
సాక్షి, న్యూఢిల్లీ/ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు నగారా మోగింది. నవంబర్ 3వ తేదీన నోటిఫికేషన్ ఇవ్వడంతోపాటు నామినేషన్ల స్వీకరణ మొదలుకానుంది. అదే నెల 30న పోలింగ్, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం తెలంగాణతోపాటు మరో నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. వచ్చే ఏడాది మొదట్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీఫైనల్‌గా భావిస్తున్న తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మిజోరం శాసనసభలకు ఎన్నికల ఏర్పాట్లు, ఇతర వివరాలను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్‌కుమార్,ఎలక్షన్ కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ సోమవారం ఢిల్లీలో మీడియాకు వెల్లడించారు.
రాష్ట్రంలో ఒకే దశలో.. : వచ్చే ఏడాది జనవరి 16వ తేదీతో ముగిసే తెలంగాణ అసెంబ్లీలోని 119 నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ ఈసారి ఒకే విడతలో జరుగనుంది. నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తారు. నామినేషన్ దాఖలుకు నవంబర్ 10 ఆఖరు తేదీగా నిర్ణయించారు. నవంబర్ 13న దరఖాస్తుల పరిశీలన చేపడతారు. ఉపసంహరణకు నవంబర్ 15 వరకు గడువు ఇస్తారు. అదే నెల 30న రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఒకేసారి పోలింగ్ జరుగుతుంది. మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో రెండు విడతల్లో, మిగతా మూడు రాష్ట్రాల్లో ఒకే విడతలో పోలింగ్ పూర్తికానుంది. ఎన్నికల షెడ్యూల్, పోలింగ్ వేర్వేరు తేదీల్లో ఉన్నా.. ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపును మాత్రం డిసెంబర్ 3వ తేదీనే చేపట్టి, ఫలితాలను ప్రకటించనున్నారు.
ఐదు రాష్ట్రాలు.. 16.14 కోట్ల మంది ఓటర్లు
ఐదు రాష్ట్రాల్లోని మొత్తం 679 నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా, మొత్తం 16.14 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లేనని సీఈసీ రాజీవ్‌కుమార్ ప్రకటించారు. ఐదు రాష్ట్రాల్లో కలిపి 2,900కు పైగా పోలింగ్ కేంద్రాలను యువత నిర్వహిస్తారని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో నగదు తరలింపు, ఉచితాలు, బహుమతులు, మద్యం, డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టడానికి విస్తృత తనిఖీలు చేపట్టనున్నామని.. ఈ మేరకు నిఘా వ్యవస్థను పటిష్టం చేశామని వివరించారు. ఐదు రాష్ట్రాల్లో మొత్తం 940 చెక్‌పోస్టులను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు.
మొదటిసారిగా ‘సీజర్ మేనేజ్‌మెంట్ సిస్టం’
ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్)ను ఎవరైనా అతిక్రమించినట్టు గుర్తిస్తే.. సీవిజిల్ యాప్ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చని సీఈసీ రాజీవ్ కుమార్ సూచించారు. క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు తప్పనిసరిగా కేసులకు సంబంధించి పత్రికల్లో ప్రకటన ఇవ్వాలని స్పష్టం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మొదటిసారిగా ‘ఎలక్షన్ సీజర్ మేనేజ్‌మెంట్ సిస్టం’ను ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల ఖర్చుపై పూర్తిస్థాయి పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు. నాన్ షెడ్యూల్డ్ చార్టర్డ్ విమానాలతోపాటు రైల్వే, పోస్టల్ కార్గోలను క్షుణ్నంగా తనిఖీ చేస్తామని చెప్పారు. వివాదాస్పద, సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర పారామిలటరీ బలగాలను మోహరిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment