రాజకీయ భీష్ముడు రంగారెడ్డి
ఆత్మస్తుతి, పరనింద నిత్యకృత్యమైన రాజకీయాలలో మనుగడ సాగించలేక వేదిక దిగి మౌనంగా నిష్క్రమించిన నికార్సయిన పాతతరం నాయకులు అనేకమంది. గాంధీజీ ఆశయాలను తు.చ. తప్పకుండా ఆచరిస్తూ, ఖద్దరు దుస్తులను మాత్రమే ధరిస్తూ, నిరాడంబరంగా జీవిస్తూ జనజీవన, నైతిక ప్రమాణాలు పాటిస్తూ, ప్రజల సంక్షేమమే ప్రధానంగా, ప్రగతే లక్ష్యంగా ప్రజాసేవకు జీవితాలను అంకితం చేసిన మహనీయులు క్రమంగా కనుమరుగవుతున్నారు. సేవానురక్తి కలిగిన యువరాజకీయ నాయకులూ, గుండెల్లో ఆశయాలను నింపుకొని రాజకీయాలలోకి ప్రవేశించాలన్న అభిలాష కలిగిన యువకులూ అటువంటి అనుభవజ్ఞుల సూచనలూ, సలహాలూ పాటించి విజ యాలు సాధించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగే ఉండాలనీ, ఎన్ని పదవులు వరిం చినా పుట్టిపెరిగిన గ్రామాన్ని విడిచి వెళ్ళరాదనీ, నమ్ముకున్న వృత్తిని విస్మరించరాదనీ, అనుభవసారాన్ని కొత్త తరాలకు అందించాలనీ త్రికరణశుద్ధిగా విశ్వసించిన తలపండిన రాజకీయ నాయకులలో యాచవరపు రంగారెడ్డి ఒకరు. ఎనభయ్యోపడిలో కూడా ఆయన వ్యవసాయానికి స్వస్తి చెప్పలేదు. పాడీపంటకు దూరం కాలేదు. ప్రజల సంక్షేమం గురించి ఆలోచించడం మానలేదు. వర్తమాన రాజకీయాలను అధ్యయనం చేయడం, విశ్లేషించడం విరమించలేదు. వర్ధమాన రాజకీయ నాయకులకు సూచనలు చేయడం, సలహాలు ఇవ్వడం, మార్గనిర్దేశనం చేయడం ఆపలేదు. నిజాయితీపరుడుగా, మచ్చలేని నేతగా జీవితపర్యంతం ప్రజాసేవలో నిమగ్నమైన యాచవరపు రంగారెడ్డి (87) డిసెంబర్ 17న స్వగ్రామంలో కన్నుమూశారు.
మా స్వగ్రామం తల్లాడ (ఖమ్మం జిల్లా)లోనే రంగారెడ్డి పుట్టారు. కల్లూరు సమీపంలోని కొర్లగూడెంలో మేనమామ దగ్గర పెరిగారు. మేనమామ కుమార్తెనే వివాహం చేసుకొని అక్కడే స్థిరపడ్డారు. తల్లాడలో యాచవరపు నరసింహారెడ్డి, మా నాన్నగారూ, ఇతర స్వాతంత్య్ర సమరయోధులకు ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. వీరంతా జలగం వెంగళరావుకు సన్నిహితులు. శీలం సిద్ధారెడ్డి వర్గానికి దూరం. వెంగళరావు సహచరులలో కొర్లగూడెం రంగారెడ్డి, కిష్టారం ఉడతనేని సత్యం ముఖ్యులు. వెంగళరావు ఏదైనా పొరపాటు చేస్తే దాన్ని ఎత్తి చూపే ధైర్యం ఉన్న బహుకొద్దిమంది నాయకులలో రంగారెడ్డి ఒకరు. వెంగళరావు అనుచరుడిగా ఉంటూనే కొన్ని విషయాలలో ఆయనతో పూర్తిగా విభేదించిన నేత. ఉదాహరణకు వెంగళరావు నూటికి నూరుపాళ్ళూ సమైక్యవాది. 1969 నాటి ప్రత్యేక తెలం గాణ ఉద్యమాన్ని వ్యతిరేకించి బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో హోంమంత్రిగా చేరిన వ్యక్తి. రంగారెడ్డి తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. నేటి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో సాన్నిహిత్యం ఉంది.
రంగారెడ్డి రాజకీయాలు కొర్లగూడెం సర్పంచ్ పదవితోనే ఆరంభం. 1959 నుంచి 1964 వరకూ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఆయన తర్వాత కూడా ç2014 వరకూ కొర్లగూడెం సర్పంచ్‌లు ఏకగ్రీవంగానే ఎన్నికైనారు. రాష్ట్ర చరిత్రలో ఇది రికార్డు. కల్లూరు సమితి అధ్యక్షుడుగా (1964 నుంచి 1974 వరకూ) రంగారెడ్డి పనిచేశారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా రంగారెడ్డి 1974 నుంచి 1978 వరకూ ఉన్నారు. అదే కాలంలో మరెన్నో బాధ్యతలు నిర్వహించారు. జిల్లా రాజకీయాలలో భీష్మపితామహుడుగా పేరు తెచ్చుకున్న రంగారెడ్డి సామరస్యవాది. ప్రగతికాముకుడు. నీటిపారుదల, వ్యవసాయరంగాలపై అధికారం ఉన్న మేధావి. ప్రస్తుత రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తదితరులు ఆయనను పెద్దదిక్కుగా భావించేవారు. ఏ సమస్య ఎదురైనా పెద్దాయన ఆలోచన ఏమిటో తెలుసుకున్న అనంతరమే నిర్ణయం తీసుకోవడం పరిపాటి. ఎస్‌సీ కార్పొరేషన్ అధ్యక్షుడు పిడమర్తి రవి కూడా రంగారెడ్డి సూచనలు పాటించి రాజకీయాలలో ఎదుగుతున్న యువనాయకుడే. రంగారెడ్డి, అప్పమ్మ దంపతులకు నలుగురు కుమారులు. పెద్దకుమారుడు గోవర్ధనరెడ్డి ఖమ్మంలో న్యాయవాది. విష్ణువర్ధనరెడ్డి కొర్లగూడెంలోనే వ్యవసాయం. రాజవర్ధనరెడ్డి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీరు. రవివర్ధనరెడ్డి సత్తుపల్లి ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకుడు.
ఏ అంశమైనా వివరంగా చెబితే అర్థం చేసుకొని సవ్యంగా రాయగల సామర్థ్యం నాకున్నదని ఆయన విశ్వాసం. ఇరిగేషన్, వ్యవసాయ రంగాలలో ఎదురైన సమస్యల పరిష్కారాలు అన్వేషిస్తూ ఆయన నోట్స్ తయారు చేసుకొని గణాంకాలు సిద్ధం చేసుకొని నేను ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి గంటల తరబడి కూర్చొని విసుగులేకుండా వివరించేవారు. ‘ఉదయం’, ‘వార్త’ పత్రికలలో నేను పని చేస్తున్న రోజుల్లో తరచుగా వచ్చేవారు. క్షేత్రజ్ఞానం, శాస్త్రజ్ఞానం రెండూ సంపూర్ణంగా కలిగిన అటువంటి రాజకీయ నాయకులు అరుదు. రంగారెడ్డి అందించిన సాధికారికమైన సమాచారం అధారంగా నేను అనేక వ్యాసాలు రాశాను. అటువైపు వెళ్ళిన ప్రతిసారీ కొర్లగూడెం వెళ్ళడం, వేడివేడి టీ తాగుతూ ఆయనతో గంటల తరబడి మాట్లాడటం ఆనవాయితీ. కిందటి నెల కొత్తగూడెం, తల్లాడ వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలని బాల్యమిత్రుడు డాక్టర్ ఉపేంద్ర, నేనూ ప్రయత్నించాం. కానీ సమయాభావం వల్ల విరమించుకోవలసి వచ్చింది. నేలవిడవకుండా సాము చేసే ఆశావాదినీ, వ్యవసాయదారుల సంక్షేమంకోసం పరితపించే రైతుబాంధవుడినీ కడసారి చూసే అవకాశం దక్కలేదు. రంగారెడ్డి జీవితం ఈతరం, భావి తరం రాజకీయవాదులకు ఆదర్శం కావాలని ఆకాంక్ష. రంగారెడ్డి చూపిన బాటలో కట్టుతప్పకుండా నడవడమే ఆయనకు ఘనమైన నివాళి.
(డిసెంబర్ 26 ఉదయం కొర్లగూడెంలో సంతాపసభ)
(వ్యాసకర్త : కె.రామచంద్రమూర్తి సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ )