చిన్న వయసు–పెద్ద మనసు | opinion on Samajwadi Party Conflicts by K RamaChandra Murthy | Sakshi
Sakshi News home page

చిన్న వయసు–పెద్ద మనసు

Published Sun, Jan 1 2017 1:12 AM | Last Updated on Tue, Sep 5 2017 12:03 AM

చిన్న వయసు–పెద్ద మనసు

చిన్న వయసు–పెద్ద మనసు

త్రికాలమ్‌
ఆగ్రా, లక్నో–రెండూ ఉత్తరప్రదేశ్‌లోని చారిత్రక నగరాలే. రెండిటికీ మధ్య 334 కిలోమీటర్ల దూరం. లక్నోలో ఆగ్రా జరుగుతుందని భయపడినవారికి సాంత్వన చేకూర్చే పరిణామాలు చోటు చేసుకున్నాయి. తండ్రీకొడుకుల మధ్య రాజీ కుది రింది. సమాజ్‌వాదీ పార్టీ చీలిక తప్పించుకొని సమైక్యంగా నిలిచింది. మొగల్‌ సామ్రాజ్యాన్ని ఏలిన ఆరవ చక్రవర్తి ఔరంగజేబు తండ్రి షాజహాన్‌ను గద్దెదించి అధికార దండం చేతపట్టాడు. తండ్రిని తాజమహల్‌ సమీపంలోనే జైలులో నిర్బంధించాడు. కానీ హింసించలేదు. చెల్లెలు జహనారా బేగం తండ్రిని సేవిం చుకుంటానని అభ్యర్థిస్తే మన్నించాడు. పదవీచ్యుతుడిని చేసిన రోజు నుంచి 1666 జనవరి 31న షాజహాన్‌ మరణించేవరకూ తండ్రిని ఔరంగజేబు కలుసు కోలేదు. రాజ్యాధికారంకోసం సోదరులను చంపి, తండ్రిని నిర్బంధించిన ఔరం గజేబు రాజధాని ఆగ్రా. తండ్రిని ధిక్కరించి పార్టీని కైవసం చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ మధ్యవర్తుల మాట మన్నించి తండ్రి దగ్గరికి వెళ్ళి రాజీపడిన అఖిలేశ్‌ యాదవ్‌ రాజధాని లక్నో. ఔరంగజేబుకీ, అఖిలేశ్‌కీ హస్తిమశకాంతరం ఉంది. మొగల్‌ సమ్రాట్టుతో పోల్చితే అఖిలేశ్‌ మానవీయ విలువలకు పట్టం కట్టిన వ్యక్తిగా కనిపిస్తాడు.

ములాయంకు కనువిప్పు
ఉత్తరప్రదేశ్‌లో అయిదారు మాసాలుగా రగులుతున్న సంక్షోభం పతాక సన్నివేశంలో కుటుంబ పెద్ద ములాయంసింగ్‌ పట్టువిడుపులు ప్రదర్శించారు. యువ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ సంయమనం పాటించారు. పార్టీ పైనా, ప్రభుత్వంపైనా తన పట్టు నిరూపిస్తూనే ముఖియా మాట గౌరవించి రాజీకి అంగీకరించాడు. అఖిలేశ్‌నూ, రాంగోపాల్‌ యాదవ్‌ను ఆరేళ్ళపాటు పార్టీలోనుంచి బహిష్కరించినట్టు శుక్రవారం ప్రకటించిన తర్వాత యువ ముఖ్యమంత్రి విశ్వరూపం ప్రదర్శించాడు. బహిష్కరణ వేటు పడిన క్షణం నుంచీ అభిమానుల ప్రదర్శనలూ, నినాదాలూ సాగుతూనే ఉన్నాయి. శనివా రంనాడు అఖిలేశ్, ములాయం ఇద్దరూ తమ మద్దతుదారులను  కలుసు కున్నారు. అంతకు ముందు ములాయం రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ గుర్తుపైన పోటీ చేసేందుకు 325 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. దానికి పోటీగా అఖిలేశ్‌ 236 పేర్లు ప్రకటించాడు.

రెండు జాబితా లలోనూ 175 మంది ఎంఎల్‌ఏల పేర్లు ఉన్నాయి. శనివారం ఉదయం అఖిలేశ్‌ నివాసానికి దాదాపు 190 మంది శాసనసభ్యులు వెళ్ళి మద్దతు ప్రకటించగా, ములాయంసింగ్‌ దగ్గరకు వెళ్ళిన శాసనసభ్యుల సంఖ్య పాతిక దాటలేదు. ఎన్ని కల వ్యూహరచనలో సిద్ధహస్తుడైన ములాయంసింగ్‌ క్షేత్ర వాస్తవికతను గ్రహిం చారు. పెద్దరికాన్ని గౌరవిస్తూనే తన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించే కుమారుడి మనస్తత్వాన్ని తెలుసుకున్నారు. సీనియర్‌ మంత్రి ఆజంఖాన్‌ దౌత్యానికి అంగీ కరించారు. ఘర్షణకు తెరదించారు. నూతన సంవత్సరం ఆరంభంలో కుటుంబ కలహాలకు స్వస్తి చెప్పి శుభం కార్డు వేశారు.

చరిత్రలో సారూప్యాలు
ఇటీవలి చరిత్రలో లక్నో పరిణామాలను పోలిన సందర్భాలు రెండు కనిపిస్తాయి. ఒకటి–1969లో కాంగ్రెస్‌ పార్టీ చీలిక. రెండు–1995లో ఎన్‌టి రామారావు పదవీచ్యుతి. అఖిలేశ్‌ను ములాయంసింగ్‌ పార్టీ నుంచి బహిష్కరించినట్టే నిజ లింగప్ప నాయకత్వంలోని కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నాటి ప్రధాని ఇందిరా గాంధీని పార్టీ నుంచి బహిష్కరించింది. ఎన్‌టి రామారావు తన చిన్నల్లుడు, ఆర్థిక, రెవెన్యూ శాఖల మంత్రి నారా చంద్రబాబునాయుడిని, మరి నలుగురు మంత్రులతో కలిపి పార్టీ నుంచి బహిష్కరించారు. అమర్‌సింగ్‌ని పార్టీ నుంచి తొలగించాలన్నది అఖిలేశ్‌ పట్టు. లక్ష్మీపార్వతిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని చంద్రబాబునాయుడి నాయకత్వంలోని వర్గం డిమాండ్‌. మొరార్జీ దేశాయ్‌ని ఉపప్రధానిగా పెట్టుకోవాలని కామరాజ్‌ ప్రభృతులు ఇందిర   పైన ఒత్తిడి తెచ్చి ఒప్పించారు. ఇంకా సామ్యాలు చాలా ఉన్నాయి.

‘పార్టీ స్థాపించింది నేను. నాలుగు సార్లు ఎన్నికలలో గెలిచాను. అఖిలేశ్‌ని ముఖ్యమంత్రి చేసింది ఎవరు? నేను కాదా? చరిత్రలో ఏ తండ్రి అయినా కొడుక్కి ఇటువంటి బహుమతి ఇచ్చాడా? అటువంటి నన్నే ధిక్కరిస్తాడా? నన్ను సంప్రదించకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటాడా? నా తమ్ముడు పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తుంటే వాడిని పక్కన పెట్టేస్తాడా? మిత్రుడు అమర్‌సింగ్‌ను తిరిగి పార్టీలో చేర్చుకుంటే అఖిలేశ్‌కు ఎందుకు అభ్యంతరం? ఇది నా పార్టీ, నేనే అధినాయకుడిని. నా ఇష్టప్రకారమే అన్నీ జరగాలి’ అన్నది ములాయం పంతం. ఎన్‌టి రామారావు మనస్తత్వం డిటో. ‘నేనే పార్టీ. నాతో పాటే పార్టీ అంతర్థానం అవుతుంది.  నన్ను చూసి ప్రజలు తెలుగుదేశం  పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేశారు. పూచికపుల్లను నిలబెట్టి గెలిపించాను. నన్ను ధిక్కరిస్తారా? లక్ష్మీపార్వతి విద్యావంతురాలు. వివేకవంతురాలు. నా సేవకురాలు. ఆమెను గౌరవించడం నా సంస్కారం. అందుకు అభ్యంతరం చెప్పడానికి వారెవరు?’అనే ధోరణిలో ఆయన ఆలోచించేవారు, మాట్లాడేవారు.

సత్తా చాటిన ‘మూగబొమ్మ’
‘ఇందిరాగాంధీ గూంగీగుడియా (మూగబొమ్మ). మెత్తగా ఉంటుందనుకుంటే మొత్తుతానంటోంది. సొంత నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్రపతి పదవికి పోటీలో కాంగ్రెస్‌ అధికార అభ్యర్థిగా నీలం సంజీవరెడ్డి పేరు ప్రతిపాదించి అనంతరం స్వతంత్ర అభ్యర్థిగా వరాహగిరి వెంకటగిరిని నిలబెట్టి ఆత్మప్రబోధం ప్రకారం ఓట్లు వేయమంటూ కాంగ్రెస్‌వారికి చెప్పింది. గిరిని గెలిపించింది. పార్టీ అభ్యర్థిని ఓడించింది. ఇది పార్టీకి ద్రోహం చేయడం కాకపోతే ఏమిటి? పార్టీ చెప్పినట్టు ప్రధాని వినాలి’ అన్నది సిండికేట్‌ నాయకులైన నిజలింగప్ప, మొరార్జీ దేశాయ్, కామరాజ్‌ నాడార్, సంజీవరెడ్డి, అతుల్యఘోష్, ఎస్‌కె పాటిల్‌ వాదన. చివరికి మూగబొమ్మ తూర్పుపాకిస్తాన్‌ విమోచనకు కారకురాలై దుర్గామాతగా అటల్‌ బిహారీ వాజపేయి వంటి వరిష్ఠ నేతల ప్రశంసలందుకున్నారు. ఆత్యయిక పరిస్థితి తర్వాత ఎన్నికలలో ఘోరపరాజయం తర్వాత రెండేళ్ళు పదవికి దూరంగా ఉన్నప్పటికీ తర్వాత అధికారంలోకి వచ్చి మరణించేవరకూ ప్రధానిగా కొనసాగారు. చంద్రబాబునాయుడు 1995లో రామారావును తప్పించి తొమ్మి దేళ్ళు ముఖ్యమంత్రిగా అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలించారు.

అఖిలేశ్‌ కూడా పార్టీని చీల్చి, కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్‌దళ్‌ (ఆర్‌ఎల్‌డి)తో పొత్తు పెట్టుకుంటే ఎన్నికలలో గెలిచే అవకాశాలు లేకపోలేదు. ఈ ఎన్నికలలో ఓడిపోయినా పార్టీ యావత్తూ తన అధీనంలో ఉండేది. బాబాయి శివపాల్‌నీ, అతనితో ఉండే నేర చరితులనూ వదిలించుకోవడానికి ఇది మంచి అదను. కానీ అతనికి అధికారం కంటే తండ్రి ప్రధానం. శనివారం ఉదయం ఎంఎల్‌ఏలతో మాట్లాడుతున్న ప్పుడు కూడా అఖిలేశ్‌ కంట తడి పెట్టుకున్నాడు. ఎన్నికలలో విజయం సాధించి నేత (ములాయం) చేతిలో పెట్టాలంటూ ఆవేశంగా చెప్పాడు. అందుకే అమర్‌ సింగ్‌ను పార్టీ నుంచి బర్తరఫ్‌ చేయాలన్న తన డిమాండ్‌ వెంటనే అమలు జరగకపోయినప్పటికీ దానిపైన పట్టుపట్టలేదు. ములాయం నాయకత్వంలో, శివపాల్‌ యాదవ్‌ సాహచర్యంతో ఎన్నికల ప్రచారం చేయడానికి అంగీ కరించాడు.
రెండు ‘సైకిళ్ల’ మధ్య ఎంత తేడా!

మూడు ఘటనలలో పాత తరం నాయకులకూ, కొత్త తరం నాయకులకూ మధ్య స్పర్థ. కాంగ్రెస్‌ పార్టీ చీలికలో బంధుత్వాలు లేవు. రక్తసంబంధాలు లేవు. సిద్ధాంత వైరుధ్యాలు కూడా అంతగా లేవు. సిద్ధాంతం రంగు ఉన్నది కానీ సారంలో లేదు. ఎవరిది ఆధిపత్యం అన్నదే ప్రశ్న. రాజకీయ బలాబలాల పరీక్ష. జనాకర్షణశక్తి ఇందిరకు ఉన్నది కనుక ఆమె గెలుపొందారు.  సమాజ్‌వాదీ పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండిటి ఎన్నికల చిహ్నం సైకిలే. హైదరాబాద్‌లో, లక్నోలో జరిగినవి రెండూ కుటుంబ కలహాలే. కుటుంబ పెద్దతో యువతరానికి చెందిన వారి ఘర్షణ.  అఖిలేశ్‌లో ములాయం రక్తం ఉంది. అంతకంటే ముఖ్యంగా మాన వీయమైన విలువలు ఉన్నాయి. రాజకీయంగా తన తడాఖా చూపిస్తూనే పెద్దల పట్ల వినయం ప్రదర్శించాడు. సందు దొరికింది కదా అని తండ్రి చేతిలోనుంచి పార్టీని గుంజుకోలేదు. తండ్రిని శక్తిహీనుడిని చేయలేదు. గుండె చెదరడానికి కారకుడు కాలేదు. ఇప్పుడు అఖిలేశ్‌కి 44 సంవత్సరాలు ఉంటే అప్పుడు (1995లో) చంద్రబాబునాయుడికి 45 ఏళ్ళు. పెద్ద వయస్సు కాదు. ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా ఉండేవారు. ఆయన లక్ష్మీపార్వతికి వివరంగా చెప్పారు. గొడవంతా ఆమె పేరుమీదనే జరుగుతోందనీ, తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని హామీ ఇస్తే గొడవ సమసిపోయే అవకాశం ఉందనీ చెప్పారు. ఆమె కంటనీరు పెట్టుకొని విలేఖరుల గోష్ఠిలో ప్రకటన విడుదల చేశారు.

తనకు స్వామి పాదాల చెంత చోటు చాలుననీ, ఆయనను సేవించుకునే అవకాశం చాలుననీ, తనకు ఎటు వంటి అధికారం అక్కర లేదనీ, అప్పటి వరకూ ఏదైనా పొరబాటు జరిగితే తన అమాయకత్వం వల్లనే జరిగింది కానీ రాజకీయాలలో ఏదో చేయాలనీ, చెందాలనే తాపత్రయంతో చేసింది కాదనీ, ఎవరైనా అపార్థం చేసుకుంటే తనను క్షమించాలని వేడుకుంటూ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన తర్వాత పోరాటం విరమిస్తే చంద్రబాబునాయుడికి చెడ్డపేరు వచ్చేది కాదు. కానీ చంద్రబాబునాయుడూ, అశోకగజపతిరాజూ, మాధవరెడ్డి, రామకృష్ణుడూ అంగీ      కరించలేదు. అధికారం హస్తగతం చేసుకోవడానికి ఇదే అదను అని భావించారు. పార్టీ వ్యవస్థాపకుడు ఏమైనా పర్వాలేదనుకున్నారు. చంద్రబాబునాయుడు ఒక్కరికే ఎన్‌టి రామారావుతో బంధుత్వం ఉంది. తక్కినవారికి ఆయన రాజ కీయ భిక్ష పెట్టారు. రామారావుతో రక్తసంబంధం ఉన్నవారు చంద్రబాబు నాయుడు ఇవ్వజూపిన పదవులకోసం ఆశపడ్డారు. హరికృష్ణ పార్టీ అధ్యక్షుడనీ, పెద్దల్లుడు డాక్టర్‌ వెంకటేశ్వరరావు ఉపముఖ్యమంత్రి అనీ ఆశచూపించారు. చంద్రబాబుకు ఎన్‌టి రామారావు అంటే భయం ఉండేది కానీ భక్తి లేదు. అఖిలేశ్‌కి ములాయం సింగ్‌ అంటే భయం, భక్తీ రెండూ ఉన్నాయి. దేశ రాజకీయ చరిత్రలో ముఖ్యమైన  మూడు నాటకీయ ఘట్టాలలోని పోలికలను ఎత్తిచూపడా నికే ఈ  ప్రస్తావన.

ఆ రెండు పార్టీలకూ ఆశాభంగం
చరిత్ర పునరావృతం అవుతుందని ఆశించిన బీజేపీకీ, బీఎస్‌పీకీ ఆశాభంగం కలిగింది. అఖిలేశ్‌ ధిక్కారం కొనసాగించి పార్టీని చీల్చి, కొత్త కుంపటి ప్రారం భించి, కాంగ్రెస్, ఆర్‌ఎల్‌డీలతో పొత్తు పెట్టుకుంటే పాతతరం యాదవులకూ, కొత్తతరం యాదవులకూ మధ్య జరిగే పోరుతో విసిగిపోయి ప్రజలు బీజేపీవైపు చూస్తారని  భావించారు. 2014లో యూపీలోని మొత్తం 80 లోక్‌సభ స్థానాలలో 73 స్థానాలను గెలుచుకున్న బీజేపీ విజయం తథ్యమని ఆ పార్టీ నేతలూ, ప్రవక్తలూ బల్లగుద్ది చెబుతున్నారు. సమాజ్‌వాదీ చీలికతో ఆ పార్టీ నేతలపైన విశ్వాసం కోల్పోయిన ముస్లింలు బీఎస్‌పీకి వెన్నుదన్నుగా నిలుస్తారని మాయా వతి ఆశ. చీలికను నివారించగలిగారు కనుక బీజేపీ, బీఎస్‌పీల కొత్త ఆశలపైన నీళ్ళు చల్లినట్టు అయింది. సమాజ్‌వాదీ పార్టీలో ముసలం పుట్టక ముందు బీఎస్‌ పీకి విజయావకాశాలు ఉన్నాయని అంతా అనుకున్నారు. బీజేపీ నాయకులు కూడా పోటీ ప్రధానంగా తమకూ, బీఎస్‌పీకి మధ్య మాత్రమేనని అన్నారు.

నూటికి పైగా టిక్కెట్లు ముస్లిం అభ్యర్థులకు మాయావతి కేటాయించారు. కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకోవాలన్న ప్రతిపాదనను తిరస్కరించడానికి పెరిగిన ఆత్మవిశ్వాసం ఒక కారణం. సీబీఐ దర్యాప్తు భయం మరో కారణం. పెద్దనోట్ల రద్దు తర్వాత బీఎస్‌పీ ఖాతాలో రూ 104 కోట్లు జమచేసినట్టు ఆదాయంపన్ను శాఖ వెల్లడించినప్పటికీ దాని వల్ల ఆ పార్టీ పట్ల ప్రజలలో సాను భూతి పెరుగుతుంది కానీ వ్యతిరేకత ప్రబలదని పరిశీలకులు భావిస్తున్నారు. ఎస్‌పీ పరిణామాల వల్ల బీజేపీకి ప్రయోజనం ఏమీ లేదని గ్రహించిన ప్రధాని మోదీ శనివారంనాడు జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కొత్త వరాలు ప్రసాదించారు. ఎన్నికల కమిషన్‌ ఎన్నికల కార్యక్రమాన్ని ప్రకటించే లోపు వాగ్దా నాలు చేయాలని ప్రయత్నం. యూపీ ఎన్నికలలో విజయం మోదీ రాజకీయ భవిష్యత్తుకు అత్యంత ప్రధానం కనుక ఆయన ఎంత దూరం వెళ్ళడానికైనా సిద్ధం. యూపీ ఎన్నికలు 2019 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్‌ అంటున్నది అందుకే.

(వ్యాసకర్త : కె. రామచంద్రమూర్తి, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement