చేసేది చెబితేనే అందం | opinion on political parties election promises by k ramachandra murthy | Sakshi
Sakshi News home page

చేసేది చెబితేనే అందం

Published Sun, Dec 25 2016 12:02 AM | Last Updated on Mon, Sep 17 2018 5:36 PM

చేసేది చెబితేనే అందం - Sakshi

చేసేది చెబితేనే అందం

త్రికాలమ్‌
నిజమే. రాహుల్‌గాంధీ ఇప్పుడిప్పుడే మాట్లాడటం నేర్చుకుంటున్నారు. ఇంత వరకూ మూడు, నాలుగు వాక్యాలకు మించి ఆశువుగా మాట్లాడని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు పెద్దనోట్ల రద్దు సృష్టించిన గందరగోళం ధర్మమా అని పావుగంట సేపు తడుముకోకుండా ప్రసంగించగలుగుతున్నారు. ప్రధాని నరేంద్రమోదీ వాగ్ధాటి రాహుల్‌కి ఈ జీవితంలో అబ్బకపోవచ్చు. మోదీకి ఉన్న ప్రజాదరణ నెహ్రూ మునిమనుమడికి  ఎప్పటికీ లభించకపోవచ్చు. ప్రధానికి ఉన్న నేపథ్యం వేరు. అనుభవం వేరు. ప్రావీణ్యం వేరు. మోదీని మించినవారు బీజేపీలో, ఆరె స్సెస్‌లోనూ లేరు. అంతమాత్రాన మోదీ ఎప్పటికీ అజేయుడుగా నిలబడతారనీ, ఆయనకు ఇదే ప్రజాదరణ ఎల్లకాలం కొనసాగుతుందనీ అనుకుంటే భ్రమ. 1984లో అఖండ మెజారిటీ సంపాదించిన కాంగ్రెస్‌ పార్టీ 1989లో ఓడి పోయింది. 1984లో అద్భుతమైన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ ప్రజాకర్షణ దండిగా కలిగిన ఎన్‌టీ రామారావు నాయకత్వంలోనే 1989లో ఓట మిపాలయింది. రాజీవ్, రామారావు ఇద్దరూ తమ విజయాలను అపార్థం చేసు కున్నారు. మోదీ కూడా అదే పొరపాటు చేస్తున్నారా?

వారణాసి బహిరంగసభలో గురువారం మోదీ ప్రసంగిస్తూ, పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకించేవారు కాలాధన్‌ (నల్లడబ్బు), కాలామన్‌ (చెడ్డ మన స్తత్వం–చెడు ఆలోచన) ఉన్నవారనీ, వారంతా ఉగ్రవాదులకు పాకిస్తాన్‌ అండగా ఉన్నట్టు నల్లకుబేరులకు అండగా నిలుస్తున్నారనీ అడ్డగోలుగా ఆరో పించారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీ గాంధీనగర్‌ నుంచి ఢిల్లీ వచ్చి ఎన్నికల ప్రచార రంగంలో అట్టహాసంగా ప్రవేశించేవరకూ దక్షిణాది ప్రజలకు ఆయన అంతగా పరిచయం లేదు. గోధ్రా ఉదంతం, అనంతర మారణహోమం జరిగినప్పుడు గుజరాత్‌ ముఖ్య మంత్రిగా ఉండిన మోదీ ప్రస్తావన పత్రికలలో, టీవీ చానళ్ళలో వచ్చేది. ఎన్నికల ప్రచారం మొదలు ఇప్పటివరకూ మోదీ మాట్లాడే తీరు మారలేదు. అదే వాగ్ధాటి. అదే ఆత్మవిశ్వాసం. అవే ఏకపక్ష ఆరోపణలు. గతమంతా చీకటే ననీ, తనతోనే వెలుగు వచ్చిందనీ స్వోత్కర్ష. మోదీ ధాటికి తట్టుకోలేక ప్రతి పక్షాలు 30 మాసాలపాటు దాదాపు మౌనంగానే ఉన్నాయి. అప్పుడప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ చేసే హడావుడి మినహా మోదీని ప్రతి పక్షాలు ఇరకాటంలో పెట్టిన సందర్భమే లేదు.

పవిత్రగంగ
కాంగ్రెస్‌ పార్టీ పరిశుద్ధమైన పార్టీ అని ఎవరు ఎంత ఘోషించినా ప్రజలు నమ్మరు. అదే అభిప్రాయాన్ని మరింత బలపడే విధంగా మోదీ, బీజేపీ అధ్య క్షుడు అమిత్‌షా, వెంకయ్యనాయుడు వంటి నోరున్న మంత్రులు అదే పనిగా ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్‌వాదులు అవినీతి పంకిలంలో కూరుకుపోయిన నాయకులనీ, తాము మాత్రం పరమ పవిత్రులమనీ చెప్పుకుంటున్నారు. గంగా నది ఎంత పవిత్రమైనదో మోదీ అంతే పవిత్రుడు అంటూ పొగిడే రవిశంకర్‌ ప్రసాద్‌ వంటి సహచరులు ఉన్నారు (గంగను శుద్ధి చేసే కార్యక్రమాన్ని సాధ్వి ఉమాభారతి అమలు చేస్తున్నారు. అవినీతికి గంగోత్రిగా కాంగ్రెస్‌ను అటల్‌ బిహారీ వాజ్‌పేయి అభివర్ణించారు). మీడియా సానుకూలంగా ఉంది. చేతిలో సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్, తదితర సాధనాలు ఉన్నాయి. మోదీకి ఎదురులేదు. మాయావతి సైతం బిక్కుబిక్కుమంటూ ఉండవలసిందే.  యూపీఏ దుర్వినియోగం చేసినట్టే సీబీఐని ఎన్‌డీఏ సైతం ఆయుధంగా విని యోగించుకుంటున్నది. మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ ముఖ్యమంత్రులపైన వచ్చిన ఆరోపణలపైన విచారణ అంగుళం ముందుకు కదలదు.

కేంద్ర హోంశాఖ సహా యమంత్రి రిజీజూపైన∙ఆరోపణ చేసినవారిని అవహేళన చేయడమే కానీ దానిపై దర్యాప్తు ప్రసక్తి లేదు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికీ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకీ మధ్య బీజేపీ పెద్దలే రాజీ కుదిర్చి ‘ఓటుకు కోట్లు కేసు’ను నీరుగార్చారనే అభిప్రాయం ప్రజానీకంలో బలంగా ఉంది. శేషాచలం అడవులలో తమిళ కూలీల హత్యా కాండపైన కానీ అనేక ఇతర ఘటనలపైన కానీ విచారణ ముందుకు సాగదు. ఎన్‌డీఏ ప్రత్యర్థులపైన ఐటీ దాడులు జరుగుతాయి. నీతి, రీతి అంటూ నిత్యం జపం చేస్తున్న ప్రధాని ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల నిరో ధక చట్టాన్ని తుంగలో తొక్కి ప్రతిపక్షాలకు చెందిన ఎంఎల్‌ఏలకు ముఖ్య మంత్రులే కండువాలు కప్పి అధికార పార్టీలోకి ఆహ్వానిస్తుంటే అదేమని ప్రశ్నించరు. పంచాయతీరాజ్, నగరపాలిక చట్టాలను చట్టుబండలు చేసి ముని సిపల్‌ ఎన్నికలను నెలల తరబడి వాయిదా వేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనరు.  

ఈ వ్యూహాన్ని కాంగ్రెస్‌ పార్టీ అర్థం చేసుకున్నట్టే కనిపిస్తున్నది. ‘మేము గడ్డి తింటే మీరూ తక్కువేమీ తినలేదు’ అని నిరూపించడమే ధ్యేయంగా పెట్టుకు న్నది. సుప్రీంకోర్టు తిరస్కరించిన ఆరోపణలనే రాహుల్‌గాంధీ బహిరంగ సభలలో వరుసగా చేయడంలోని వ్యూహం ఇదే. ‘యువనాయకుడు’ రాహుల్‌ గాంధీ ప్రసంగించడం నేర్చుకుంటున్నారనీ, తనపైన ఆరోపణలు చేసి భూకం పం సృష్టిస్తానంటున్నారని అంటూ, ఏదీ భూకంపం అని ప్రశ్నిస్తూ అభినయ సహితంగా ఎద్దేవా చేసిన ప్రధానికి రాహుల్‌ ఏమి జవాబు చెప్పగలరు? తనను ఎంతగా ఎద్దేవా చేసినా పర్వాలేదు కానీ తాను అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పా లన్నారు. హక్కుల నాయకుడూ, ప్రసిద్ధ న్యాయవాది ప్రశాంత్‌భూషణ్‌ సుప్రీం కోర్టులో ప్రజాహిత వ్యాజ్యంలో ప్రస్తావించిన ఆరోపణలనే రాహుల్‌ బహిరంగ సభలలో చేస్తున్నారు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న  కాలంలో నరేంద్రమోదీకి సహారా సంస్థ నుంచీ, బిర్లా గ్రూప్‌ నుంచీ ముడుపులు అందాయని ఆరోపిసు ్తన్నారు. ఇవే ఆరోపణలను ప్రశాంత్‌భూషణ్‌ చేసినప్పుడు సుప్రీంకోర్టు న్యాయ మూర్తి విచారణకు స్వీకరించకుండా ఈ సాక్ష్యాధారాలు సరిపోవనీ, ఇంకా ఏమైనా ఆధారాలు ఉంటే సమర్పించాలనీ చెప్పారు.

మోదీపై ఆరోపణ ఏమిటి?
ప్రశాంత్‌భూషణ్‌ చేసిన ఆరోపణలు ఏమిటి? ఆదాయపన్ను శాఖ అధికారులు 2012, 2013లలో సహారా, బిర్లా సంస్థల కార్యాలయాలపైన జరిపిన దాడులలో కొన్ని డైరీలు లభ్యమైనాయనీ, వాటిలో ఉన్న వివరాలను పరిశీలిస్తే నాటి గుజరాత్‌ ముఖ్యమంత్రికి సహారా నుంచి రూ 40.07 కోట్ల చెల్లింపులు దశల వారీగా జరిగాయనీ ఆరోపణ. అదే విధంగా బిర్లా కంపెనీ నుంచి రూ. 12 కోట్లు స్వీకరించినట్టు డైరీలో సంకేతప్రాయంగా ఉంది. ఇటువంటి ఆధారాలు లభిం చిన తర్వాత ఆదాయపన్ను శాఖ ఏమిచేయాలి? 1) నిజంగా చెల్లింపులు జరి గాయో, లేదో నిర్ధారించుకోవాలి. 2) సహారా, బిర్లా కంపెనీల ఉన్నతాధి కారులను పిలిపించి ప్రశ్నించాలి. 3) తనకు దొరికిన ఆధారాలను సీబీఐకీ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కూ అప్పగించాలి. సుప్రీంకోర్టులో కేసు ఉన్నప్పుడు ఈ వివరాలు సర్వోన్నత న్యాయస్థానం దృష్టిలో పెట్టాలి. విధిగా చేయవలసిన ఈ పనులేవీ ఆదాయ పన్నుశాఖ చేయలేదు. ఎందుకు చేయలేదని ఆ సంస్థ అధికారులను ప్రభుత్వం ప్రశ్నించాలి. నిజానికి ప్రధాని స్వయంగా ఈ డైరీల మూలాలు ఏమిటో తెలుసుకొని నివేదించవలసిందిగా అధికారులను ఆదేశించి నట్లయితే ఆదర్శంగా ఉండేది. ఇటువంటి పరిస్థితులలోనే లాల్‌కృష్ణ అడ్వాణీ లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉండగా జైన్‌ డైరీలో ఎల్‌.కె. అని రెండు పొడి అక్షరాలు కనిపించినందుకు, వాటి ఆధారంగా తనపైన అభియోగం వచ్చినందుకు తన నిర్దోషిత్వం రుజువయ్యే వరకూ సభకు తిరిగి రానంటూ రాజీనామా చేశారు. ఉప ఎన్నికలో గెలుపొందిన అనంతరమే సభలో అడుగుపెట్టారు. అంతటి ప్రమాణాలను ఆశించకపోయిన ప్పటికీ తనపై వచ్చిన ఆరోపణలపైన విచారణకు ఆదేశించవలసిన ప్రధాని ఆ పని చేయకపోగా ఆరోపణలు చేసినవారిని ఆటపట్టించడం, అపహాస్యం చేయడం ప్రధాని పదవికి శోభాయమానం కాదు.  

ఒకవైపు ఓట్లు కొనుగోలు చేస్తూ, శాసనసభ్యులనూ, పార్లమెంటు సభ్యు లనూ ప్రలోభాలు చూపించీ, ప్రభుత్వ యంత్రాంగంతో కష్టాలూ,నష్టాలూ చవి చూపించి లొంగదీసుకుంటూ, పార్టీలో చేర్చుకుంటూ, మరోవైపు నల్లధనం మీద, అవినీతిమీద యుద్ధం చేస్తున్నామంటూ ప్రగల్భాలు పలికే కపట నాటక సూత్రధారులను కట్టడి చేయవలసిందిపోయి వారికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ప్రధాని స్వీయప్రతిష్ఠ మసకబారే విధంగా వ్యవహరిస్తున్నారు. సహారా, బిర్లా సంస్థలు ముడుపులు ఇచ్చింది కేవలం నరేంద్రమోదీకీ, షీలాదీక్షిత్‌కీ, దిగ్వి జయ్‌సింగ్‌కీ మాత్రమే కాదు. బీజేపీ, కాంగ్రెస్, జనతాదళ్‌(యు), ఆర్‌జేడీ, బిజూ జనతాదళ్, ఎస్‌పీ, ఎన్‌సీపీ, జెఎంఎం, జెవీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ వంటి మొత్తం 18 రాజకీయ పార్టీలకు చెందిన అనేకమంది నాయకులకు చెల్లించి నట్టు ఆరోపణలున్నాయి. ఖనిజ నిక్షేపాలు ఏ ప్రాంతంలో ఉన్నాయో ఆ ప్రాంతంలో ప్రాబల్యం కలిగిన పార్టీలకు విరాళాల రూపంలో ముడుపులు పెద్ద పెద్ద కంపెనీలు చెల్లిస్తున్నాయన్నది జగమెరిగిన సత్యం. గొంగడిలో కూర్చొని భోజనం చేస్తూ వెంట్రుకలను ఏరినట్టు పార్టీలకు నిధులు లెక్కాపత్రం లేకుండా సేకరిస్తూ అవే పార్టీలు నల్లధనంపైన యుద్ధం చేస్తామంటూ ప్రతిజ్ఞలు చేయడం, తమకు ప్రతిపక్షాలు అడ్డం వస్తున్నాయంటూ నిందించడం మన నేతలు బాగా రక్తి కట్టిస్తున్న ప్రహసనం. తమకు తాము సర్టిఫికెట్లు ఇచ్చుకోవడం, ప్రతి పక్షా లను నిందించడం ద్వారా ప్రజలను మభ్యపెట్టవచ్చుననుకుంటే పొర పాటు. అది ప్రజల వివేకాన్ని తక్కువగా అంచనా వేయడమే.

కార్పొరేట్లతో అక్రమ సంబంధం
క్రోనీ కేపిటలిస్టులకూ (ఆశ్రిత పెట్టుబడిదారులకూ) ప్రభుత్వాలకూ మధ్య అక్రమ సంబంధం ఉందనేది లోకవిదితం. బ్యాంకుల నుంచి వేలకోట్ల రూపా యల రుణాలు తీసుకొని తిరిగి చెల్లించని కంపెనీలను ఏ ప్రభుత్వమూ ముట్టు కోదు. పైగా వాటి రుణాలు మాఫీ అవుతాయి. యూపీఏ ప్రభుత్వ హయాంలో అదానీకి రూ. 72,000 కోట్లూ,  అంబానీకి  రూ. 1.13 లక్షల కోట్ల రూపాయల రుణాలు ఇచ్చారని బీజేపీ పార్లమెంటు సభ్యుడు శ్రీకాంత్‌శర్మ ఆరోపించారు. రాహుల్‌ గాంధీ ఎన్‌డీఏని సూట్‌ బూట్‌కీ సర్కార్‌ అనీ, అంబానీ–అదానీ సర్కార్‌ అనీ పదేపదే చేస్తున్న ఆరోపణకు సమాధానంగా బీజేపీ ఈ వివరాలు విడుదల చేసింది. త్వంశుంఠ అంటే త్వంశుంఠ అనడం. పదివేల రూపాయల అప్పు తీర్చలేక అపరాధ భావనతో రైతు కుంగిపోయి ఆత్మహత్య చేసుకుంటే వేలకోట్ల రూపాయల అప్పు ఎగవేసి ప్రభుత్వ సహకారంతో విజయ్‌ మాల్యా వంటి సంపన్నులు దర్జాగా విదేశాలకు చెక్కేస్తారని ప్రజలు గ్రహించారు. అక్రమ కార్పొరేట్లతో అంటకాగకపోతే, అంబానీ, అదానీ, వగైరాల బకాయిలను వసూలు చేయాలంటూ రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌గా రఘురామ్‌ రాజన్‌ ఉన్న సమ యంలో వచ్చిన ప్రతిపాదనను ప్రభుత్వం స్వాగతించేది. ఆయనను సాగనం పేది కాదు. యూపీఏ అయినా, ఎన్‌డీఏ అయినా, మన్మోహన్‌ అయినా మోదీ అయినా ఒకే తానులో ముక్కలే. కార్పొరేట్లకు దాసులే. కాకపోతే వాగ్ధాటీ, సమయస్ఫూర్తీ, ఆర్‌ఎస్‌ఎస్‌ వంటి సుశిక్షితమైన సంస్థ శక్తీ, కార్యకర్తల బలం, మీడియా సహకారం అండగా ఉండటంతో బీజేపీ అజేయంగా కనిపించవచ్చు. 

ఓటర్ల హృదయాలను శాశ్వతంగా గెలుచుకోవాలంటే పైన చెప్పుకున్న శక్తులకు తోడుగా ఇంకో అంశం–విశ్వాసం–ఉండాలి. ప్రజల విశ్వాసం చెక్కుచెదరకుండా ఉండాలంటే మోదీపైన కానీ మరో నాయకుడిపైన కానీ వచ్చిన ఆరోపణలపైన తక్షణం విచారణ జరిపించాలి. బ్యాంకులకు వేలకోట్లలో ఉన్న బకాయీలను ఆశ్రిత పెట్టుబడిదారుల మెడలు వంచి వసూలు చేయాలి. కార్పొరేట్‌ సంస్థ లకూ, రాజకీయ పార్టీలకూ మధ్య వర్ధిల్లుతున్న అక్రమ సంబంధాన్ని తెగన రకాలి. ఆధారాలు లేకుండా రహస్యంగా  ఏ పార్టీకీ ఎవ్వరూ చందాలు ఇవ్వ కుండా కట్టడి చేయాలి. ఎన్నికలలో అభ్యర్థులూ, పార్టీలూ చేసే ఖర్చును నిబం ధనల ప్రకారం నియంత్రించాలి. సాధారణ ప్రజలు ప్రతి లావాదేవీకీ ఆధార్‌ కార్డునో, పాన్‌ నంబరునో చూపించాలని చెబుతున్న ప్రభుత్వం రాజకీయ పార్టీలు సేకరిస్తున్న నిధులకు లెక్కలూడొక్కలూ అడగబోనంటోంది. వ్యక్తిగత విరాళాన్ని రెండు వేలకు తగ్గించాలని ఎన్నికల సంఘం సూచించింది. సభ్య త్వాల రుసుములాగానే ఈ విరాళాలనూ వేలమంది పేర రాసి సక్రమం అనిపిం చుకునే అవకాశం ఉంది.  నయాపైస కూడా ఆధార్‌కార్డు కానీ పాన్‌ నంబరు కానీ లేకుండా ఏ పార్టీ విరాళం స్వీకరించడానికి వీలు లేకుండా నిబంధనలు పక డ్బందీగా రూపొందించడం ఉత్తమం. బినామీ చట్టాన్ని బిగిస్తున్నానంటూ చెప్పుకుంటున్న ప్రధాని ఈ బినామీ వ్యవహారాన్ని కూడా నిరోధించాలి. అప్పుడే  ప్రభుత్వాలపైనా, అధికారపార్టీలపైనా, ప్రధానమంత్రులపైనా, ముఖ్యమం త్రులపైనా ప్రజలలో అవిశ్వాసం తగ్గుతుంది.


(వ్యాసకర్త : కె. రామచంద్రమూర్తి, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement