
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న 17 అంశాలతో ‘కేసీఆర్ భరోసా’పేరిట జనంలోకి వెళ్లనున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు తెలిపారు. కేసీఆర్ భరోసా పేరిట మేనిఫెస్టోను పార్టీ శ్రేణులు గ్రామ గ్రామాన విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి 11 పర్యాయాలు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని ఆగం చేశారని, కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని గద్దల పాలు చేయొద్దని అన్నారు.
అభివృద్ధి, సంక్షేమంతో పాటు అన్ని రంగాల్లో పురోగమిస్తున్న రాష్ట్రాన్ని దగుల్బాజీ, దొంగల పార్టీ అయిన కాంగ్రెస్ చేతిలో పెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. బుధవారం తెలంగాణ భవన్‌లో పెద్దపల్లి, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు.. కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ ఎప్పుడో ప్రజలకు దూరమైంది
కాంగ్రెస్ పార్టీని ఎవరూ సొంతం చేసుకోరని, ఆ పార్టీ ఎప్పుడో ప్రజలకు దూరమైందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజలను పదే పదే మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ నైజమని, ‘అమ్మకు అన్నం పెట్టనోడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడట’అనే రీతిలో కాంగ్రెస్ హామీలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సొంత రాష్ట్రం కర్ణాటకలో ఎన్నికల హామీలు నెరవేర్చడంలో ఆ పార్టీ విఫలమయ్యిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే కరెంటు కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో సాగు, తాగునీరు సమస్యలతో పాటు విద్యుత్ కష్టాలు తీరాయని చెప్పారు. తెలంగాణ పార్టీగా బీఆర్‌ఎస్ కులమతాలకు అతీతంగా ప్రతి మనిషి, ప్రతి ఇంటి పార్టీగా మారిందని అన్నారు. వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ సరిపోతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. ‘మూడు పంటలు కావాలా.. మూడు గంటలు కావాలా’ప్రజలు ఆలోచించుకోవాలని కోరారు.
రైతుబంధు ద్వారా ఎకరానికి రూ.16 వేలు, రైతు బీమా, దివ్యాంగులు, ఆసరా పింఛన్ పెంపు, అన్నపూర్ణ ద్వారా సన్నబియ్యం, సౌభాగ్యలక్ష్మి ద్వారా మహిళలకు రూ.3 వేలు జీవన భృతి, అసైన్డ్ భూములపై హక్కులు, జాబ్ క్యాలెండర్, రూ.400కే గ్యాస్ సిలిండర్ వంటి అంశాలను కేసీఆర్ భరోసా పేరిట ప్రజలకు వివరిస్తామని కేటీఆర్ చెప్పారు.
పదవులు కాదు.. గుర్తింపును ఇవ్వండి
త్యాగాల పునాదుల మీద తెలంగాణ నిర్మించాలనే లక్ష్యంతో గతంలో కేసీఆర్ వెంట నడిచామని, కొన్ని రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్‌లో చేరినా అక్కడ ఇమడలేక పోయామని పెద్దపల్లి నేత సి.సత్యనారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ చిత్తశుద్ధి చూసి మళ్లీ బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు వెల్లడించారు. తమకు పదవుల కంటే గుర్తింపు ముఖ్యమని అన్నారు.
పెద్దపల్లి నేత గుర్రాల మల్లేశం, మహబూబ్‌నగర్ డీసీసీ మాజీ అధ్యక్షుడు ముత్యాల ప్రకాశ్ తదితరులు బీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు సర్దార్ రవీందర్ సింగ్, గెల్లు శ్రీనివాస్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment