ఇది ధర్మాగ్రహం! | Justice Jasti Chelameswar boycotts collegium, questions transparency | Sakshi
Sakshi News home page

ఇది ధర్మాగ్రహం!

Published Sun, Sep 11 2016 1:20 AM | Last Updated on Mon, Sep 4 2017 12:58 PM

ఇది ధర్మాగ్రహం!

ఇది ధర్మాగ్రహం!

త్రికాలమ్

‘ప్రజలు న్యాయవ్యవస్థపైనే ఆశలు పెట్టుకున్నారు’. ఈ వ్యాఖ్య చేసిన వ్యక్తి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లోధా. న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించాలనీ, అందులో ప్రభుత్వానికి లేశమాత్రమైనా ప్రమేయం ఉండరాదనే వాదనతో విభేదిస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకుర్‌కి లేఖ రాసిన అనంతరం సాగుతున్న మేధోమథనంలో భాగంగా జస్టిస్ లోధా తన అభిప్రాయం వెలి బుచ్చారు. ఆయన మనోగతం ఏమంటే ప్రభుత్వాలూ, చట్టసభలూ భ్రష్టు పట్టిపోయాయనీ, ప్రజాస్వామ్య సౌధానికి నాలుగో స్తంభంగా చెప్పుకుంటున్న మీడియా సైతం విఫలమైందనీ, ఒక్క న్యాయవ్యవస్థ మాత్రమే ఇంకా ప్రజా స్వామ్యాన్ని నిలబెట్టి ఉంచిందనీ.

ఈ అంశంపైన జనాభిప్రాయం సేకరిస్తే లోధా నమ్మకం నిరాధారమని తేలవచ్చు. మూడు దశాబ్దాల కిందట ప్రజలకు అచంచల విశ్వాసం ఉన్న మాట వాస్తవమే. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ముఖ్యంగా పదేళ్ళుగా సంభవించిన పరిణామాలు న్యాయవ్యవస్థను సైతం తక్కిన వ్యవస్థల స్థాయికి దిగజార్చాయి. ఈ దుస్థితి మారాలంటే ఎవరో ఒకరు నడుం బిగించాలి. బహిరంగ చర్చ జరగాలి. ఇందుకు తెరలేపే సాహసం చేసినందుకు జస్టిస్ చలమేశ్వర్‌ను అభినందించాలి. ఈ సమస్యను దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం చేసినందుకు ప్రజాస్వామ్యంలో విశ్వాసం ఉన్న వారందరూ ఆయనకు కృత జ్ఞతలు చెప్పాలి.

సాగిలపడిన వ్యవస్థ
పాలనా వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు న్యాయవ్యవస్థ డీలా పడిన సందర్భాలు చూశాం. పాలనా వ్యవస్థ బలహీనమైనప్పుడు న్యాయవ్యవస్థ ఆధిక్యం ప్రద ర్శించడమూ కనిపించింది. ఆత్యయిక పరిస్థితిలో వొంగమంటే నేలమీద డేకారంటూ పాత్రికేయులను బీజేపీ నేత అడ్వాణీ ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్య న్యాయవ్యవస్థకూ చక్కగా సరిపోతుంది. ఆత్యయిక పరిస్థితి ప్రకటనకు ముందే 1973లోనే ముగ్గురు న్యాయమూర్తులను పక్కన పెట్టి వారికంటే తక్కువ అనుభవం (సీనియారిటీ) ఉన్న న్యాయమూర్తికి ప్రధాన న్యాయ మూర్తిగా పట్టం కట్టినప్పుడే ఇందిరాగాంధీ న్యాయవ్యవస్థపైన ప్రభుత్వం ఆధిక్యాన్ని చాటారు. కమిటెడ్ జుడిషియరీ (నిబద్ధత కలిగిన న్యాయవ్యవస్థ) అంటూ ప్రభుత్వ సైద్ధాంతిక ధోరణితో ఏకీభవించే న్యాయవ్యవస్థ కావాలంటూ సామ్యవాదం (సోషలిజం)వైపు మొగ్గే న్యాయమూర్తులకు ప్రాధాన్యం ఇవ్వా లన్న విధానం అమలులోకి వచ్చిన తర్వాత దానికి నిరసనగా పదవులను తృణప్రాయంగా త్యాగం చేసిన న్యాయమూర్తులను ఒక చేతి వేళ్ళపైన లెక్క పెట్టవచ్చు. కనుక ప్రజాస్వామ్య పరిరక్షణ తమకు మాత్రమే సాధ్యమని కానీ, అందుకు అవసరమైన అంకితభావం, తెగువ తమకు మాత్రమే ఉన్నాయని కానీ న్యాయనిర్ణేతలు ఎవరైనా భావిస్తే అంతకంటే పొరపాటు మరొకటి లేదు.

ఆ తర్వాతైనా న్యాయవ్యవస్థ నిటారుగా నిలబడలేదు. 1980ల వరకూ బిక్కుబిక్కుమంటూనే ఉంది. 1991లో కేంద్రంలో మైనారిటీ ప్రభుత్వం, అనంతరం బలహీనమైన సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడిన సందర్భంలో న్యాయ వ్యవస్థది పైచేయి అయింది. సెకెండ్ జడ్జెస్ కేసును 1993లో పరిష్కరించిన న్యాయమూర్తులే ప్రభుత్వం చేతుల్లో న్యాయమూర్తులను నియమించే అధి కారం కొనసాగితే ప్రమాదమని తీర్మానించారు. న్యాయమూర్తుల నియామ కంపైన సీనియర్ న్యాయమూర్తులే నిర్ణయాలు చేయాలనీ, అందుకు ప్రధాన న్యాయ మూర్తి, మరి ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన కొలీజియం వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వాజపేయి నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం (ఎన్‌డీఏ-1) అంత బలహీనమైనది కాకపోయినా అత్యంత ఉదార మైనది. ఆ మెతకదనాన్ని ఆసరాగా తీసుకొని 1998లో థర్డ్ జడ్జెస్ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ పీఠం కొలీజియం వ్యవస్థను విస్తరించి బలోపేతం చేసింది.

సభ్యుల సంఖ్యను అయిదుకు పెంచింది-ప్రధాన న్యాయమూర్తికి తోడు నలుగురు అత్యంత అనుభవజ్ఞులైన న్యాయమూర్తులు. ప్రధాన న్యాయ మూర్తి ప్రథముడు. తక్కిన నలుగురూ సమానులే. ఇప్పటి కొలీజియంలో జస్టిస్ చలమేశ్వర్ అయిదో న్యాయమూర్తి అనడం సరి కాదు. నలుగురిదీ సమాన హోదా. కొలీజియం నిర్ణయాలపై విమర్శలు వెలువెత్తిన సందర్భాలు అనేకం. న్యాయమూర్తులు తమ బంధువులనూ, స్నేహితులనూ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమిస్తున్నారంటూ న్యాయవాద వర్గాలు గగ్గోలు పెట్టాయి. సమర్థత, నిజాయితీ, ధర్మాభినివేశం కలిగిన వారిని పక్కన పెట్టి ఇతరేతర కారణాల వల్ల అనర్హులను గద్దె(బెంచి)నెక్కించిన విషయం అందరికీ తెలుసు. న్యాయ మూర్తులుగా నియమితులైన వారంతా అనర్హులని కాదు. అనర్హులను అందలం ఎక్కిస్తున్నారన్న విమర్శలో నిజం ఉన్నదనే అభిప్రాయం జనసామాన్యంలో బలంగా నాటుకున్నది.

న్యాయవ్యవస్థ పెత్తనం
అయినప్పటికీ సర్వోన్నత న్యాయస్థానం పాలనా వ్యవస్థపైన తన ఆధిక్యాన్నీ, ఆధిపత్యాన్నీ యూపీఏ పదేళ్ళ పరిపాలనలో అప్రతిహతంగా కొనసాగించింది. యూపీఏ నాయకత్వం సీబీఐని రాజకీయ ప్రత్యర్థులపైన ప్రయోగిస్తే సీబీఐని నియంత్రించే బాధ్యత సుప్రీంకోర్టు స్వీకరించడం ఒక ముఖ్యమైన మలుపు. డోలాయమాన స్థితిలో నిర్ణయాలు తీసుకునే సాహసం చేయలేని ప్రభుత్వం న్యాయవ్యవస్థకు పూర్తిగా లొంగిపోయిన సన్నివేశమది. ప్రభుత్వం తీసు కోవలసిన నిర్ణయాలను సుప్రీంకోర్టు తీసుకున్న సందర్భం. పాలన వ్యవస్థ బలహీనపడిన మాట వాస్తవం. బాధ్యత లేని అధికారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ చేతుల్లో ఉండటం, ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు అధికారం లేకపోవడం వల్ల ఏర్పడిన గందరగోళాన్ని న్యాయవ్యవస్థ వినియోగించుకు న్నది. వాస్తవానికి రాజకీయ వ్యవస్థలో విలువలు పతనమైన సమయం లోనే న్యాయ వ్యవస్థలోనూ ప్రమాణాలు పడిపోయాయి.

న్యాయమూర్తులపైన అవినీతి ఆరోపణలు
ఆత్యయిక పరిస్థితిలోనే-1976లో- నాటి మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ వీరాస్వామిపైన అవినీతి అరోపణలతో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయడానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుమతించారు. న్యాయ మూర్తిని అవినీతి నిరోధక చట్టం కింద విచారించవచ్చునా, కూడదా అనే ప్రశ్నపైన న్యాయవ్యవస్థలో వాదోపవాదాలు జరిగాయి కానీ కేసు ముందుకు సాగలేదు. అనంతరం పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న కాలంలో జస్టిస్ రామస్వామిని అభిశంసించే తీర్మానంపైన పార్లమెంటు చర్చించింది. బాంబే హైకోర్టు న్యాయమూర్తులు ఇద్దరు నేర ప్రపంచంతో సంబంధాలు కలిగి  ఉన్నారనే అరోపణలు వచ్చిన కారణంగా వారు పదవుల నుంచి వైదొలగవలసి వచ్చింది.

ఒక న్యాయమూర్తి తాను రాయబోయే పుస్తకానికి పారితోషికం కింద ముందస్తుగా 70 లక్షలు స్వీకరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆయనకు అడ్వాన్స్ చె ల్లించిన ప్రచురణ సంస్థకు నేరస్థ ప్రపంచంతో బంధాలు ఉన్నాయని తేలింది. 1996 నుంచి ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులపైనే అవినీతి ఆరోపణలు వినిపించసాగాయి. 2003లో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఒకరు రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థకు బంటుగా తేలి పదవికి రాజీనామా సమర్పించారు. ఇటువంటివి అనేకం ఉన్నా న్యాయవ్యవస్థ పరువును యమునా నదిలో కలిపిన ఘటన 2009లో జరిగింది. ప్రముఖ న్యాయవాది, పౌరహక్కుల నేత ప్రశాంత్ భూషణ్ ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంతవరకూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా వ్యవహరించిన 16 మందిలో సగం మంది అవినీతిపరులేనంటూ ఆరోపించారు.

ప్రశాంత్ భూషణ్‌పైన కోర్టు ధిక్కార నేరంపైన కేసు నమోదు చేశారు. నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి అల్తమస్ కబీర్ నాయకత్వంలో ముగ్గురు న్యాయమూర్తుల కమిటీ ప్రశాంత్ భూషణ్‌కి నోటీసు జారీ చేసింది. సరిగ్గా ఏడాదికి 2010లో ఆయన తండ్రి, కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి, ప్రముఖ న్యాయవాది శాంతిభూషణ్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో అంతవరకూ ప్రధాన న్యాయ మూర్తులుగా పని చేసినవారిలో ఎనిమిదిమంది మంది కచ్చితంగా అవినీతి పరులనీ, ఆరుగురు నిశ్చయంగా నీతిమంతులనీ, తక్కిన ఇద్దరి విషయంలో కరాఖండిగా చెప్పడానికి తన వద్ద సమాచారం లేదనీ వివరించారు. నీతి మంతులైన, అవినీతిపరులైన న్యాయమూర్తుల పేర్లు కూడా శాంతిభూషణ్ పేర్కొన్నట్టు వార్తలు వచ్చాయి. ప్రశాంత్‌పై కేసు ఎటుపోయిందో, శాంతి భూషణ్‌పై ఏ చర్య తీసుకున్నారో తెలియదు. అసలు న్యాయమూర్తి పరిశీలన లోకి ప్రశాంత్ భూషణ్ కేసు వెళ్ళలేదని ప్రముఖ రచయిత ఎస్ గురుమూర్తి అంటున్నారు.

నరేంద్రమోదీ ఘనవిజయం
పాలనా వ్యవస్థ, న్యాయవ్యవస్థ పరువు బజారుపాలైన సందర్భంలో 2014లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీ విరాట్ స్వరూపం ప్రదర్శించి, వందలాది సభలలో అద్భుతంగా ప్రసంగించి, ఘన విజయం సాధించి బలమైన ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. దాదాపు రెండున్నర దశాబ్దాల అనంతరం ఒకే పార్టీకి పూర్తి మెజారిటీ లభించింది. న్యాయవ్యవస్థ జోక్యందారీ వైఖరిని కట్టడి చేసే ఉద్దేశంతో నేషనల్ జుడీషియల్ అప్పాయింట్‌మెంట్స్ కమిషన్ (ఎన్‌జేఏసీ) బిల్లును 2014 డిసెంబర్‌లో పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించి కొత్త చట్టం తెచ్చింది. ఈ చట్టం ప్రకారం ఎన్‌జేఏసీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులూ, కేంద్ర న్యాయవ్యవహారాల శాఖ మంత్రి, ఇద్దరు ప్రముఖ వ్యక్తులు ఉంటారు.
 
ప్రభుత్వం జోక్యంతో న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తికి భంగం వాటి ల్లుతుందనీ, ఇది రాజ్యాంగ స్వభావానికి విరుద్ధమనీ అంటూ సుప్రీంకోర్టు రాజ్యాంగ పీఠం 2015 అక్టోబర్ 16న తీర్పు చెప్పింది. రాజ్యాంగసమ్మతం కాదంటూ ఈ చట్టాన్ని కొట్టివేయాలని నలుగురు న్యాయమూర్తులు తీర్పు చెబితే, అయిదో న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ మాత్రం మెజారిటీ అభి ప్రాయంతో విభేదించారు. న్యాయమూర్తుల నియామకాలతో ప్రభుత్వానికి ఏ మాత్రం ప్రమేయం ఉండరాదనే వాదనతో చలమేశ్వర్ ఏకీభవించలేదు. ఏ ఇతర ప్రజాస్వామ్య దేశంలోనూ ప్రభుత్వ ప్రమేయం లేకుండా న్యాయవ్యవస్థ లేదని వాదించారు.

ఒక వ్యవస్థపైన మరో వ్యవస్థ నిఘా ఉంచే విధంగా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ విధానం ద్వారా సమతౌల్యాన్ని పరిరక్షించాలనే రాజ్యాంగ నిర్మాతల లక్ష్యానికి కొలీజియం వ్యవస్థ  గండి కొట్టిందనీ, ఈ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం లేవని, నియామకాలలో బంధుప్రీతి కనిపి స్తున్నదనే ఆరోపణలు వస్తున్నాయనీ జస్టిస్ చలమేశ్వర్ కుండ బద్దలు కొట్టారు. రెండు దశాబ్దాలుగా న్యాయమూర్తుల నియామకాలను శాసిస్తున్న కొలీజియం వ్యవస్థపైన సూటిగా, బలంగా, ధర్మాగ్రహంతో దాడి చేసిన ఘనత జస్టిస్ చలమేశ్వర్‌కు దక్కింది. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఆయన చేసిన దోహదాన్ని భావి తరాలు కృతజ్ఞతాపూర్వకంగా గుర్తుపెట్టుకుంటాయి.
 
రట్టయిన గుట్టు

కొలీజియం సమావేశాలు రహస్యంగా జరుగుతాయనీ, అయిదుగురు సభ్యు లలో ముగ్గురు ఎవరికి అనుకుంటే వారికే అవకాశం వస్తుందనీ, తక్కిన ఇద్దరు వ్యతిరేకించినా పట్టించుకోకుండా ఏకగ్రీవంగా నిర్ణయాలు జరిగినట్టు ప్రక టిస్తున్నారనీ, సమావేశ వివరాల నమోదు, విభేదించిన సభ్యుల అభి ప్రాయాలు, ఇతర ప్రముఖుల అభిప్రాయాలు సేకరించడం, ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి తెలియజేయడం జరగడం లేదని వెల్లడించి జాతి యావత్తునూ జస్టిస్ చలమేశ్వర్ దిగ్భ్రాంతికి గురి చేశారు. న్యాయమూర్తుల ఖాళీల భర్తీలో జాప్యంపై ప్రధానిని అడుగుతూ కంట తడిపెట్టిన జస్టిస్ ఠాకుర్ మొన్న స్వాతంత్య్రదినోత్సవ సందేశంలో న్యాయమూర్తుల నియామకాల గురించి ఆయన ప్రస్తావించనందుకు ఆవేదన వ్యక్తం చేశారు.

అంత ఆవేశంగా స్పందించే గుణం కలిగిన జస్టిస్ ఠాకుర్ సైతం జస్టిస్ చలమేశ్వర్ తనకు రాసిన లేఖ గురించి విలేఖరులు ప్రశ్నించినప్పుడు, ‘త్వరలోనే మేము పరి ష్కరించుకుంటాం’ అంటూ ముక్తసరిగా సమాధానం చెప్పారు. ఇది ఇద్దరి మధ్యనో, లేక కొలీజియం సభ్యుల మధ్యనో పరిష్కరించుకోవలసిన వివాదం కాదు. నిజానికి ప్రభుత్వానికీ, న్యాయవ్యవస్థకీ మధ్య రగులుతున్న చిచ్చు మాత్రమే కాదు. ప్రజలకు సంబంధించిన అతి ముఖ్యమైన అంశం. అందుకే జస్టిస్ చలమేశ్వర్ ఉద్దేశిం చినట్టు ఈ వివాదంపై బహిరంగ చర్చ జరగాలి. దాపరికాన్ని అంతం చేయాలి. సంస్కరణలకు బాట వేయాలి. చట్టపాలనకు పట్టం కట్టాలి.
 
అమెరికా, బ్రిటన్‌లో....
ప్రభుత్వ ప్రమేయంలేని న్యాయవ్యవస్థలు ప్రజాస్వామ్య దేశాలలో ఎక్కడా లేవు. అమెరికాలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాలకు సంబం ధించిన ప్రతిపాదన అధ్యక్ష భవనం నుంచి వెడుతుంది. అధ్యక్షుడు సూచించిన పేర్లను సెనేట్ కమిటీ పరిశీలించి ఆమోదించాకే న్యాయమూర్తుల నియామకం జరుగుతుంది. అధ్యక్షుడు ప్రతిపాదించినా సెనేట్ తిరస్కరించినట్లయితే ఆ నిర్ణయానికి తిరుగులేదు.  అమెరికా రాజ్యాంగం రెండవ అధికరణలో రెండవ సెక్షన్ కింది సెనేట్‌కు ఈ అధికారాలు సంక్రమించాయి. అధ్యక్షుడు సెనేట్ సలహా, ఆమోదం కోరాలని ఈ సెక్షన్ స్పష్టం చేసింది. అంటే పాలన వ్యవస్థకూ, చట్ట వ్యవస్థకూ న్యాయమూర్తుల నియామకంలో ప్రమేయం ఉండేవిధంగా అమె రికా రాజ్యాంగ నిర్మాతలు నిర్ణయించారు. అధ్యక్షుడు ప్రతిపాదించిన తర్వాత సెనేట్ తిరస్కరించిన మొట్టమొదటి అభ్యర్థి జాన్ రూట్లేజ్.

1795లో రూట్లేజ్‌ను ప్రతిపాదించిన అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్. అమెరికా ఆవిర్భావం తర్వాత 2005 వరకూ అధ్యక్షులు ప్రతిపాదించిన 149 మంది అభ్యర్థులలో 27 మందిని సెనేట్ తిరస్కరించింది. బ్రిటన్‌లోనూ జూడీషియల్ అప్పాయింట్‌మెంట్స్ కమిషన్ (జేఏసీ) ఉంది. న్యాయమూర్తి పదవికి ఏవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కమిటీ ప్రతిపాదించే అభ్యర్థుల పేర్ల జాబితాను లార్డ్ చాన్సలర్ (న్యాయ మంత్రి)కి పంపుతారు. ఆయన, ప్రధాని ఖరారు చేసిన జాబితాను రాజ్యాధినేత రాణికి పంపుతారు. కనుక ప్రభుత్వ ప్రమేయం బొత్తిగా ఉండరాదనే వాదనలో అర్థం లేదు. పైగా సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించిన పేర్లను కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రపతికి పంపించాలి. ఆ జాబితాను రాష్ట్రపతికి గుడ్డిగా నివేదిం చడమే కేంద్ర న్యాయశాఖ మంత్రి పరిమితం కావాలని కోరుకోవడం న్యాయమా? వాస్తవానికి థర్డ్ జడ్జెస్ కేసులో కొలీజియంను విస్తరిస్తూ రాజ్యాంగపీఠం చెప్పిన తీర్పులోని కీలకమైన అంశాలను కొలీజియం పాటిం చడం లేదని జస్టిస్ చలమేశ్వర్ ధ్వజమెత్తిన తర్వాత వెల్లడి అవుతోంది.

థర్డ్ జడ్జెస్ కేసుపై 1998 అక్టోబర్ 28 రాజ్యాంగ పీఠం ఇచ్చిన ఉత్తర్వు పాఠంలో 22వ పేరా కొలీజియం విధివిధానాలను స్పష్టంగా పేర్కొంది. సభ్యులందరి అభి ప్రాయాలనూ నమోదు చేయాలనీ, అభ్యర్థులు ఏ హైకోర్టు నుంచి వచ్చారో ఆ హైకోర్టులోని ప్రధాన న్యాయమూర్తి, సీనియర్ న్యాయవాదుల అభి ప్రాయాలను సైతం సేకరించాలనీ, వీటిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిఫార్సులతో సవివరంగా ప్రభుత్వానికి పంపాలనీ ఉత్తర్వులో స్పష్టంగా ఉంది. కొలీజియం సమావేశం తాలూకు వివరాలనూ, సభ్యుల, అసమ్మతి తెలియజేసిన సభ్యుల అభిప్రాయాలనూ వివరంగా రాసి పంపించాలన్నది అందులో ప్రధానమైన అంశం. ఇంత వివరంగా థర్డ్ జడ్జెస్ కేసులో తీర్పు వెలువడిన తర్వాత పదహారేళ్ళపాటు ఈ అంశాలను ప్రధాన న్యాయ మూర్తులు తుంగలో తొక్కారు. సమావేశ వివరాలను నమోదు చేయనేలేదు. ఫలానా కొలీజియం, ఫలానా న్యాయవాదిని ఎందుకు సిఫార్సు చేసిందో తెలుసుకోవాలంటే న్యాయ మూర్తులకు కూడా సాధ్యం కాదు. రికార్డు లేదు.

అసమ్మతి తెలిపిన వైనం కానీ, అసమ్మతిని తెలిపింది ఎవరనే వివరం కానీ ఎక్కడా లేదు. ముగ్గురో, నలుగురో కూడబలుక్కొని తీసుకున్న నిర్ణయాలను దేశం మీద రుద్దే ప్రక్రియే అమల వుతోంది. ఇది రాజ్యాంగ ధర్మాసం ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించడం తప్ప వేరొకటి కాదు. ఈ దాపరికాన్నే, ఈ జవాబుదారీతనం లేని బేపర్వా వైఖరినే జస్టిస్ చలమేశ్వర్ ప్రశ్నించారు. దీనివల్ల అర్హులైనవారికీ, ప్రతిభావంతులైన వారికీ  అవకాశాలు రావడంలే దనీ, కొలీజియం సభ్యులతో సామీప్యం ఉన్నవారికీ, వారి దృష్టిలో పడిన వారికీ, వారిని మెప్పించినవారికి మాత్రమే అవకాశాలు లభిస్తాయనీ అర్థం. దీని వల్ల న్యాయవ్యవస్థ ప్రమాణాలు పడిపోతున్నాయనీ, కొంత కాలానికి ఈ వ్యవస్థ కుప్పకూలిపోతుందనీ జస్టిస్ చలమేశ్వర్ ఆవేదన. తనకి ఒకరి పట్ల వ్యతిరేకత కానీ, ఎవరినైనా మెప్పించవలసిన అవసరం కానీ లేదని ఆయన స్పష్టం చేశారు. ‘నేను రెండేళ్ళలోపే(2018 జూన్)పదవీ విరమణ చేయ బోతున్నాను. ఆ తర్వాత నేను ఎటువంటి పదవినీ ఆశించడం లేదు. ఏదో ఒక కమిషన్‌కు అధ్యక్షుడుగా పనిచేసే ఆలోచన లేనే లేదు’ అంటూ సూటిగా చెప్పారు.

 జస్టిస్ చలమేశ్వర్‌కు లేనిపోని దురుద్దేశాలు ఆపాదించడం వల్ల ప్రయో జనం లేదు. ఆయన అభ్యంతరంలో అర్థం లేకపోలేదని జస్టిస్ లోధా కూడా అన్నారు. న్యాయవ్యవస్థ పరువుప్రతిష్ఠలు పునరుద్ధరించాలంటే సంస్కరణలు అనివార్యం. రాష్ట్రపతి మరో సారి సుప్రీంకోర్టు సలహా కోరవలసిన సందర్భం ఆసన్నమైంది.

ఇది వరకటి తొమ్మిది మంది న్యాయమూర్తుల పీఠం కంటే విస్తారమైన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసి దీన్ని సాకల్యంగా పరిశీలిం చాలి. ప్రభుత్వ పెత్తనం లేకుండా, న్యాయమూర్తుల చేతుల్లోనే సర్వాధికారాలు పెట్టుకోకుండా చూడాలి. పారదర్శకతను పాటించాలి. ప్రతిభావంతులనే న్యాయమూర్తులుగా నియమించేందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించుకోవాలి.

ఒక వ్యవస్థ బలహీనమైనప్పుడు మరో వ్యవస్థది పైచేయి కావడం మంచిది కాదు. అన్ని వ్యవస్థలూ బలంగా ఉన్నప్పుడే ప్రజా స్వామ్యానికి చేవ. జస్టిస్ చలమేశ్వర్ లేవనెత్తిన ప్రధానమైన అంశాలపైన సర్వత్రా చర్చ జరగాలి. సముచితమైన సంస్కరణలు అమలు కావాలి. సమర్థులైన న్యాయమూర్తులు హైకోర్టులలో, సుప్రీంకోర్టులో నియుక్తులు కావాలి.  అప్పుడే చట్టపాలన, ప్రజాస్వామ్యం సార్థకం అవుతాయి.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement