవరు?
టీడీపీ ఎమ్మెల్యేగా తన నియోజకవర్గ ప్రజలకు ఆ పార్టీలో ఉన్నా ఈ సారి న్యాయం చేయాలేనన్న నమ్మకంతో జగన్ పార్టీలో చేరానని కొడాలి నాని అన్నారు. అంతమాత్రాన తాను ఏదో ఒక సామాజిక వర్గానికి అన్యాయం చేసిన వ్యక్తిగా అంటరాని వాడిగా కొందరు చిత్రీకరిస్తున్నారన్నారు. అలాంటపుడు చంద్రబాబు కాంగ్రెస్ నుంచి టీడీపీకి, రావి వెంకటేశ్వరరావు పీఆర్పీ నుంచి టీడీపీకి, పిన్నమనేని వెంకటేశ్వరరావు కాంగ్రెస్ నుంచి టీడీపీకి వస్తే వారిని ఏమని అభివర్ణించాలని ప్రశ్నించారు.
పులిచింతల మహానేత ఘనతే...
వైఎస్ హయాంకు ముందు నాలుగు టీఎంసీలు మాత్రమే జిల్లాకు సాగునీరు అందించే పరిస్థితి ఉండేదని, ఆధునికీకరణ పనుల్లో భాగంగా పులిచింతల ప్రాజెక్ట్‌ను రూ.700కోట్లతో నిర్మించడమనేది ఆయన ఘనతేనని కొడాలి నాని గుర్తు చేశారు. మరో కాటన్ దొరగా మహానేత రైతుల గుండెల్లో చెరగని ముద్ర వేశారన్నారు. వైఎస్సార్ సీపీ నేతలు కోగంటి ధనుంజయ, కొసరాజు వెంకటాద్రిచౌదరి, వడ్లమూడి నాగమోహన్(చిన్ని), అల్లూరి లక్ష్మణరావు, వడ్లమూడి యుగంధర్, కోటప్రోలు నాగు, గ్రామ సర్పంచి పడమటి సుజాత తదితరులున్నారు.