
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ, ప్రభుత్వ పరంగా పెద్దయెత్తున సభలు, కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా క్షేత్ర స్థాయిలో కేడర్‌లో ఉత్సాహం నింపేందుకు అధికార బీఆర్‌ఎస్ సిద్ధమవుతోంది. ఒకవైపు అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు చేసుకుంటూనే మరోవైపు ఇతర రాష్ట్రాల్లో పార్టీ బలోపేతంపైనా దృష్టి సారిస్తోంది. అదే సమయంలో పార్టీలో అసమ్మతిని నిశితంగా గమనిస్తున్న అధిష్టానం ఆ మేరకు అవసరమైన చర్యలు చేపడుతోంది.
15న 9 వైద్య కళాశాలల ప్రారంభం
ఈ నెల 15న ఏకకాలంలో తొమ్మిది కొత్త మెడికల్ కాలేజీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ సందర్భంగా కాలేజీలు మొదలయ్యే జనగామ, నిర్మల్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, ఆసిఫా బాద్, భూపాలపల్లి, వికారాబాద్, ఖమ్మం జిల్లా కేంద్రాల్లో కనీసం 15 వేల నుంచి 20 వేల మందితో ర్యాలీలు తీసే బాధ్యతను సంబంధిత జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలకు అప్పగించారు. సీఎం కేసీఆర్ ఏదో ఒకచోట కొత్త మెడికల్ కాలేజీని ప్రారంభించనుండగా, సిరిసిల్లలో మంత్రి కేటీఆర్, కామా రెడ్డిలో మంత్రి హరీశ్‌రావు ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు.
కాగా ఈ నెల 16న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభం సందర్భంగా కొల్లాపూర్‌లో బహిరంగ సభ నిర్వహించేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సుమారు లక్షన్నర మంది రైతులను ఈ సభకు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకోవైపు ఈ నెల 17న ‘జాతీయ సమైక్యత దినోత్సవం’ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ పతాకాలు ఎగురవేయాల్సిందిగా బీఆర్‌ఎస్ శ్రేణులను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆదేశించారు.
3 లక్షల మందితో సోలాపూర్ సభ
ఈ నెలాఖరులో మహారాష్ట్రలోని సోలాపూర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. సుమారు మూడు లక్షల మందితో నిర్వహించే ఈ సభకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హాజరవుతారు. వాస్తవానికి ఈ నెల మొదటి వారంలోనే అక్కడ సభ నిర్వహించాలని భావించినా చివరి వారానికి వాయిదా పడింది. సభ నిర్వహించే మైదానం ఎంపిక కోసం గత నెల 30న సోలాపూర్‌ను సందర్శించిన మంత్రి హరీశ్‌రావు, మరోమారు అక్కడ పర్యటించే అవకాశముందని బీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి. కాగా బాల్‌కోటి మైదానం, ఈద్గా మైదానాల్లో ఏదో ఒకదానిని ఎంపిక చేసే అవకాశముందని తెలుస్తోంది. సభ నిర్వహణపై పార్టీ మహారాష్ట్ర ఇన్‌చార్జి కల్వకుంట్ల వంశీధర్‌రావు అక్కడి నేతలతో సమన్వయం చేస్తున్నారు.
త్వరలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం
► అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్‌ఎస్ జాబితాను 25 రోజుల క్రితం ప్రకటించిన కేసీఆర్ వచ్చేనెల 16న వరంగల్‌లో బహిరంగ సభ ద్వారా అధికారికంగా ఎన్నికల శంఖం పూరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిపై కేసీఆర్ త్వరలోనే పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించే అవకాశముంది. సుమారు పది లక్షల మందితో నిర్వహించే ఈ బహిరంగ సభ వేదికగా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను కేసీఆర్ ప్రకటిస్తారు.
ముఖ్య నేతలకు బుజ్జగింపు, సమన్వయ బాధ్యతలు
► అసెంబ్లీ టికెట్ల కేటాయింపుతో పార్టీలో అక్కడక్కడా తలెత్తిన అసమ్మతికి చెక్ పెడుతూనే నియోజకవర్గ స్థాయిలో అంతర్గత సమన్వయం సాధించేందుకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రాధాన్యతను ఇస్తున్నారు. అసమ్మతి నేతలను బుజ్జగించే బాధ్యతను కేటీఆర్, హరీశ్‌లతో పాటు ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ వంటి కీలక నేతలకు అప్పగించారు.
నియోజకవర్గ స్థాయిలో పార్టీ కేడర్‌ను సమన్వయం చేయడం, పార్టీ ఆదేశాలకు అనుగుణంగా అభ్యర్థుల కార్యకలపాల నిర్వహణ, పర్యవేక్షణ తదితరాల కోసం ఇన్‌చార్జిల నియామకంపై కసరత్తు జరుగుతోంది. పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు, శాసనమండలి సభ్యులు, కొందరు జిల్లా పరిషత్, కార్పొరేషన్ చైర్మన్లకు సమన్వయ బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్ భావిస్తున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జిలుగా నియమితులయ్యే నేతల జాబితాను ఈ నెల 20లోగా ప్రకటించే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment