శాంతి ర్యాలీలో పాల్గొన్న గుంటూరు రేంజ్ ఐజీ సంజయ్, నెల్లూరు కలెక్టర్ జానకి, మేయర్ అజీజ్ తదితరులు
ఆందోళనకారులతో ఫలించిన అధికారుల చర్చలు
నెల్లూరు ఒకటోనగర ఇన్‌స్పెక్టర్‌పై బదిలీవేటు
ఎస్పీ, డీఎస్పీలపై ప్రభుత్వానికి నివేదిక
నెల్లూరు(క్రైమ్): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత సడలింది. పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ ఓ వర్గానికి చెందిన ప్రజలతో ఆదివారం జరిపిన చర్చలు ఎట్టకేలకు సఫలీకృతమయ్యాయి. దీంతో ఆ వర్గానికి చెందిన ప్రజలు శాంతించారు. దీంతో రెండురోజులగా నెలకొన్న ఉద్రిక్తత సద్దుమణిగింది. జిల్లా ఎస్పీ డాక్టర్ గజరావుభూపాల్ తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఓ వర్గానికి చెందిన ప్రజలు శనివారం రాత్రి ఆందోళనకు దిగిన విషయం విదితమే. దీంతో క్షమాపణ చెప్పేందుకు పోలీసుస్టేషన్‌కు వస్తున్న ఎస్పీ వాహనంపై ఓ వర్గానికి చెందిన యువకులు దాడికి దిగారు.
ఆత్మరక్షణ కోసం ఎస్పీ గన్‌మన్ గాలిలో కాల్పులు జరిపి ఎస్పీని సంఘటన స్థలం నుంచి తీసుకెళ్లిపోయారు. గుంటూరు రేంజ్ ఐజీ ఎన్ సంజయ్ ఆదివారం తెల్లవారుజామున నెల్లూరుకు చేరుకుని సంఘటనకు దారితీసిన పరిస్థితులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ జానకితో మాట్లాడి ఉద్రిక్తత పరిస్థితులను తొలగించేందుకు తీసుకోవాల్చిన చర్యలపై చర్చించారు. అలాగే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీకాంత్ జిల్లాకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
ఎస్పీపై చర్యలకు డిమాండ్
భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఆదివారం ఉదయం 11 గంటలకు ఆ వర్గానికి చెందిన వారు నెల్లూరు జెండావీధిలోని ఒక భవనంలో సమావేశమయ్యారు. దీంతో పోలీసు సిబ్బంది ఆ ప్రాంతంలో భారీగా మోహరించారు. ఆందోళనకారులు వందల సంఖ్యలో ఆ భవనం వద్దకు చేరుకుని ఎస్పీని సస్పెండ్ చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే నగర మేయర్ అబ్దుల్ అజీజ్, ఆందోళన చేస్తున్న వర్గానికి చెందిన ప్రతినిధులతో ఐజీ, కలెక్టర్, ప్రకాశం జిల్లా ఎస్పీ, జేసీ ఇంతియాజ్‌తో పాటు పలువురు అధికారులు చర్చలు జరిపారు.
తమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎస్పీ, సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకోవాలనీ, కేసులు ఎత్తివేయాలని ఆ వర్గం నేతలు డిమాండ్ చేశారు. దీనికి అధికారులు సానుకూలంగా స్పందించారు. ఒకటో నగర ఇన్‌స్పెక్టర్ కె.నరసింహరావును తక్షణమే బదిలీ చేస్తున్నట్లు ఐజీ ప్రకటించారు. ఎస్పీపై చర్యలు తీసుకునే విషయం అధికారులు దాటవేయడంతో తిరిగి ఆ వర్గం వారు పోలీసు కవాతు మైదా నం బయట ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి మొదటికొచ్చే అవకాశం ఉందని భావించిన ఐజీ, కలెక్టర్‌లు ఆందోళనకారుల వద్దకు చేరుకుని వారికి సర్దిచెప్పారు.
ఘటన దురదృష్టకరం
ఓ వర్గానికి చెందిన ప్రజలు అపార్థం చేసుకోవడం వల్లనే పరిస్థితి అదుపుతప్పిందని, ఇలాంటి ఘటన నెల్లూరులో చోటుచేసుకోవడం దురదృష్టకరమని ఐజీ అన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్పీ, డీఎస్పీలపై ప్రభుత్వానికి, డీజీపీకి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. సమస్య సద్దుమణిగిన తర్వాత ఐజీ, కలెక్టర్, నగర మేయర్ అజీజ్, ఆ వర్గ ప్రజలు శాంతి ర్యాలీ నిర్వహించారు. శాంతి ర్యాలీలో పాల్గొన్న గుంటూరు రేంజ్ ఐజీ సంజయ్, నెల్లూరు కలెక్టర్ జానకి, మేయర్ అజీజ్ తదితరులు.