సోషల్‌ మీడియాలో హోరెత్తించండి | KTR Harish Rao direction For war room and constituency incharges | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియాలో హోరెత్తించండి

Published Mon, Oct 23 2023 4:12 AM | Last Updated on Mon, Oct 23 2023 4:12 AM

KTR Harish Rao direction For war room and constituency incharges - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్, హరీశ్‌రావు

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల ప్రచారంలో భాగంగా సభలు, సమావేశాలు నిర్వహించడంతో పాటు ప్రసార, సామాజిక మాధ్యమాలను విరివిగా ఉపయోగించుకోవాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు పార్టీ నేతలకు సూచించారు. ఓట ర్లను ప్రభావితం చేయడంలో సామాజిక మాధ్య మాల పాత్రను కూడా దృష్టిలో పెట్టుకుని ప్రచార వ్యూహం రూపొందించుకోవాలన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని జల విహార్‌లో బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జిలు, ముఖ్య ప్రచారకర్తలు, వార్‌ రూమ్‌ ఇన్‌చార్జిల సమావేశం జరిగింది.

కేటీఆర్‌తో పాటు మంత్రి హరీశ్‌రావు హాజరై ఎన్నికల ప్రచారం, సమన్వయం తదితర అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ప్రతి నియోజక వర్గానికి వార్‌ రూమ్‌తో పాటు పర్యవేక్షణకు సెంట్రల్‌ వార్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు కేటీఆర్‌ వెల్లడించారు. ఈ వార్‌ రూమ్‌లలో 380 మందికి పైగా పాలుపంచుకుంటున్నారన్నారు. సెంట్రల్‌ వార్‌ రూమ్‌ ద్వారా అందే సూచనలు, ఆదేశాలను క్షేత్ర స్థాయిలో అమలయ్యేలా ఇన్‌చార్జిలు బాధ్యత తీసుకోవాలని చెప్పారు.
 
వాట్సాప్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌ లాంటివి వాడండి
2014 ఎన్నికల తర్వాత సోషల్‌ మీడియా ప్రాధాన్యత పెరిగిందని, మోదీ కూడా సోషల్‌ మీడియాను అడ్డుపెట్టుకుని ప్రధాని స్థాయికి ఎదిగారని కేటీఆర్‌ చెప్పారు. వాట్సాప్‌తో పాటు ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ తదితరాలను ప్రచార వేదికలుగా ఉపయోగించుకోవాలని సూచించారు. విపక్ష పార్టీలు లేవనెత్తే  అంశాలు, చేసే విమర్శలపై స్థానికంగా ఎప్పటికప్పుడు స్పందించాలని ఆదేశించారు.

మేనిఫెస్టోపై విమర్శలను తిప్పికొట్టడంతో పాటు అందులోని అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గ్రామాల వారీగా వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేయాలని సూచించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నేతలు కొత్తరకం ఎన్నికల ప్రచార విధానాలకు అలవాటు పడాల్సిన అవసరం ఉందని అన్నారు. పార్టీ గుర్తును డీపీగా పెట్టుకోవడంతో పాటు చొక్కాలపై గుర్తును ధరించాలని  సూచించారు. ప్రతి 100 మంది ఓటర్లకు ఒకరు చొప్పున ఇన్‌చార్జిలతో బూత్‌ కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. 

కాంగ్రెస్‌ గోబెల్స్‌ ప్రచారాన్ని తిప్పికొట్టండి: హరీశ్‌రావు
కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న గోబెల్స్‌ ప్రచారాన్ని తిప్పికొట్టడంతో పాటు పోలింగ్‌ ముగిసేంత వరకు పార్టీ నేతలు, కేడర్‌ కష్ట పడాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. అవసరమైన సందర్భాల్లో పార్టీ నేతలు బాధ్యతలు అప్పగించిన చోట నిద్రించాలన్నారు. ప్రతి గడపను చేరుకునేలా ప్రచారం జరగాలని చెప్పారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement