సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతూ.. రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) క్షేత్రస్థాయిలో దూకుడు పెంచింది. మూడోసారి కూడా పార్టీని గెలిపించుకుని, అధికారంలోకి వచ్చేందుకు బీఆర్‌ఎస్ పెద్దలు పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పార్టీ అభ్యర్థులను ప్రకటించగా.. క్షేత్రస్థాయి నుంచీ పరిస్థితిని అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహాలను అమలు చేస్తున్నారు.
అటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకెళ్తూనే.. ఇటు ప్రతిపక్షాలను ఎండగట్టడం.. ఇదే సమయంలో క్షేత్రస్థాయి లో పార్టీ పరిస్థితిని పరిశీలిస్తూ స్థానిక నేతలకు అవసరమైన దిశానిర్దేశం చేయడం లక్ష్యంగా కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్, మంత్రి హరీశ్‌రావు ఇద్దరూ ప్రభుత్వ కార్యక్రమాల పేరిట జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మినీ సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు.
పార్టీ పరిస్థితిని పరిశీలిస్తూ..
ఎన్నికల షెడ్యూల్ వెలువడే నాటికల్లా సగానికిపైగా అసెంబ్లీ నియోజకవర్గాలను మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతోపాటు ఎమ్మెల్సీ కవిత చుట్టి వచ్చేలా బీఆర్‌ఎస్ ప్రణాళిక రూపొందించింది. స్థానిక రాజకీయ పరిస్థితులను అంచనా వేయడం, అభ్యర్థి, పార్టీ నేతల మధ్య సమన్వయం, అభ్యర్థికి దిశానిర్దేశం చేయడం, అక్కడి వాస్తవ పరిస్థితులను సీఎం కేసీఆర్‌కు నివేదించడం లక్ష్యంగా ఈ పర్యటనలు సాగుతున్నాయి.
ఓ వైపు ప్రభుత్వ కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పిస్తూనే.. కాంగ్రెస్, బీజేపీ విధానాలను ఈ ముగ్గురు నేతలు ఎండగడుతున్నారు. రాష్ట్ర పర్యటనకు వస్తున్న జాతీయ పార్టీల నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను తిప్పికొడుతూ, వారు రాష్ట్రానికి చేసిందేమీ లేదనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
వరుసగా జిల్లాల పర్యటనలు
మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవిత ముగ్గురూ క్షేత్రస్థాయిలో అధికారిక కార్యక్రమాలతోపాటు ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా సభలు, సమావేశాల్లో పాల్గొంటున్నారు. అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు, ప్రారం¿ోత్సవాల పేరిట కేటీఆర్, హరీశ్‌రావు జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.
♦ కేటీఆర్ ఓ వైపు తన శాఖలకు సంబంధించిన సమీక్షలు, కార్యక్రమాలకు హాజరవుతూనే.. గత రెండు వారాల్లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లతోపాటు 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించారు. ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, నల్ల గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలతోపాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలపై కేటీఆర్ ప్రధానంగా ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది. అంతేకాదు ఈ నెల 7వ తేదీ వరకు కూడా కేటీఆర్ షాద్‌నగర్, తాండూరు, వికారాబాద్, వరంగల్, మహేశ్వరం నియోజకవర్గాల్లో పర్యటించేలా షెడ్యూల్ ఖరారైంది.
♦ మంత్రి హరీశ్‌రావు తాను ప్రాతినిధ్యం వహిస్తు న్న సిద్దిపేట సహా 19 అసెంబ్లీ నియోజకవర్గాల ను 15 రోజుల వ్యవధిలో చుట్టివచ్చారు. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌తోపాటు ఉమ్మడి మెదక్ జిల్లాలో (నర్సాపూర్ మినహా) ఓ దఫా పర్యటన ఇప్పటికే పూర్తిచేశారు. మంత్రి హరీశ్ ఉమ్మడి మెదక్‌తోపాటు రంగారెడ్డి, వరంగల్, నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జి ల్లాల్లో సభలు, సమావేశాల్లో పాల్గొంటున్నారు.
♦ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రధానంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై దృష్టి కేంద్రీకరించారు. సీఎం పోటీ చేయనున్న కామారెడ్డితోపాటు నిజామాబాద్ అర్బన్, బోధన్, ఉమ్మడి కరీంనగర్‌లోని జగిత్యాల నియోజకవర్గాలపై ఫోకస్ చేసి పనిచేస్తున్నారు.
ప్రతిపక్షాలకార్యక్రమాలపై ఓ కన్నేసి..
ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ఓ వైపు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై కసరత్తు చేస్తూనే.. బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. బీజేపీ తరఫున ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగి సభల్లో, ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌లో ప్లీనరీ, తుక్కుగూడ సభలను నిర్వహించింది.
ఇందులో సోనియా, రాహుల్, ఖర్గే సహా దిగ్గజ నేతలంతా హాజరుకావడంతో ఆ పార్టీలో జోష్ వచ్చింది. బీఆర్‌ఎస్ పెద్దలు ఈ పరిణామాలన్నింటినీ జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. నెలన్నర క్రితమే అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో.. క్షేత్రస్థాయి నుంచీ పరిస్థితిని పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే కీలక నేతలతో జిల్లాల పర్యటనలు చేపట్టారు.
మేనిఫెస్టో, ప్రచార వ్యూహాల పనిలో కేసీఆర్
గత నెల 16న పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆనాటి నుంచి భిన్న మైన వ్యూహానికి శ్రీకారం చుట్టారు. ప్రగతిభవన్ వేదికగా అసమ్మ తి నేతల బుజ్జగింపు, మేనిఫెస్టో రూపకల్పన, ఎన్నికల షెడ్యూల్ తర్వాత ప్రచార సభల నిర్వహణ, తాను పాల్గొనే సభల షెడ్యూల్ వంటి అంశాలపై కేసీఆర్ లోతు గా కసరత్తు చేస్తున్నారు.
మాజీ ఎంపీ వినోద్, ఎమ్మెల్సీలు పల్లా, వెంకట్రాంరెడ్డి, మధుసూదనాచారి, పార్టీ నేతలు దాసోజు శ్రవణ్ తదితరులు కేసీఆర్ సూచనల మేరకు పార్టీ నేతలను సమన్వయం చేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, కవి– గాయకుడు మిట్టపల్లి సురేందర్, ఏపూరి సోమన్న తదితరులు ఎన్నికల ప్రచార సభలు, కార్యక్రమాల్లో ప్రజలను ఆకట్టుకునేలా పాటల రూపకల్పనపై దృష్టి పెట్టారు.
అక్టోబర్ 16న వరంగల్ సభ?
బీఆర్‌ఎస్ ఈనెల 16న వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించి మేనిఫెస్టో ప్రకటించాలని భావిస్తోంది. అయితే, ఎన్నికల షెడ్యూల్, దసరా, బతుకమ్మ పండగల నేపథ్యంలో దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. కేటీఆర్ 6, 9వ తేదీల్లో వరంగల్‌లో పర్యటించనున్నారు. ఆలోగా వరంగల్ సభ నిర్వహణపై స్పష్టత రానుందని బీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment