జీవితం నిరంతరం సాగే ప్రయాణం లాంటిది. మార్గంలో దారితప్పితే అలజడి రేగకతప్పదు. కొంతమంది యువత తమ పయనంలో పట్టుతప్పుతుండటం నేడు ఆందోళన కలిగించే అంశం. స్ఫూర్తివంతమైన సమాజానికి ఇది విఘాతం కలిగించే పరిస్థితి. సౌభాగ్యవంతమైన సమాజ నిర్మాణంలో యువత బలమైన శక్తులుగా నిలవాలని స్వామి వివేకానంద బోధించారు. సంఘంలో యువత సక్రమ మార్గంలో సాగితే భవిత బంగారుమయం కావడం ఖాయం. యువతకు మంచి మార్గాన్ని చూపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందని భావించి సాగితే అంతా మంచే జరుగుతుంది.
అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడ సెంట్రల్) : ప్రేమ విఫలమై పాయకాపురానికి చెందిన డిగ్రీ విద్యార్థి బి.మురళీకృష్ణ నవంబర్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తనపైనే ఆధారపడి బతుకుతున్న ఓ తల్లి అనాథగా మారి విలవిల్లాడుతోంది.
♦ సత్యనారాయణపురం శ్రీనగర్ కాలనీకి చెందిన బీటెక్ విద్యార్థి వంశీతేజ క్రికెట్ బెట్టింగ్‌లకు అలవాటుపడి అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. అప్పుల వారి ఒత్తిడిని తట్టుకోలేక వేరే ప్రాంతానికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు.
♦ మధురానగర్ ప్రాంతానికి చెందిన కొంతమంది విద్యార్థులు గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలై అక్కడి బ్లేడ్ బ్యాచ్ సభ్యులతో జత కలిశారు. వారు ఆ మత్తులో.. డబ్బుల వేటలో ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటన గత నెలలో చోటుచేసుకుంది.
♦ ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న వాంబేకాలనీకి చెందిన ఓ యువకుడు ఆమె కోసం.. తమ విలాసాల కోసం ఆ మహిళ మామను గత నెలలో హతమార్చాడు.
♦ సుబ్బరాజునగర్‌లో క్రికెట్ బెట్టింగ్ జరుగుతుందని సమాచారం రావడంతో పోలీసులు నిఘాపెట్టి దాడులు చేయగా వారిలో కొంతమంది విద్యార్థులు పట్టుబట్టారు. వారి వద్ద గంజాయి కూడా లభించడం గమనార్హం.
♦ ఇలా చెప్పుకుంటూ పోతే దేశానికి వెన్నెముకగా నిలవాల్సిన యువత ఇలా ఆత్మహత్యలు, హత్యలు చేస్తూ వారి జీవితాలను బుగ్గిపాలు చేసుకోవడంతో పాటు వారి తల్లిదండ్రులకు తీరని శోకాన్ని, నిందలు, అవమానాలను తెచ్చిపెడుతున్నారు.
ప్రేమ.., మార్కులే జీవితం కాదు
ఇటీవల కాలంలో ఎక్కువ మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటానికి ప్రధాన కారణం మార్కులు, రెండోది ప్రేమ అని పలు సర్వేలు చెబుతున్నాయి. మార్కులు తెచ్చుకోవాలని కొన్ని ఘటనల్లో తల్లిదండ్రులు, మరికొన్ని ఘటనల్లో విద్యాసంస్థలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయి. అలాగే ప్రేమించిన అమ్మాయి, అబ్బాయి దూరమవుతున్నారనే కారణాలతో కూడా యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ ఒత్తిడి నుంచి దూరం చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. విద్యాసంస్థలు మార్కుల ఒత్తిడి తెచ్చినప్పటికీ తల్లిదండ్రులు వారికి భరోసాగా నిలబడి ధైర్యాన్ని చెప్పడం, తమ పిల్లలపై మితిమీరిన భారాన్ని తొలగించడం చేయాలని వారు సూచిస్తున్నారు.
స్వామి వివేకానంద చెప్పిన సూక్తులు
♦ ‘కోపం తెచ్చుకునే హక్కు ఎవరికైనా ఉండవచ్చు.. కానీ ఆ కోపంతో క్రూరంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవరికి లేదు’.
♦ ‘ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే.. ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్నే నాశనం చేస్తుంది’.
♦ ‘బలమే జీవనం.. బలహీనతే మరణం’.
♦ ‘సహనం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది.. కానీ దాని ఫలితమెప్పుడూ తియ్యగానే ఉంటుంది’.
♦ వీరులు అపజయం చూసి కుంగిపోరు విజయం సాధించే వరకూ పోరాడుతారు.’
మార్పులు గమనించాలి..మార్పు తీసుకురావాలి..
యుక్త వయస్సుకు చేరుకుంటున్న తమ పిల్లల్లో వస్తున్న మార్పులను గురించి ప్రధానంగా వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు గమనించాలి. యువత పెడదోవ పట్టడానికి సమాజంలోని ఏదో ఒక వ్యక్తి గానీ, ఏదో ఒక సంఘటన గానీ కారణమవుతుందని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. జీవితం గురించి పూర్తి అవగాహన కల్పించడం వంటివి చేయడం వల్ల చీకటి కోణం నుంచి బయటపడే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment