ధర్మమే గెలిచింది | Temptations of the ruling party | Sakshi
Sakshi News home page

ధర్మమే గెలిచింది

Published Mon, Jul 21 2014 2:41 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

ధర్మమే గెలిచింది - Sakshi

ధర్మమే గెలిచింది

సాక్షి, నెల్లూరు : అధికార పార్టీ ప్రలోభాలు, కుట్రలు, కుతంత్రాలు పటాపంచలయ్యాయి. అధికార జులుం మట్టికరిచింది. లాటరీ ధర్మాన్ని పలికింది. జిల్లా పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి భగవంతుడు తానున్నానని నిరూపించాడు. న్యాయాన్ని గెలిపించి, ధర్మాన్ని కాపాడాడు.. ప్రజాస్వామ్యాన్ని బతికించాడు. రెండుమార్లు వాయిదా పడిన తర్వాత ముచ్చటగా మూడోసారి ఆదివారం జరిగిన జెడ్పీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ఉత్కంఠభరితంగా సాగింది. ఇరుపక్షాలకు 23 మంది సభ్యుల చొప్పున సమాన బలం ఉండడంతో లాటరీ తీయాలని కలెక్టర్ శ్రీకాంత్, పరిశీలకుడు రామాంజనేయులు నిర్ణయించారు. లాటరీలో అదృష్టం ఎవరిని వరిస్తుందనే విషయమై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. మొదట కోఆప్షన్ పదవులకు లాటరీ నిర్వహించగా రెండు పార్టీలు చెరొకటి దక్కించుకున్నాయి. భోజన విరామం తర్వాత నిర్వహించిన లాటరీ ప్రక్రియలో చైర్మన్‌గా బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, వైస్ చైర్‌పర్సన్‌గా పొట్టేళ్ల శిరీష ఎన్నికకావడంతో ఒక్కసారిగా ఆనందం మిన్నంటింది. వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు కేరింతలు కొట్టారు. జైజగన్ నినాదాలతో హోరెత్తించారు. జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకోవడంతో బాణసంచా మోతలు మార్మోగాయి.
 
 భారీ భద్రత నడుమ
 గతంలో రెండుమార్లు చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో జెడ్పీ కార్యాలయం ఆవరణలో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. ఉదయం 10 గంటలకే వైఎస్సార్‌సీపీకి చెందిన 23 మంది జెడ్పీ సభ్యులు జెడ్పీ సమావేశ మందిరానికి చేరుకున్నారు. అనంతరం 12 గంటలకు టీడీపీ సభ్యులు 15 మందితో పాటు , ఆ పార్టీకి మద్దతు పలికిన 8 మంది వైఎస్సార్‌సీపీ సభ్యులు కూడా వచ్చారు.
 
 మధ్యాహ్నం ఒంటి గంటకు సమావేశ మందిరానికి వచ్చిన కలెక్టర్ శ్రీకాంత్, పరిశీలకుడు రామాంజనేయులు 1.15 గంటలకు కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియను ప్రారంభించారు. ఇరుపక్షాల సభ్యుల బలం సమానంగా ఉండడంతో లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు. రెండు పార్టీలకు చెరొక కోఆప్షన్ సభ్యత్వం లభించింది. అనంతరం సభను కలెక్టర్ 3 గంటలకు వాయిదా వేశారు.
 
 ఉత్కంఠత మధ్య విజయం
 భోజన విరామం తర్వాత 3 గంటలకు సభ ప్రారంభమైంది. వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థిగా బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిని వెంకటాచలం జెడ్పీటీసీ సభ్యుడు శేషయ్య ప్రతిపాదించగా కలువాయి సభ్యుడు అనిల్‌కుమార్‌రెడ్డి బలపరిచారు. ఇక టీడీపీ ఛైర్మన్ అభ్యర్థిగా వేనాటి రామచంద్రారెడ్డిని నాయుడుపేట జెడ్పీటీసీ సభ్యుడు శ్రీరామప్రసాద్‌రెడ్డి ప్రతిపాదించగా కొండాపురం సభ్యుడు ఉమామహేశ్వరరావు బలపరిచారు.
 
 అనంతరం బలాబలాలు గుర్తించేందుకు 3.05గంటలకు కలెక్టర్ మరోమారు ఇరు పార్టీల సభ్యులను  చేతులెత్తించారు. రెండు పార్టీలకు 23 చొప్పున సమాన బలం ఉండడంతో లాటరీ అనివార్యమైంది. 3.10 గంటలకు లాటరీ తీసిన కలెక్టర్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి విజయం సాధించినట్లు ప్రకటించారు. అనంతరం జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ పదవికి లాటరీ తీయగా సైదాపురం జెడ్పీటీసీ సభ్యురాలు పొట్టేళ్ల శిరీష ఎన్నికయ్యారు.
 
 ఉప్పొంగిన ఉత్సాహం
 జెడ్పీ చైర్మన్‌గా బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఎన్నికైనట్లు కలెక్టర్ ప్రకటించగానే వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉప్పొంగింది. సమావేశ మందిరంలోనే ఉన్న ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, పాశం సునీల్‌కుమార్, కిలివేటి సంజీవయ్య, నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్ తదితరులు ఆనంద పారవశ్యులయ్యారు. జైజగన్ అంటూ నినాదాలు చేశారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకొని ఆనందం పంచుకున్నారు. క్షణాల్లో ఈ వార్త జిల్లా అంతా తెలిసిపోవడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి.
 
 ఆటంకాల మధ్య
 జిల్లాలోని 46 జెడ్పీటీసీల్లో వైఎస్సార్‌సీపీ 31, టీడీపీ 15 స్థానాలను దక్కించుకున్నాయి. అయితే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు చేయని ప్రయత్నాలు లేవు. ప్రలోభాలు, బుజ్జగింపులు, బెదిరింపులు, అక్రమ కేసులతో చివరకు 8 మంది వైఎస్సార్‌సీపీ సభ్యులను తమ వైపు తిప్పుకుంది. పోలీసు అధికారులు సైతం అధికార పార్టీకి కొమ్ముకాశారు. మొదట ఈ నెల 5న జరగాల్సిన ఎన్నిక అధికార పార్టీ సభ్యుల దౌర్జన్యాలు, దాడులతో వాయిదా పడింది.
 
 అనంతరం ఎన్నికల కమిషన్‌తో పాటు హైకోర్టు జోక్యం చేసుకోవడంతో 13వ తేదీన సమావేశం జరిగినా, కోరం లేదనే సాకుతో మళ్లీ వాయిదా వేశారు. ఈ క్రమంలో ఆదివారం తప్పనిసరిగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయినా వాయిదా వేయించేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నించారు. తమ సభ్యులకు ఎన్నికకు సంబంధించిన సమాచారం సకాలంలో అందలేదని తిరిగి శనివారం కోర్టును ఆశ్రయించారు. కోర్టు అంగీకరించక పోవడంతో ఆదివారం ఎన్నిక అనివార్యమైంది. ఎట్టకేలకు కలెక్టర్ ఎన్నిక తంతును ముగించడంతో ఉత్కంఠకు తెరపడింది.
 
 టీడీపీకి తప్పని భంగపాటు
 జిల్లా పరిషత్‌ను దక్కించుకొనేందుకు టీడీపీ ఎన్ని అడ్డదారులు తొక్కినా చివరకు భంగపాటు తప్పలేదు. అధికారం తమదేనన్న  గర్వంతో ఉన్న ఆ పార్టీ నేతలు జెడ్పీ చైర్మన్ పదవి కోసం అనేక అడ్డదారులు తొక్కారు. కోట్ల రూపాయలు ఇస్తామంటూ సభ్యులను ప్రలోభపెట్టారు. పోలీసుల సాయంతో బెదిరించారు. తప్పుడు కేసులు పెట్టారు. రెండు మార్లు ఎన్నికను వాయిదా వేయించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. జిల్లా ప్రజల ఛీత్కారం ఎదుర్కొన్నారు. చివరకు వారికి భంగపాటే ఎదురైంది. ధర్మమే గెలవడంతో అధికార పార్టీ నేతలు తలలు దించుకుని వెళ్లకతప్పలేదు.
 
 ప్రజాస్వామ్యం నెగ్గింది:  
 ధర్మం గెలిచింది. అధికారపార్టీ ప్రలోభాలు, కుట్రలు, కుతంత్రాలకు పాల్పడి, బలం లేకపోయినా పలుమార్లు జెడ్పీ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయించింది. ఎట్టకేలకు ఆదివారం జరిగిన ఎన్నికలో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించడం సంతోషకరం. భగవంతుడెప్పుడూ న్యాయం వైపు.. ధర్మం వైపు నిలుస్తాడనడానికి ఈ ఎన్నిక ఓ నిదర్శనం. టీడీపీ కుట్రలు పటాపంచలయ్యాయి. ప్రజాస్వామ్యం నెగ్గింది. ప్రజల అభిప్రాయాన్ని భగవంతుడే నెరవేర్చాడు. బొమ్మిరెడ్డికి నా అభినందనలు. టీడీపీకి ఇప్పటికైనా దౌర్జన్యాలను మానుకుని ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలి.
 - మేకపాటి రాజమోహన్‌రెడ్డి, నెల్లూరు ఎంపీ,
 వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు
 
 అందరికీ వందనం:
 అధికారపార్టీ ప్రలోభాలు, కుట్రలు, కుతంత్రాలతో నానా రకాలుగా ఇబ్బందులు పెట్టినా ఎట్టకేలకు విజయం వరించడం సంతోషంగా ఉంది. 31 జెడ్పీటీసీలను వైఎస్సార్‌సీపీ గెలుచుకున్నా, కేవలం 15 స్థానాలకే పరిమితమైన టీడీపీ దిగజారుడు రాజకీయాలతోనే నా విజయం ఆలస్యమైంది. కొంత మంది ప్రలోభాలకు లొంగినా మిగిలినవారు వైఎస్సార్‌సీపీ మీద అభిమానంతో నా వెన్నంటే ఉన్నారు. ఎట్టకేలకు లాటరీ విజయంతో దేవుడున్నాడని నిరూపించాడు. న్యాయం గెలిచింది. నా విజయానికి సహకరించిన జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, జెడ్పీటీసీ సభ్యులందరికీ వందనాలు.
 - బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, జెడ్పీ చైర్మన్
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement