స్ఫూర్తిదాయకంగా పనిచేయండి
-కలెక్టర్ శ్రీకాంత్
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) : ఉపాధ్యాయులు స్ఫూర్తిదాయకంగా పనిచేయాలని కలెక్టర్ శ్రీకాంత్ పిలుపు నిచ్చారు. స్థానిక పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో శుక్రవారం ‘బడి పిలుస్తోంది’ విద్యా వారోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే అర్హులైన ఉపాధ్యాయులు ఉన్నారన్నారు. నాణ్యమైన విద్యను అందించేందుకు అనుభవాన్ని రంగరించి విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. సంగం మండలం తరుణవాయి లో పనిచేస్తున్న సైన్స్ ఉపాధ్యాయుడు సుబ్రహ్మణ్యాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. పరిశోధనాత్మక విద్యనందించడంలో సుబ్రహ్మణ్యం శైలిని కలెక్టర్ ప్రశంసించారు. ఆయన దగ్గర విద్యనభ్యసించిన విద్యార్థులు నోబుల్ బహుమతిని అందుకున్నా ఆశ్చర్యపడాల్సి అవసరం లేదన్నారు. జిల్లాలో 2007లో ఒకటో తరగతిలో చేరిన విద్యార్థుల్లో ఇప్పటి వరకు ఎనిమిది వేల మంది బడిబయట ఉన్నట్లుగా అధికారులు గుర్తించారని తెలిపారు. వారిలో 2,800 మందిని తిరిగి పాఠశాలకు పంపేందు కు చర్యలు చేపట్టామన్నారు. మిగిలిన వారిని కూడా గుర్తించి మళ్లీ వారిని బడికి పంపేలా చూడాలని సూచించారు. మేయర్ అబ్దుల్‌అజీజ్ మాట్లాడుతూ నగరపాలక పాఠశాలల ను బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. నగరపాలక సంస్థ నిధులతో పాటు ప్రభుత్వ నిధులతో విద్యకు పెద్దపీట వేస్తామన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు సహాయ సహకారాలు అందించేందుకు పూర్తిస్థాయిలో కృషిచేస్తామన్నారు.
పదో తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామన్నారు. తన జీతంలో నెలకు రూ.10 వేలు విద్యార్థుల కోసం వెచ్చిస్తానన్నారు. ఇప్పటికి రెండు నెలల్లో పది మందికి రూ.లక్ష ఆర్థిక ప్రోత్సాహకం అందజేశానన్నా రు. చదువులో రాణించే ఏ పాఠశాల విద్యార్థులకైనా ఆర్థిక సహాయాన్ని అందిస్తామన్నారు. నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ జీతం తీసుకుంటున్న వారి పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివేలా జీఓ తేవాలన్నారు. నగరపాలకసంస్థ పాఠశాలల్లో 95 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హులైన వారిని ప్రత్యేక నియామకాలు చేపట్టాలని కలెక్టర్‌ను కోరారు. రాజకీయ నాయకులు, అధికారుల ఇళ్లలో పనిచేస్తున్న బాలకార్మికులను బడికి పంపేలా చూడాలన్నారు.
బాలలతో పనులు చేయించుకునే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. సుందరయ్య కాలనీలో నివసిస్తున్న సర్కస్ కుటుంబాలకు చెందిన ఆరుగురు పిల్లలకు అడ్మిషన్ పత్రాలను అతిథులు అందజేశారు. తొలుత బడి పిలుస్తోంది కార్యక్రమాల్లో తొలిరోజు ర్యాలీని కలెక్టర్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ వీఆర్ కళాశాల వరకు నిర్వహించాల్సి ఉంది. ఎండతీవ్రత కారణంగా కలెక్టర్ ఆదేశాల మేరకు కస్తూరిదేవి విద్యాలయం వరకు నిర్వహించారు. ఇన్‌చార్జి డీఈఓ ఉష, ఎస్‌ఎస్‌ఏ పీఓ కోదండరామిరెడ్డి, డిప్యూటీ డీఈఓ మేరిచంద్రిక , ఎంఈఓ రమేష్‌బాబు పాల్గొన్నారు.