కేటీఆర్‌పై బండి.. కేసీఆర్‌పై ఈటల | BJP plans to field strong candidates for CM and Ministers | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌పై బండి.. కేసీఆర్‌పై ఈటల

Published Fri, Sep 1 2023 3:20 AM | Last Updated on Fri, Sep 1 2023 6:28 AM

BJP plans to field strong candidates for CM and Ministers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కమల దళం కొత్త ప్రయోగానికి సిద్ధమవుతోంది. అధికార బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతల ఓటమి లక్ష్యంగా పావులు కదుపుతోంది. సీఎం కేసీఆర్‌తోపాటు కేటీఆర్, హరీశ్‌రావు సహా పలువురు మంత్రులపై బీజేపీ నుంచి బలమైన నేతలను పోటీ పెట్టాలని భావిస్తోంది. ఆయా చోట్ల బీజేపీ గెలిస్తే బీఆర్‌ఎస్‌ ముఖ్యులను ఓడించినట్టు అవుతుందని.. ఒకవేళ బీజేపీ నేతలు ఓటమిపాలైనా వారికి తర్వాత జరిగే లోక్‌సభ ఎన్నిక ల్లో పోటీకి అవకాశం ఇవ్వవచ్చని యోచిస్తున్నట్టు తెలిసింది.   

బీఆర్‌ఎస్‌పై తీవ్ర వ్యతిరేకత 
తొమ్మిదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనపై, కేసీఆర్‌ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న తీరు, వారి వైఖరితో వివిధ వర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉందని బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు పేర్కొంటున్నాయి.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, పార్టీపరంగా ఇచ్చిన పలు ముఖ్యమైన హామీల (నిరుద్యోగ భృతి, డబుల్‌ బెడ్రూం ఇళ్లు, దళితబంధు, ఎస్టీ రిజర్వేషన్ల పెంపు, వ్యవసాయ రుణమాఫీ, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వంటి) అమల్లో వైఫల్యంతో ప్రజల్లో అసంతృప్తి తీవ్రస్థాయికి చేరుకుందని తేలిందని అంటున్నాయి. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మల్చుకోవడంపై దృష్టిపెట్టినట్టు వివరిస్తున్నాయి. 

కేసీఆర్, మంత్రులను టార్గెట్‌ చేస్తూ.. 
వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌తోపాటు యావత్‌ కేబినెట్‌ మంత్రులను ప్రత్యేకంగా టార్గెట్‌ చేస్తూ ప్రజల్లో మంచి గుర్తింపు, పేరున్న ముఖ్య నేతలను బీజేపీ అభ్యర్థులుగా పోటీకి దింపాలని ఆ పార్టీ నాయకత్వం ఆలోచనకు వచ్చినట్టు తెలిసింది. త్వరలో విడుదల చేసే తొలి జాబితాలోనే మంత్రులపై పోటీచేసే అభ్యర్థులను ప్రకటించే యోచనలో పార్టీ నాయకత్వం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. ఒకవేళ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఓడితే.. లోక్‌సభ అభ్యర్థులుగా పోటీకి దింపి ఎంపీలుగా చేస్తామని నాయకత్వం హామీ ఇవ్వడంతో ముఖ్యనేతలు ఓకే చెప్పిందని సమాచారం. 

గజ్వేల్, కామారెడ్డిల్లోనూ సై.. 
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రెండుచోట్ల నుంచి కేసీఆర్‌ పోటీచేయనుండటంతో.. గజ్వేల్‌లో ఆయనపై బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్, కామారెడ్డిలో నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను పోటీకి నిలపాలని పార్టీ యోచిస్తున్నట్టు తెలిసింది. సీఎం కేసీఆర్‌తో విభేదించి బీఆర్‌ఎస్‌ను వీడిన ఈటల రాజేందర్‌ గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేస్తానని గతంలో పలుమార్లు ప్రకటించారు కూడా. ఈ విషయాన్ని ఆయన పార్టీ అగ్రనాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. ఇందుకు తగ్గట్టుగానే ఆయనను గజ్వేల్‌లో, అర్వింద్‌ను కామారెడ్డిలో కేసీఆర్‌పై పోటీకి నిలపాలని పార్టీ నిర్ణయించినట్టు తెలిసింది. ఇక బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ను నిలపాలని యోచిస్తున్నట్టు సమాచారం.

సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావుపై పార్టీ అగ్రనేత మురళీధర్‌రావు, మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మహేశ్వరంలో మంత్రి సబితారెడ్డిపై మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, వనపర్తిలో మంత్రి నిరంజన్‌రెడ్డిపై మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి, కరీంనగర్‌లో గంగుల కమలాకర్‌పై మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డిని పోటీకి దింపాలని సూత్ర›ప్రాయంగా నిర్ణయించినట్టు సమాచారం. మిగతా మంత్రులపై కూడా ఆయా ఉమ్మడి జిల్లాల వారీగా బలమైన ముఖ్య నేతలను గుర్తించి పోటీ చేయించాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలిసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement