యువత చేతిలోనే దేశభవిత దాగి ఉందని కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ అన్నారు. యువత మేల్కొని వెనకబడిన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
నెల్లూరు (వేదాయపాళెం), న్యూస్‌లైన్ : యువత చేతిలోనే దేశభవిత దాగి ఉందని కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ అన్నారు. యువత మేల్కొని వెనకబడిన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద 150వ జయంతోత్సవాలను పురస్కరించుకుని ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో ‘దేశభవితకు యువత పరుగు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత పురమందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ దేశ సమస్యలపై గళమెత్తిన మొదటి వ్యక్తి స్వామి వివేకానందే అని అన్నారు. భారత జాతికి ఆయన చేసిన సేవలు విశిష్టమైనవన్నారు. వివేకానందున్ని స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు సాగాల్సిన అవసరం ఉందని చెప్పారు. అయితే నేటి యువతరం మానసిక ఒత్తిళ్లకు తలొగ్గుతోందని వాపోయారు. జీవితంలో ప్రేమ, పెళ్లి సాధారణ విషయాలని, నలుగురికీ ఉపయోగపడేలా యువత ఉండాలని సూచిం చారు. తల్లిదండ్రులు సైతం పిల్లలకు చిన్నతనం నుంచే దేశభక్తిని నూరిపోయాలన్నారు.
ఎస్పీ పీవీఎస్ రామకృష్ణ మాట్లాడుతూ మహనీయులను స్మరిస్తూ వారి ఆశయాల సాధనకు పాటుపడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదీ అన్నారు. ఆదర్శప్రాయులు ఎక్కడో ఉండరని, ఎవరైతే మంచిమార్గాన నడుస్తారో వారే ఆదర్శప్రాయులన్నారు.మన మధ్యే అలాంటి వారు ఎందరో ఉన్నారన్నారు. వివేకానంద ఉత్సవ సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సుందరరామం మాట్లాడుతూ వివేకానందుడు ఎప్పుడూ దేశం ఇలా తయారవుతుందని ఊహించలేదన్నారు. ప్రస్తుతం దేశాన్ని ఉద్దరించాలంటే వీధికి ఒక నరేంద్రుడు కావాలన్నారు. చిన్నారులు ప్రదర్శించిన యోగా విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
వందేమాతరం
దేశభవిత కోసం యువత పరుగులో గళమెత్తింది. పురమందిరంలో కలెక్టర్ శ్రీకాంత్, ఎస్పీ రామకృష్ణ తదితరులు జ్యోతి వెలిగించి, జెండా ఊపి పరుగును ప్రారంభించారు. అనంతరం అధిక సంఖ్యలో యువతీ, యువకులు భారత్‌మాతాకీ జై, మాతరం...మాతరం...వందే మాతరం, నందా...నందా...వివేకానందా అంటూ నినాదాలు చేస్తూ పురవీధుల్లో పరుగుపెట్టారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడు, అర్జునుడు, వివేకానందుడు, రామకృష్ణపరమహంస, చత్రపతి శివాజీ, రాణాప్రతాపుడు, శ్రీకృష్ణదేవరాయుల వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ కుడుముల అశోక్‌రావు, ఉపాధ్యక్షులు యండ్లవల్లి అమృతవల్లి, దుగ్గిశెట్టి జ్యోతి, తురకవి శ్రీహరి, ఆనందరావు, సభ్యులు అచ్చుత సుబ్రహ్మణ్యం, డాక్టర్ రవిశంకర్, సురేష్‌కుమార్, ప్రవీణ్‌కుమార్, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.