దూకుడు దౌత్యమా ?
త్రికాలమ్
స్వతంత్ర భారతం 70వ ఏట అడుగుపెడుతున్న సందర్భంలో ప్రమాదపు టంచుల్లోకి దేశాన్ని తీసుకొని వెళ్ళగల ఒకానొక దౌత్య క్రీడ రూపుదిద్దు కుంటున్నది. ఇంతకాలం కేంద్రంలో ఏ పార్టీ లేదా ఏ కూటమి ప్రభుత్వం వచ్చినా భారత విదేశాంగ విధానం మాత్రం మారదనే విశ్వాసం ఉండేది. ప్రధాని నరేంద్రమోదీ మదిలో మెదులుతున్నట్టు కనిపిస్తున్న ఆలోచనలు కనుక కార్యరూపం ధరిస్తే మన విదేశాంగ విధానం స్వరూపస్వభావాలు సమూలంగా మారిపోతాయి. మన దేశంలోనూ, ఇరుగుపొరుగు దేశాల లోనూ పరిస్థితులు ఇప్పుడున్నట్టు ఉండవని మాత్రం నిశ్చయంగా చెప్పవచ్చు.
శుక్రవారంనాడు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశంలో ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రసంగం ఇటువంటి అభిప్రాయానికి ఆస్కారం కలిగిస్తున్నది.
హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వానీని జులై 8న భద్రతాబలగాలు మట్టుపెట్టిన క్షణంలో రగులుకున్న కశ్మీరం ఇంతవరకూ చల్లారలేదు. అగ్రహోదగ్రులైన సాధారణ ప్రజలకూ, సాయుధ దళాలకూ మధ్య జరిగిన ఘర్షణలలో 56 మంది మరణించి, కొన్ని వందలమంది గాయపడినా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. వానీ నేలకొరిగిన తర్వాత నెలరోజులకు ఆగస్టు 9న ప్రధాని నోరు విప్పారు. శాంతి పునరుద్ధరణలో సహకరించవలసిందిగా కశ్మీరీలకు విజ్ఞప్తి చేశారు. కశ్మీర్‌లో జరుగుతున్నది స్వాతంత్య్ర పోరాట మనీ, స్వాతంత్య్ర సమర వీరులను భారత్ ఉక్కుపాదంతో అణచివేస్తు న్నదనీ అంతర్జాతీయ వేదికల మీద పాకిస్తాన్ యథావిధిగా మొత్తుకుం టున్నది. మొసలి కన్నీరు కార్చుతోంది. ఈ ధోరణి కొత్త కాదు.
అసాధారణ చొరవ
కశ్మీర్ లోయలో భారత ప్రభుత్వం పట్ల వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్న మాట నిజం. కశ్మీరీలు ఆగ్రహావేశాలతో ఊగిపోతున్న మాట కూడా వాస్తవం. పరిస్థితిని అదుపులోకి తేవడానికి కేంద్ర ప్రభుత్వం ఏదైనా అసాధారణ చొరవ ప్రదర్శించవలసిన సందర్భం ఇది. అవసర మైతే వేర్పాటువాదులతోనైనా చర్చలు జరపాలనీ, వారిని శాంతింపజే యాలనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తున్నది. అఖిలపక్ష సమావేశంలో నరేంద్రమోదీ ఇటువంటి చర్చల గురించిన ప్రతిపాదన చేస్తారని రాజకీయ పరిశీలకులు భావించారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ వేర్పాటువాదులతో చర్చల ప్రసక్తి లేదనీ, దేశ భద్రత విషయంలో రాజీపడే సమస్య లేదనీ మోదీ స్పష్టం చేశారు. అంతటితో ఆగకుండా పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న కశ్మీర్ భూభాగాన్ని (పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్-పీవోకే) భారత దేశంలో విలీనం చేయడమే దేశం ఎదుట మిగిలిన ఉన్న ఎజెండా అనీ, పీవోకేలోనూ, బలూచిస్తాన్‌లోనూ పాకిస్తాన్ సైన్యం సృష్టిస్తున్న హింసాకాండనూ, పౌరహక్కుల ఉల్లంఘనలనూ ప్రపంచం దృష్టికి తీసుకొని రావాలనీ ప్రధాని ఉద్ఘాటించారు.
‘అఫెన్స్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ డిఫెన్స్’ (ఎదురుదాడే ఆత్మరక్షణకు సరైన మార్గం) అన్న సూత్రాన్ని అమలు చేయాలని మోదీ సంకల్పించినట్టు ఆయన ధోరణి సూచిస్తున్నది. పాకిస్తాన్ పట్ల భారత్ విధానం దశాబ్దాలుగా మారలేదు. కశ్మీర్ అంశంపైన పాకిస్తాన్ మౌలిక విధానం సైతం అంతే. కశ్మీర్ లోయలో అస్థిరత సృష్టించడం, మిలిటెంట్లకు శిక్షణ ఇచ్చి లోయలోకి పంపించడం, హింసను ప్రేరేపించడం షరా మామూలే. అంతర్జాతీయ వేదిక లపై యాగీ చేయడానికి వచ్చిన ప్రతి అవకాశాన్నీ పాకిస్తాన్ సమర్థంగా సద్వినియోగం చేసుకుంది. 1971లో తూర్పు పాకిస్తాన్‌లో తిరుగుబాటు జరిగి బంగ్లాదేశ్‌గా స్వతంత్ర దేశం ఆవిర్భవించిన ఫలితంగా పాకిస్తాన్ రెండు ముక్కలైనప్పటికీ కశ్మీర్ విషయంలో మాత్రం దౌత్యపరంగా ఆధిక్యం ఇప్పటికీ పాకిస్తాన్‌దే. భారత దౌత్యవేత్తలూ, దేశాధినేతలూ ఆత్మరక్షణ కోసం దారులు వెదకవలసిందే కానీ పాకిస్తాన్ కు దీటుగా సమాధానం చెప్పే పరిస్థితి లేదు. భారత భద్రతా బలగాల నీడలో కశ్మీరీలు జీవిస్తున్నారనీ, వారికి స్వేచ్ఛాస్వాతంత్య్రాలు లేవనీ, మానవ హక్కులు మంటగలిశాయనీ ప్రపంచ ప్రజలను నమ్మించడంలో పాకిస్తాన్ ప్రభుత్వాలు విజయం సాధించాయి.
పాక్‌లో పరిపాలనను సైనిక వ్యవస్థ శాసిస్తున్నప్పటికీ, ఎన్నికైన ప్రధానులు సైన్యాధ్యక్షుడికి జీహుకుం అంటూ దీనంగా ఉన్న ప్పటికీ, బలూచిస్తాన్‌లో, పీవోకేలో ఆజాదీ పేరు మీద అశాంతి నెలకొన్న ప్పటికీ, పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ పెంచి పోషించిన ఉగ్రవాదం పాకిస్తాన్‌నే కాటేస్తూ మారణహోమం సృష్టిస్తున్నప్పటికీ కశ్మీర్ విషయంలో మాత్రం అంతర్జాతీయంగా ఇండియాను బదనాం చేయడంలోనూ, ఇండియాకు తలవంపులు తేవడంలోనూ పాకిస్తాన్ విజయం సాధిస్తూనే ఉన్నది. ఈ పరిస్థిని మార్చివేయాలనే నిర్ణయం నరేంద్రమోదీ తీసుకున్నట్ల యితే భారత విదేశాంగ విధానంలో అత్యంత కీలకమైన, సకారాత్మకమైన మార్పు రావలసి ఉన్నది. సంజాయిషీ చెప్పుకునే దుస్థితి నుంచి పాకిస్తాన్‌ని అంతర్జాతీయ సమాజం ఎదుట దోషిగా నిలబెట్టే స్థితికి ఎదగాలి. అంతర్జా తీయ వ్యవహారాల ప్రవీణులు కొందరు ప్రతిపాదిస్తున్న విదేశీ విధానంలో దూకుడు సిద్ధాంతాన్ని ఎన్‌డీఏ ప్రభుత్వం అమలు చేస్తే అమెరికాకు ఇండియా మరింత దగ్గరవుతుంది. బహుశా ‘నాటో’ (నార్త్ అంట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) కూటమిలో సైతం చేరుతుంది.
సరికొత్త వ్యూహం
ఈ సిద్ధాంతం ప్రకారం కశ్మీర్ సమస్యను హద్దు మీరకుండా చూసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటూనే పాకిస్తాన్‌ను ఇరకాటంలో పెట్టే వ్యూహం అమలు చేయాలి. అఫ్ఘానిస్తాన్‌లో తాలిబాన్ సర్కార్ ఉన్న సమ యంలో విమానం హైజాక్ చేయడం, అఫ్ఘానిస్తాన్‌లోని కాంధహార్‌కు దారి మళ్ళించడం, వాజపేయి ప్రభుత్వంలో విదేశాంగమంత్రిగా ఉన్న జస్వంత్ సింహ్ కశ్మీర్ మిలిటెంట్ల అగ్రనాయకులను వెంటబెట్టుకొని కాంధహార్ వెళ్ళి అక్కడ వారిని హైజాకర్లకు అప్పగించి ప్రయాణికులను రక్షించడం వంటి నాటకీయ పరిణామాలు సంభవించాయి. అఫ్ఘానిస్తాన్‌లో మళ్ళీ ఆధిపత్యం కోసం పాకిస్తాన్ ప్రోత్సాహంతో తాలిబాన్ విశ్వప్రయత్నం చేస్తున్నది. దాన్ని విఫలం చేయడానికి అఫ్ఘానిస్తాన్ ప్రభుత్వం, అమెరికా సైన్యం సర్వశక్తు లనూ వొడ్డుతున్నాయి. భారత్ మొదటి నుంచి అఫ్ఘానిస్తాన్‌కు దూరదూ రంగానే ఉంటూ వచ్చింది. అఫ్ఘాన్ పార్లమెంటు భవనం నిర్మాణానికి చొరవ తీసుకోవడం, అక్కడ ప్రాథమిక సౌకర్యాల నిర్మాణానికి సహకారం అందిం చడం వంటి కార్యక్రమాలు ఇండియా తరఫున ఇటీవలనే ప్రారంభమై నాయి. దూకుడు సిద్ధాంతం ప్రకారం అఫ్ఘానిస్తాన్‌కు ఇండియా మరింత సన్నిహితం కావాలి. అఫ్ఘానిస్తాన్ సైనికులను ఇండియా తీసుకొని వచ్చి శిక్షణ ఇవ్వాలి. విస్తారమైన శిక్షణ వసతులు ఇండియాలో ఉన్నాయి. అఫ్ఘాన్ సైన్యానికి తర్ఫీదు ఇచ్చి, వారికి అవసరమైన ఆధునికమైన ఆయుధాలు సమకూర్చగలిగితే వారు తాలిబాన్‌ను నిరోధించగలరు. సరిహద్దులను రక్షించుకోగలరు. అఫ్ఘానిస్తాన్‌లో పాకిస్తాన్ ప్రాబల్యం మళ్ళీ పెరగకుండా చేయడం ఇండియాకు చాలా అవసరం.
పీవోకేలో కశ్మీరీలు సంతోషంగా లేరు. అక్కడా ఆజాదీ కోసం ఉద్యమం జరుగుతోంది. ఇటీవల పాక్ ప్రభుత్వం 500 మంది కశ్మీరీలను అరెస్టు చేసింది. పీవోకేలో పీడననూ, దౌర్జన్యాన్నీ భరించలేక వలస వెళ్ళిన కశ్మీరీలు అనేక దేశాలలో తలదాచుకున్నారు. వారి వివరాలు తెలుసుకొని వారిని సమీకరించాలి. పీవోకేలో అమానవీయ పరిస్థితులపైన వారి చేత ప్రపంచ దేశాలకు చెప్పించే ప్రయత్నం భారత విదేశాంగ మంత్రిత్వశాఖ చేయవలసి ఉంటుంది. జమ్మూ-కశ్మీర్ రాష్ట్రాన్ని ఇకమీదట నాలుగు భాగాలు-జమ్మూ, కశ్మీర్ లోయ, లద్ధాఖ్, పీవోకే-గా పరిగణించాలి. భవిష్యత్తులో అంతర్జా తీయ వేదికలపైన వాదనలన్నీ ఈ ప్రాతిపదికపైనే జరగాలి.
బలూచిస్తాన్‌పై ఉక్కుపాదం
బలూచిస్తాన్‌లో ఇప్పటికే భారత గూఢచారి సంస్థ ‘రా’ (రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్) అసమ్మతి రాజేసిందని పాకిస్తాన్ అభియోగం. కశ్మీర్‌లో అల్లర్లు జరిగినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలను నిందించిన విధంగానే బలూచిస్తాన్‌లో అశాంతికి ‘రా’ ను ఆడిపోసుకోవడం పాకిస్తాన్‌కు అలవాటు. ఉదాహరణకు వారం రోజుల కిందట (సోమవారం) క్వెట్టాలో ఉగ్రవాదుల దాడిలో 72 మంది అమాయకులు దుర్మరణం పాలైనారు. ఈ దాడి తమ పనేనంటూ ఇస్లామిక్ స్టేట్, పాకిస్తాన్ తాలిబాన్ చీలిక వర్గమైన జమాత్-ఉల్-అహ్రార్ ప్రకటించాయి. అయినప్పటికీ, ఇది ‘రా’ జరిపించిన రాక్షస క్రీడేనంటూ బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సనావుల్లా జెహ్రీ ఆరోపించారు. బలూచిస్తాన్ హక్కుల కార్యకర్త, మహిళా నాయకురాలు నాయిలా ఖాద్రీ బటూచ్ ఇటీవల ఢిల్లీ సంద ర్శించినప్పుడు తన రాష్ట్రంలో ఏమి జరుగుతున్నదో వెల్లడించారు. పదిహేను సంవత్సరాలుగా బలూచిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వంతో యుద్ధం చేస్తున్నారని చెప్పారు.
మానవహక్కుల ఉల్లంఘనలకు లెక్క లేదనీ, ఇప్పటి వరకూ 25 వేలమంది పురుషులూ, మహిళలూ, చిన్నారులూ అదృశ్యమైనారనీ, బలూచిస్తాన్‌లో గుర్తు తెలియని వందలమందిని ఖననం చేసిన సామూహిక సమాధులు అనేకం ఉన్నాయనీ ఆమె ఆరోపించారు. పాకిస్తాన్ సైనికులు బలూచీలపైన విచక్షణారహితంగా కాల్పులు జరుపు తున్నారనీ, మహిళలపై అత్యాచారాలు చేస్తున్నారనీ ఆమె ఆగ్రహం వెలిబు చ్చారు. కశ్మీర్ విషయంలో ఇండియాపైన పాకిస్తాన్ చాలా సంవత్సరాలు ఎటువంటి ఆరోపణలు చేస్తున్నదో అంతకంటే తీవ్రమైన ఆరోపణలనే బలూచీ హక్కుల నాయకురాలు పాకిస్తాన్‌పైన చేశారు. మోదీ సర్కార్ బలూచిస్తాన్‌కు నైతికంగా అండదండలు సమకూర్చాలని నయీలా ఖాద్రీ బలూచ్ విజ్ఞప్తి చేశారు. దూకుడు సిద్ధాంతం ప్రకారం కశ్మీర్‌లో భారత వ్యతిరేక ధోరణులను పాకిస్తాన్ బలపరచినట్టే బలూచిస్తాన్‌లో తిరుగుబాటు విజయానికి ఇండియా బాటలు వేయాలి. ఆ విధంగా పాకిస్తాన్‌కు కశ్మీర్ వైపు కన్నెత్తి చూసే తీరిక లేకుండా, శక్తి లేకుండా బలూచీ ఊబిలోకి నెట్టాలి.
దూకుడు సిద్ధాంతం అమలు చేస్తే భారత్‌కు మేలు జరుగుతుందో, కీడు జరుగుతుందో చెప్పడం కష్టం. పాకిస్తాన్ ఉగ్రవాదం ఉచ్చులో పడి గిలగిల లాడుతూ, బలూచీ తిరుగుబాటుతో యాతనపడుతూ, పీవోకే ఆజాదీ ఉద్యమంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ సైన్యాన్ని రంగంలో దింపి అణచివేతకు ప్రయత్నిస్తే హక్కులను కాలరాసినందుకు అభిశంసన తప్పదు. అంతర్జాతీ యంగా ఇప్పుడున్న కొద్దిపాటి పరువుప్రతిష్ఠలు సైతం మంటగలసి పోతాయి. దక్షిణాసియాలో తనకు అనుకూలమైన వాతావరణం సృష్టించు కునేందుకు పథకం అమలు చేస్తున్న చైనా పని కుదేలు అవుతుంది. ఇదే విధంగా జరిగితే దూకుడు సిద్ధాంతం సత్ఫలితాలు ఇచ్చినట్టే. మరో విధంగా జరిగితే? పాకిస్తాన్‌తో మరో యుద్ధం రావచ్చు. పాకిస్తాన్‌కు చైనా అండగా నిలవవచ్చు. భారత్‌కు తోడుగా అమెరికా చేరవచ్చు. అది పరస్పర హననోద్యోగానికి దారితీయవచ్చు. అణుయుద్ధం సంభవించి దక్షిణాసియా యావత్తూ శ్మశానం కావచ్చు. అందుకే దూకుడు సిద్ధాంతం అమలు చేయడం ప్రమాదపుటంచుల్లో భయానకమైన విన్యాసం. ఆచితూచి అడుగులేయకపోతే అధఃపతనమే. ఇంతటి సాహసం మోదీ చేస్తారా?
వ్యాసకర్త: కె. రామచంద్రమూర్తి