మిషన్ కలాం
మిషన్ కలాం
Published Fri, Oct 14 2016 3:52 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
విద్యాభివృద్ధికి కలెక్టర్ ప్రత్యేక కార్యక్రమం
కొత్త జిల్లాలో అభివృద్ధిపై ప్రజలు ఆశలు పెట్టుకున్నారు
18ఏళ్లలోపు పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేకశ్రద్ధ
ఇసుక అక్రమరవాణాకు అడ్డుకట్ట వేస్తాం
మండలస్థాయిలో ప్రత్యేక తహసీల్దార్‌స్థాయి అధికారి నియామకం
తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు
పారిశ్రామిక వేత్తలకు మరింత ప్రోత్సాహం
కలెక్టర్ రొనాల్డ్‌రోస్ వెల్లడి
సాక్షి, మహబూబ్‌నగర్: ‘‘వ్యవస్థలో మార్పు తీసుకురావాలంటే ‘విద్య’ ద్వారానే సాధ్యమవుతుంది. మహబూబ్‌నగర్ జిల్లాలో విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తా. అందుకోసం మొదటగా మిషన్ కలాం పేరుతో పాఠశాల విద్యాభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొస్తా. నాణ్యమైన విద్యను అందించి తద్వారా మంచి ఫలితాలు సాధించేందుకు ప్రపంచంలోని పెద్ద సంస్థల సహకారం తీసుకుంటాం’’ అని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ స్పష్టం చేశారు. జిల్లాల పునర్విభజనతో చాలా మార్పులు జరిగాయని, అధికారులతో సమీక్షించి అభివృద్ది విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జాయింట్ కలెక్టర్ శివకుమార్ నాయుడు, శిక్షణ ఐఏఎస్ గౌతం పొట్రులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో ఏం జరిగిందో తెలియదని... ప్రస్తుతం జిల్లాలో ఎక్కడెక్కడ ఏం అవసరముందో అర్థం చేసుకున్నాకే కార్యాచరణ మొదలు పెడతానని, అందుకోసం తనకు నెలరోజుల సమయం కావాలన్నారు. అభివృద్ధి విషయంలో జిల్లా అధికారులపై ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారని, అందుకోసం సమష్టిగా పనిచేసేలా కార్యాచరణ మొదలుపెడతానని చెప్పారు.
సమస్యల పరిష్కారానికి ప్రత్యేక తహసీల్దార్...
ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు కలెక్టర్ రొనాల్డ్ రోస్ స్పష్టం చేశారు. మండల, డివిజన్ కేంద్రాల్లో ప్రతీ వారం నిర్వహించే ప్రజావాణిలో సమస్యలు పరిష్కారం కాకపోతేనే జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రజావాణికి ప్రజలు రావాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక తహసీల్దార్ స్థాయి అధికారిని నియమించనున్నట్లు తెలిపారు. ఆర్బీఎస్‌కే ద్వారా జిల్లాలో 18 సంవత్సరాల లోపు పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నట్లు తెలిపారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, విద్య, వైద్యంతో పాటు రెవెన్యూ రికార్డులకు సంబంధించిన సాదాబైనామా పథకాల అమలుపై చిత్తశుద్ధితో పనిచేయనున్నట్లు తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. అందుకోసం అవసరమైన భూసేకరణ పనులు, ప్రాజెక్టు పనుల నిర్వహణపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం జిల్లా అభివృద్ధికి దూర దృష్టితో చేపడుతున్న కార్యక్రమాలను శక్తివంచన లేకుండా అమలు చేస్తానన్నారు.
వందశాతం పారిశుద్ధ్యం లక్ష్యం
జిల్లాలో ఇప్పటివరకు 14 శాతం మాత్రమే వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించారని, దీన్ని వందశాతం పూర్తిచేస్తామని కలెక్టర్ రోనాల్డ్‌రోస్ స్పష్టం చేశారు. తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోందని, అందుకోసం శాశ్వత నివారణ చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. తాగునీటి సమస్య పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చేసి చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఇసుక అక్రమరవాణాకు అడ్డుకట్ట వేస్తామని, టీఎస్‌ఎండీసీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. గ్రామ పంచాయితీ స్థాయిలోనే ఇసుక అనుమతులు, తవ్వకాలపై ప్రత్యేక దృష్టి సారించే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఎక్కడెక్కడ ఇసుక నిల్వలున్నాయి... వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే దానిపై దృష్టి కేంద్రీకరించనున్నట్లు తెలిపారు. గ్రామజ్యోతి కార్యక్రమం ద్వారా గ్రామాల అభివృద్ధిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. జిల్లాల పునర్విభజన అనంతరం తాజాగా మహబూబ్‌నగర్ జిల్లాలో 83 పరిశ్రమలు మిగిలాయన్నారు. జిల్లా మీదుగా జాతీయ రహదారి వెళ్తున్నందున మెరుగైన రవాణా సౌకర్యం ఉందని, జిల్లాలో మరిన్ని పరిశ్రమలు నెలకొల్పే విధంగా వేత్తలను ప్రోత్సహించనున్నట్లు తెలిపారు.
Advertisement
Advertisement