సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతలో దూకుడుగా ముందుకెళ్తున్న భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ప్రచార వ్యూహానికి మరింత పదును పెడుతోంది. వరుసగా పెద్ద సంఖ్యలో బహిరంగ సభలు, రోడ్‌షోలు, స్థానికంగా అభ్యర్థులు పాల్గొనే ప్రచార సభలతో.. ఏ నియోజకవర్గాన్ని, వాటి పరిధిలోని గ్రామాలను వదలకుండా ‘కార్పెట్ బాంబింగ్’ను తలపించేలా ‘కార్పెట్ కాన్వాసింగ్ (ప్రచారం)’ నిర్వహించాలని నిర్ణయించింది.
ప్రతి కార్యక్రమానికి భారీగా జన సమీకరణ చేయాలని, ప్రతిపక్షాలను ఉక్కిరిబి క్కిరి చేసేలా వ్యూహాలను అమలు చేయాలని ఆలోచనకు వచ్చింది. దీనికి సంబంధించి బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం ప్రగతిభవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మంత్రి తన్నీరు హరీశ్‌రావులతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు.
ఎన్నికల ప్రచారం, జన సమీకరణ, ఇతర పార్టీల నుంచి చేరికలు, పార్టీ నేతల మధ్య సమన్వయం తదితర అంశాలపై చర్చించారు. పార్టీ అనుసరించాల్సిన భవిష్యత్ కార్యాచరణపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో పలువురు కీలక అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన అంశంపైనా ఈ భేటీలో చర్చించినట్టు తెలిసింది.
ఎక్కడా వదలకుండా..
సీఎం కేసీఆర్ ఈ నెల 15 నుంచి వచ్చే నెల తొమ్మిదో తేదీ వరకు 17 రోజుల్లో 41 బహిరంగ సభల్లో పాల్గొనేలా ఇప్పటికే షెడ్యూల్ ఖరారైంది. 10న నామినేషన్ల గడువు ముగిసి, తుది అభ్యర్థులు ఖరారవుతారు. ఆ తర్వాత మరో 40 నుంచి 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ పాల్గొనేలా సభల షెడ్యూల్ రూపకల్పన చేస్తున్నారు. ‘కార్పెట్ బాంబింగ్’ తరహాలో వరుసగా అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం సాగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సీఎం పాల్గొనే సభలన్నింటికీ భారీ జన సమీకరణ చేయాలని నిర్ణయించారు. మరోవైపు కేటీఆర్, హరీశ్ సుమారు 60కిపైగా నియోజకవర్గాల్లో రోడ్‌షోలలో పాల్గొననున్నారు.
గ్రేటర్ పరిధిలో కేటీఆర్, ఉమ్మడి మెదక్ జిల్లాలో హరీశ్‌రావు స్థానిక ప్రచార ఇన్‌చార్జులుగా ఉంటూనే.. తాము పోటీచేసే నియోజకవర్గాల్లో, ఇతర చోట్ల సమన్వయ బాధ్యతలను చూడాల్సి ఉండనుంది. ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ తదితరులు పార్టీలో సమన్వయంతోపాటు ఎన్నికల ప్రచారంలో క్రియాశీలకంగా పనిచేయనున్నారు.
ఇక పార్టీ అభ్యర్థులపై ఒత్తిడి తగ్గించడం, ఇతర కీలక నేతలతో సమన్వయం కోసం కేసీఆర్ నియోజకవర్గాల వారీగా పార్టీ ఇన్‌చార్జుల నియామకాన్ని చేపట్టారు. ప్రస్తుతానికి 54 మంది పేర్లు ఖరారు చేశారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ కీలక నేతలు ఈ ఇన్‌చార్జుల జాబితాలో ఉన్నారు. ఇక నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించే బాధ్యతను హరీశ్‌రావుకు సీఎం కేసీఆర్ అప్పగించారు.
‘వార్ రూమ్’తో వ్యూహాల అమలు
బీఆర్‌ఎస్ ఎన్నికల వ్యూహాలను పక్కాగా అమలు చేసేందుకు ఇప్పటికే ప్రత్యేక వార్‌రూమ్‌ను ఏర్పాటు చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ, అభ్యర్థులతోపాటు విపక్షాల సమగ్ర సమాచారాన్ని క్షణాల్లో విశ్లేషించేలా సిద్ధం చేశారు. బూత్‌స్థాయి నుంచీ పార్టీల బలాలు, బలహీనతలు, స్థానికంగా ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు, సామాజికవర్గాల వారీగా ఓటర్ల వివరాలు వంటివన్నీ అందుబాటులో పెట్టారు. పార్టీ సోషల్ మీడియా వింగ్ బాధ్యులు జగన్మోహన్‌రావు, దినేశ్ చౌదరి, సతీశ్‌రెడ్డి, దాసోజు శ్రవణ్ తదితరులు వార్‌రూమ్ కార్యకలాపాలను సమన్వయం చేస్తున్నారు.
చేరికలపై మరింత ఫోకస్
బూత్ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు విపక్షాల్లోని బలమైన నేతలెవరు, వారిలో బీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఉన్న అవకాశం, పార్టీలో చేర్చుకునేందుకు తీసుకోవాల్సిన చొరవపై ఓ ప్రైవేటు సర్వే సంస్థ ఎప్పటికప్పుడు బీఆర్‌ఎస్ పెద్దలకు సమాచారాన్ని చేరవేస్తోంది. దీని ఆధారంగా ఇతర పార్టీల నుంచి చేరికలను వేగవంతం చేయాలని నేతలు భావిస్తున్నారు. విపక్షాల్లో టికెట్ దక్కని అసంతృప్తులను బీఆర్‌ఎస్ గూటికి చేర్చే వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డితోపాటు ఓ మాజీ మంత్రి త్వరలో బీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు తెలిసింది.
సాంస్కృతిక బృందానికి దిశానిర్దేశం
కవి గాయకుడు ఏపూరి సోమన్న, మిట్టపల్లి సురేందర్ గురువారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా బహిరంగ సభలు, సమావేశాలు, రోడ్‌షోలతోపాటు ఎన్నికల ప్రచారంలో కీలకమైన సాంస్కృతిక, కళా బృందాలు ఏమేం చేయాలన్న దానిపై వారికి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిని చాటడంతోపాటు తెలంగాణ ఉద్యమకాలం నాటి సెంటిమెంటును రగిల్చేలా ఆటపాటలు ఉండాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment