
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల తరుణం ముంచుకొస్తోంది. తెలంగాణతోపాటు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, మిజోరం శాసనసభల ఎలక్షన్లకు అక్టోబర్ తొలి వారం తర్వాత ఏ క్షణంలోనైనా ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో శాసనసభ ఎన్నికల నిర్వహణ సంసిద్ధతను పరిశీలించడానికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్‌కుమార్ నేతృత్వంలో ఎలక్షన్ కమిషనర్లు అనూప్‌చంద్ర పాండే, అరుణ్ గోయల్‌తో కూడిన కేంద్ర ఎన్నికల సంఘం బృందం వచ్చే నెల 3న రాష్ట్ర పర్యటనకు రానుంది. 5 వరకు అంటే మూడురోజులపాటు విస్తృత సమీక్షలు, వరుస సమావేశాలు నిర్వహించనుంది.
మిగతా చోట్ల ఇప్పటికే ముగియడంతో..
ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందు సంసిద్ధతను స్వయంగా పరిశీలించడానికి సీఈసీ బృందం రాష్ట్రాల్లో పర్యటనలు నిర్వహిస్తుంది. ఆ తర్వాత షెడ్యూల్‌ను ప్రకటిస్తుంది. ప్రస్తుతం ఎన్నికలు జరగాల్సిన ఐదు రాష్ట్రాలకుగాను.. తెలంగాణ మినహా మిగతా 4 రాష్ట్రాల్లో ఇప్పటికే సీఈసీ బృందం పర్యటనలు ముగిశాయి. అక్టోబర్ 5వ తేదీ నాటికి తెలంగాణలోనూ పర్యటన ముగుస్తుంది. అంటే ఆ తర్వాత ఏ క్షణంలోనైనా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం గత శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను 2018 అక్టోబర్ 6న ప్రకటించగా.. అదే ఏడాది డిసెంబర్ 7న పోలింగ్, 11న ఫలితాలను ప్రకటించారు.
ఈసారి కొన్ని రోజులు అటూఇటూగా షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికలను ఒక్కో దఫాలోనే పూర్తి చేశారు. అలాగే ఈసారి కూడా ఒకే దఫాలో నిర్వహించవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుత శాసనసభ గడువు వచ్చే ఏడాది జనవరి 16వ తేదీతో ముగుస్తుంది. ఆలోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రత్యేకంగా చేపట్టిన ఓటర్ల జాబితా రెండో సవరణ కార్యక్రమంలో భాగంగా.. అక్టోబర్ 4న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. దానితో ఎన్నికలకు సర్వం సిద్ధమైనట్టేనని అధికారవర్గాలు చెప్తున్నాయి.
సీఈసీ బృందం షెడ్యూల్ ఇదీ..
► కేంద్ర ఎన్నికల కమిషనర్ల బృందం రాష్ట్ర పర్యటనలో భాగంగా.. అక్టోబర్ 3న జాతీయ, రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశమై, అభిప్రాయ సేకరణ జరుపుతుంది. అనంతరం వివిధ కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థల ఉన్నతాధికారులతో సమావేశమై.. ఎన్నికల్లో ధనం, మద్యం, ఇతర ప్రలోభాలు, అక్రమాల నిర్మూలన కోసం తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేస్తుంది. తర్వాత రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్, రాష్ట్ర పోలీసు నోడల్ అధికారి (ఎస్‌ఎన్‌పీఓ), కేంద్ర సాయుధ బలగాల నోడల్ అధికారి తమ సన్నద్ధతను ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తారు.
► అక్టోబర్ 4న ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు 33 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు/పోలీసు కమిషనర్లతో సీఈసీ బృందం సమావేశం అవుతుంది. జిల్లాల వారీగా క్షేత్రస్థాయిలో ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్లు, ఎస్పీలు/పీసీలు ప్రజెంటేషన్ ఇస్తారు.
► అక్టోబర్ 5న ఓటర్లలో చైతన్యం కల్పించడానికి అమలు చేస్తున్న ‘స్వీప్’ కార్యక్రమం తీరు తెన్నులను సీఈసీ బృందం పరిశీలిస్తుంది. ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రచారకర్తలుగా ఉన్న క్రీడా, సినీ రంగ సెలబ్రిటీలతో సమావేశం అవుతుంది. దివ్యాంగ, యువ ఓటర్లతో ముఖాముఖీగా మాట్లాడుతుంది. చివరిగా ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌లతో సమావేశమై రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం, భద్రత సంస్థలను సమన్వయం పర్చే అంశంపై సమీక్షిస్తుంది. అనంతరం మీడియా సమావేశం నిర్వహించి తమ పర్యటన విశేషాలను వెల్లడిస్తుంది.