- విభాగాల వారీగా క్రోడీకరణ
- తాజాగా లెక్కలేసుకున్న ఆర్థిక శాఖ
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరపు ప్రణాళికేతర వ్యయానికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక శాఖ ఒక అంచనాకు వచ్చింది. మార్చిలో ప్రవేశపెట్టబోయే 2015-16 బడ్జెట్‌లో ప్రణాళికేతర వ్యయాన్ని (నాన్ ప్లాన్) రూ.70 వేల కోట్లుగా లెక్కగట్టే అవకాశాలున్నాయి. ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ఈ మేరకు అంచనాకు వచ్చినట్లు సమాచారం. బడ్జెట్ ముందస్తు చర్చల్లో భాగంగా సోమవారం నాటికి కీలక రంగాలైన వ్యవసాయం, సాగునీటి పారుదల, విద్యుత్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పరిశ్రమలు, హోం, విద్య, వైద్యంతో పాటు సంక్షేమం, అటవీ, రోడ్లు భవనాలు, ఐటీ శాఖల మంత్రులు ప్రతిపాదనలను ఆర్థిక శాఖ ముందుంచారు.
ఇవిగాక సీఎం పర్యవేక్షించే దళిత అభివృద్ధి, పురపాలక, పట్టణాభివృద్ధి, సహకారం, మౌలిక వసతులు, పెట్టుబడులు, సమాచార పౌర సంబంధాలు తదితర శాఖల ప్రతిపాదనలపై బుధవారం చర్చించాల్సి ఉంది. కానీ.. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కరీంనగర్ పర్యటనలో ఉండటంతో వాటిపై చర్చ జరగలేదు. అందుకే ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశాలను 21కి వాయిదా వేశారు. అలాగే, ఇప్పటివరకూ వివిధ శాఖలు సమర్పించిన ప్రతిపాదనలను క్రోడీకరించారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు, కార్యదర్శి శివశంకర్ బుధవారం సమావేశం నిర్వహించారు.
ప్రధానంగా జీతభత్యాలు, నిర్వహణ ఖర్చులుగా పరిగణించే ప్రణాళికేతర వ్యయం ఎంత అవుతుందో లెక్క తేల్చారు. ఆర్థిక శాఖ అంచనాల ప్రకారం... ఈ వ్యయం రూ.65 వేల కోట్ల నుంచి రూ.67 వేల కోట్ల వరకు వెళ్లింది. ముఖ్యమంత్రి నిర్వహించే శాఖల ప్రతిపాదనలు ఇంకా రానందున వాటిని కూడా కలిపితే ప్రణాళికేతర వ్యయం ఇంచుమించుగా రూ.70 వేల కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది నవంబర్‌లో ప్రవేశపెట్టిన రూ.లక్ష కోట్ల తొలి బడ్జెట్‌లో ప్రణాళిక వ్యయం రూ.48,648 కోట్లు, ప్రణాళికేతర వ్యయం రూ.51,989 కోట్లుగా ప్రకటించింది. అప్పటితో పోలిస్తే ఈసారి బడ్జెట్‌లో ప్రణాళికేతర వ్యయం దాదాపుగా రూ.18 వేల కోట్లు పెరిగిపోనుంది. ప్రణాళిక వ్యయం కూడా అదే తరహాలో పెరిగిపోతే బడ్జెట్ రూ.1.30 లక్షల కోట్లకు చేరుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
బడ్జెట్‌లో ప్రణాళికేతర వ్యయం రూ.70 వేల కోట్లు!
Published Thu, Feb 19 2015 3:41 AM | Last Updated on Sat, Sep 2 2017 9:32 PM
Advertisement