విసిగిపోయి..అలా చేశాడట!
భోపాల్ : కేజీ నుంచి పీజీ దాకా విద్యను కొనుక్కోవాల్సి వస్తున్న ప్రస్తుత తరుణంలో తన కొడుకు స్కూలు అడ్మిషన్ కోసం ఓ తండ్రి విసిగి వేసారిన వైనం పలువురిని ఆలోచనలో పడేసింది. మధ్య ప్రదేశ్లోని మాంద్సూర్కి చెందిన దశరథ్ సూర్యవంశ్ స్కూలు ఫీజు చెల్లించలేక... తన కొడుకు విద్యావకాశం కల్పించాలని కోరుతూ జిల్లా ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నాడు. అయినా ఫలితం కనిపించకపోవడంతో ఏకంగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి జిల్లా ఉన్నతాధికారుల ముందు డాన్స్ చేశాడు. దీంతో షాకైన కలెక్టర్ సంబంధించి చర్యలకు ఆదేశించారు.
సూర్యవంశ్ కొడుకు అడ్మిషన్ కోసం స్థానిక ప్రయివేటు స్కూలు రూ. 27 వేలు డిమాండ్ చేసింది. దీంతో ప్రాథమిక విద్యాహక్కు చట్టం కింద తనకు న్యాయం చేయాలంటూ అతడు జిల్లా అధికారులను ఆశ్రయించాడు. అయినా ఫలితం కనిపించలేదు. ఈ మొత్తం వ్యవహారంతో విసిగిపోయి సాక్షాత్తూ కలెక్టర్ ముందు వెరైటీగా నిరసనకు దిగాడు. దీంతో సూర్యవంశ్కు హామీ ఇచ్చిన కలెక్టర్, విచారణ ఆదేశించినట్టు తెలుస్తోంది.