అంతర్జాతీయ స్థాయికి విశాఖ
ఫ్లీట్ రివ్యూతో ప్రపంచ పటంలో చోటు
జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలకు వేదిక
రూ.30 వేల కోట్లతో పరిశ్రమలు
సబ్బవరం సమీపంలో ఎడ్యుకేషన్ సిటీ
జిల్లాలో 20 వేల మందికి ఇళ్లు
గణతంత్ర సందేశంలో కలెక్టర్ యువరాజ్
అల్లిపురం: అంతర్జాతీయ స్థాయి నగరంగా, ఆర్థిక కేంద్రంగా విశాఖను తీర్చిదిద్దనున్నట్లు కలెక్టర్ ఎన్.యువరాజ్ చెప్పారు. గత ఏడాది కాలంగా నగరం ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, ఈవెంట్లకు వేదికగా మారిందన్నారు. ఈ పరంపరలో భాగంగా ఫిబ్రవరి 4 నుండి 8 వరకు అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూను విశాఖ తీరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని, దీంట్లో 51 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటున్నారన్నారు. సూర్యాబాగ్ ఏఆర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో మంగళవారం జరిగిన 67వ గణతంత్ర వేడుకల్లో ఆయన ముందుగా పోలీస్ సిబ్బంది గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఇటీవల నగరంలో జరిగిన సీఐఐ సదస్సులో కుదిరిన ఒప్పందాల వల్ల రూ.30 వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు స్థాపించడానికి అవకాశమేర్పడిందని చెప్పారు. పరిశ్రమల స్థాపన వల్ల పెద్ద సంఖ్యలో ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు.
ఎడ్యుకేషన్ హబ్‌గా విశాఖ
జాతీయ అంతర్జాతీయ గుర్తింపు కలిగిన విద్యాసంస్థలను నగరానికి కే ంద్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు. సబ్బవరం వద్ద వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో అన్ని వసతులతో ఎడ్యుకేషన్ సిటీని నెలకొల్పడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. స్వచ్ఛభారత్ పథకం కింద 48 పాఠశాలకు మరుగుదొడ్ల సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు చెప్పారు. మండలాల్లో విద్యా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు మూడు దశల్లో 34 ఆదర్శ పాఠశాలలను నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
బహిరంగ మలమూత్ర విసర్జన రహిత జిల్లా లక్ష్యంగా..
స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా 2019 అక్టోబర్ 2 నాటికి బహిరంగ మలమూత్ర విసర్జన రహిత జిల్లాగా విశాఖ జిల్లాను రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. దారిద్య్రరేఖకు దిగువన గల 1,65.399 మందికి వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేశామన్నారు. జిల్లాలో క్రీడా సౌకర్యాలను మెరుగుపరచడానికి స్పోర్ట్స్ అధారిటీ కొమ్మాదిలో మిని స్టేడియంను, యలమంచిలిలో ఇండోర్ స్టేడియంను నిర్మిస్తుందన్నారు.
రహదారులకు మహర్దశ
అనకాపల్లి-పూడిమడక, ఎలమంచిలి-గాజువాక, విశాఖపట్నం-అనంతగిరి-అరుకు, నర్సీపట్నం-తుని, భీమునిపట్నం-నర్సీపట్నం, సబ్బవరం-కొత్తవలస-కె.కోటపాడుల మధ్య నాలుగు లైన్ల రహదారిని అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశాన్నారు. గిరిజన ప్రాంతాల్లో రూ.173 కోట్ల ఖర్చుతో రహదారులను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
స్వయంసహాయక సంఘాల అభివృద్ధి : జిల్లాలో 44 వేల 214 స్వయం సహాయక సంఘాలు చురుగ్గా పనిచేస్తున్నాయన్నారు. మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేయడానికి ఈ సంఘాలకు రూ.508 కోట్లు సహాయంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వీటిలో ఇప్పటి వరకు రూ,139.49 కోట్లు మహిళా సంఘాల ఖాతాలలోకి జమ చేశామన్నారు. మూడవ విడత జన్మభూమిలో భాగంగా ప్రజల నుండి లక్ష ఎనిమిదివేల ధరఖాస్తులు వచ్చాయని, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
స్మార్ట్ సిటీగా..
స్మార్ట్ సిటీగా నగరంలో సౌకర్యాల మెరుగుకు కృషి చేస్తున్నామన్నారు. విశాఖలో ఇల్లు లేని వారికి 20 వేల ఇళ్లు నిర్మించాలని నిర్ణయించటం జరిగిందన్నారు. హుద్‌హుద్ తుఫాను సహాయం కింద కార్పొరేట్ సంస్థల సహకారంతో జిల్లాలో 5,462 ఇళ్లను ఒక్కొక్కటి రూ.4.80 లక్షల వ్యయంతో నిర్మిస్తున్నామన్నారు. ఇవి వచ్చే ఆరు నెలల్లో పూర్తి కానున్నాయన్నారు.
ఉత్తమ సేవలకు పురస్కారాలు
ఉత్తమ సేవలందించిన వివిధ విభాగాలకు చెందిన 470 మంది ఉద్యోగులకు కలెక్టర్ ప్రతిభా పురస్కారాలు అందజేశారు. విదేశీయులు పోగొట్టుకున్న లక్ష డాలర్ల కరెన్సీని నిజాయితీగా పోలీసులకు అప్పగించిన శివశివానీ పాఠశాల విద్యార్థులు ఎం.సాయి సూర్య, పవన్‌సాయిలకు కలెక్టర్ ప్రశంసా పత్రాలను అందజేశారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 2015లో పర్యావరణంపై ప్రజంటేషన్ ఇచ్చి మెరిట్ సర్టిఫికేట్ పొందిన జిల్లా విద్యార్థి ఆనంద్‌కు కూడా ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందిన 42,361 మందికి రూ.101.07 కోట్ల ఆస్తులను కలెక్టర్ పంపిణీ చేశారు.