plan Expenditure
-
‘రెవెన్యూ’కు నిరాశ
బడ్జెట్ కేటాయింపుల్లో గతేడాది కన్నా రూ.300 కోట్ల గండి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కీలకమైన రెవెన్యూ శాఖకు తాజా బడ్జెట్లో నిరాశే మిగిలింది. పైగా గత సంవత్సరం కంటే తక్కువ నిధులను ప్రభుత్వం కేటాయించింది. సిబ్బంది వేతనాలు, కార్యాలయాల ఖర్చులు, అద్దె వాహన చార్జీలకు మాత్రమే నిధులను కేటాయించింది. శాఖాపరంగా తీసుకురాదలిచిన సంస్కరణలకు ఊతమిచ్చే ప్రయత్నం చేయలేదు. గత ఏడాది బడ్జెట్లో రూ.1,687 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈ ఏడాది కేటాయింపుల్లో రూ.300 కోట్లకుపైగా కోత పెట్టింది. ఈసారి 1,384.13 కోట్లను మాత్రమే కేటాయించింది. ఇందులో ప్రణాళికా వ్యయం కింద రూ.46.76 కోట్లు, ప్రణాళికేతర పద్దులో రూ.1337.37 కోట్లు ఉన్నాయి. అన్ని గ్రామాల్లోనూ వీఆర్వో కార్యాలయాలు, రెవెన్యూ డివిజన్లలో ఆర్డీవో ఆఫీసులు, కలెక్టరేట్లకు కొత్త భవనాల నిర్మాణానికి బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. తాజా రెవెన్యూ చట్టాలపై సిబ్బందికి శిక్షణ, రెవెన్యూ వ్యవస్థ సంపూర్ణ కంప్యూటరీకరణకు కేవలం రూ.కోటితో సరిపెట్టింది. రెవెన్యూ శాఖకు సంబంధించి సచివాలయ విభాగానికి రూ.10.71 కోట్లు, జిల్లాల్లో భూపరిపాలన విభాగానికి రూ.859 కోట్లు కేటాయించింది. -
బడ్జెట్లో ప్రణాళికేతర వ్యయం రూ.70 వేల కోట్లు!
- విభాగాల వారీగా క్రోడీకరణ - తాజాగా లెక్కలేసుకున్న ఆర్థిక శాఖ సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరపు ప్రణాళికేతర వ్యయానికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక శాఖ ఒక అంచనాకు వచ్చింది. మార్చిలో ప్రవేశపెట్టబోయే 2015-16 బడ్జెట్లో ప్రణాళికేతర వ్యయాన్ని (నాన్ ప్లాన్) రూ.70 వేల కోట్లుగా లెక్కగట్టే అవకాశాలున్నాయి. ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ఈ మేరకు అంచనాకు వచ్చినట్లు సమాచారం. బడ్జెట్ ముందస్తు చర్చల్లో భాగంగా సోమవారం నాటికి కీలక రంగాలైన వ్యవసాయం, సాగునీటి పారుదల, విద్యుత్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పరిశ్రమలు, హోం, విద్య, వైద్యంతో పాటు సంక్షేమం, అటవీ, రోడ్లు భవనాలు, ఐటీ శాఖల మంత్రులు ప్రతిపాదనలను ఆర్థిక శాఖ ముందుంచారు. ఇవిగాక సీఎం పర్యవేక్షించే దళిత అభివృద్ధి, పురపాలక, పట్టణాభివృద్ధి, సహకారం, మౌలిక వసతులు, పెట్టుబడులు, సమాచార పౌర సంబంధాలు తదితర శాఖల ప్రతిపాదనలపై బుధవారం చర్చించాల్సి ఉంది. కానీ.. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కరీంనగర్ పర్యటనలో ఉండటంతో వాటిపై చర్చ జరగలేదు. అందుకే ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశాలను 21కి వాయిదా వేశారు. అలాగే, ఇప్పటివరకూ వివిధ శాఖలు సమర్పించిన ప్రతిపాదనలను క్రోడీకరించారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు, కార్యదర్శి శివశంకర్ బుధవారం సమావేశం నిర్వహించారు. ప్రధానంగా జీతభత్యాలు, నిర్వహణ ఖర్చులుగా పరిగణించే ప్రణాళికేతర వ్యయం ఎంత అవుతుందో లెక్క తేల్చారు. ఆర్థిక శాఖ అంచనాల ప్రకారం... ఈ వ్యయం రూ.65 వేల కోట్ల నుంచి రూ.67 వేల కోట్ల వరకు వెళ్లింది. ముఖ్యమంత్రి నిర్వహించే శాఖల ప్రతిపాదనలు ఇంకా రానందున వాటిని కూడా కలిపితే ప్రణాళికేతర వ్యయం ఇంచుమించుగా రూ.70 వేల కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది నవంబర్లో ప్రవేశపెట్టిన రూ.లక్ష కోట్ల తొలి బడ్జెట్లో ప్రణాళిక వ్యయం రూ.48,648 కోట్లు, ప్రణాళికేతర వ్యయం రూ.51,989 కోట్లుగా ప్రకటించింది. అప్పటితో పోలిస్తే ఈసారి బడ్జెట్లో ప్రణాళికేతర వ్యయం దాదాపుగా రూ.18 వేల కోట్లు పెరిగిపోనుంది. ప్రణాళిక వ్యయం కూడా అదే తరహాలో పెరిగిపోతే బడ్జెట్ రూ.1.30 లక్షల కోట్లకు చేరుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. -
వైద్యంలో ప్రణాళికేతర మాయ
హైదరాబాద్: వైద్య ఆరోగ్యశాఖపై బడ్జెట్లో ప్రభుత్వం అంకెల గారడీ చూపింది. గతంలో ఎన్నడూ లేనంతగా వివిధ రకాల పద్దులను ప్రణాళికేతర వ్యయంలో చూపించింది. 2014-15 సంవత్సరానికి ప్రణాళికేతర వ్యయం కింద రూ.3347 కోట్లు చూపించగా, ప్రణాళికా వ్యయం కింద కేవలం రూ.1040 కోట్లు మాత్రమే చూపించారు. వైద్య ఆరోగ్యశాఖకు మొత్తం బడ్జెట్టు రూ.4387 కోట్లుగా చూపించారు. ప్రణాళికేతర వ్యయంలో 80 శాతం సిబ్బంది జీతభత్యాలు, అలవెన్సులకే ఉంటుంది. ఏదైనా అభివృద్ధి పథకాలు చేయాలంటే ప్రణాళికా వ్యయంలోనే చూపించాలి. రాజీవ్ ఆరోగ్యశ్రీపై ఇదే వివక్ష రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరుమార్చుతామని చెబుతున్న ప్రభుత్వం కేటాయింపుల్లోనూ మార్పులు చూపించారు. ఇప్పటివరకూ ఉమ్మడి రాష్ట్రంలో 27 లక్షల మందికి శస్త్రచికిత్సలకు ఉపయోగపడి, ఎంతోమందికి పునర్జన్మనిచ్చిన ఈ పథకాన్ని ప్రణాళికా వ్యయం నుంచి తీసేసి ప్రణాళికేతర వ్యయంలోకి తెచ్చి రూ.500 కోట్లు మాత్రమే కేటాయించారు. -
ప్రణాళిక వ్యయం 2% అప్!
న్యూఢిల్లీ: మోడీ సర్కారు సంక్షేమ పథకాలకు తొలి బడ్జెట్లో భారీగానే నిధులు కుమ్మరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2014-15)లో బడ్జెట్లో ప్రణాళిక వ్యయం(ప్లాన్ ఎక్స్పెండిచర్) గతేడాదితో పోలిస్తే 2 శాతం(సుమారు రూ.11,000 కోట్లు) పెరగవచ్చని అంచనా. కాగా, ఈ ఏడాది ప్రతిపాదిత ప్రణాళిక వ్యయం లేదా స్థూల బడ్జెటరీ కేటాయింపు(జీబీఎస్) రూ.90,790 కోట్లు అధికంగా ఉండే అవకాశాలున్నాయని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. 2013-14 ఏడాది సవరించిన అంచనాల ప్రకారం చూస్తే ఈ మొత్తం 19 శాతం ఎక్కువకింద లెక్క. ప్రధానంగా భారత్ నిర్మాణ్, జాతీయ ఉపాధి హామీ పథకం, గ్రామీణ ఆరోగ్య పథకం వంటి సామాజిక రంగ స్కీమ్లకోసం చేసే వ్యయాన్ని జీబీఎస్గా వ్యవహరిస్తారు. గతేడాది ఈ మొత్తం రూ.5,55,322 కోట్లుగా ఉంది. వచ్చే నెల 10న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టనున్న మొట్టమొదటి బడ్జెట్లో జీబీఎస్ ఎంతుండాలనేది ఇప్పటికే ఖరారైపోయిందనేది ఆయా వర్గాల సమాచారం. కాగా, ద్రవ్యలోటు(ప్రభుత్వ వ్యయం, ఆదాయం మధ్య వ్యత్యాసం)ను అదుపులోపెట్టాల్సిన పరిస్థితుల నేపథ్యంలో జీబీఎస్ పెంపునకు అవకాశాలు కొద్దిగానే ఉన్నాయని సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు పేర్కొనడం గమనార్హం. తాజా గణాంకాల ప్రకారం గతేడాది ద్రవ్యలోటు 4.5%గా నమోదైంది. సవరించిన అంచనా 4.6% కంటే తగ్గింది. ఇందుకు ప్రభుత్వ వ్యయాల్లో కోత ఇతరత్రా అంశాలు దోహదం చేశాయి. ద్రవ్యలోటు ఆందోళనల నేపథ్యంలో గతేడాదికి జీబీఎస్ను బడ్జెట్ అంచనాల కంటే యూపీఏ ప్రభుత్వం తగ్గించింది. రూ.4,75,532 కోట్లకు పరిమితం చేసింది. వరుసగా రెండేళ్లు ప్రణాళిక వ్యయంలో గత సర్కారు భారీగా కోత విధించడం గమనార్హం.