రోజూ ఉదయమే స్కూల్‌కు వెళ్లాలి. బయోమెట్రిక్ హాజరు వేయాలి. పిల్లలకు పాఠాలు చెప్పాలి. ఇదంతా ఎందుకనుకుంటున్న టీచర్లకు ‘తర్ల్’ అవకాశం అందివచ్చింది. అకడమిక్ కోఆర్డినేటర్ల (సీఏసీ) పోస్టులకు పైరవీ పెరిగింది. ఏకంగా మంత్రుల సిఫారసుతో పోస్టులు పట్టేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరమంతా అలా గడిపేందుకు సిద్ధమయ్యారు. విద్యాశాఖ అధికారులు కూడా నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేస్తుండడంతో బోధన కుంటుపడనుంది.
అనంతపురం ఎడ్యుకేషన్: టీచింగ్ అట్ రైట్ లెవల్ (తర్ల్) కార్యక్రమ పర్యవేక్షణ క్లస్టర్ అకడమిక్ కోఆర్డినేటర్ల(సీఏసీ) నియామకం వివాదాస్పదంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా విద్యాశాఖ అధికారులు.. అధికార పార్టీ నేతల సిఫారసులకు అనుగుణంగా నియామకాలు చేపట్టడంతో బోధనపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇదే అదునుగా కొందరు మండల విద్యాశాఖ అధికారులూ చేతివాటం ప్రదర్శించారు. ఫలితంగా మిగులు టీచర్లును, 4 నుంచి 5 మంది టీచర్లున్న స్కూళ్ల నుంచి ఒకరిని సీఏసీలుగా నియమంచాలనే నిబంధనలు బుట్టదాఖలయ్యాయి.
ఉద్దేశం ఇదీ...
ప్రాథమిక స్థాయిలో చదువు సామర్థ్యాలు పెంపులో భాగంగా జిల్లాలో ఎంపిక చేసిన 3,173 ప్రాథమిక పాఠశాలల్లోని ‘తర్ల్’ కార్యక్రమం అమలు చేయనున్నారు. 3, 4, 5 తరగతుల విద్యార్థులకు భాషతో పాటు గణితం, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఎంపిక చేసిన టీచర్లను సీఏసీలుగా నియమించి వారికి జిల్లా స్థాయిలో శిక్షణ ఇస్తున్నారు. తర్వాత వీరు మండలస్థాయిలో టీచర్లకు శిక్షణ ఇస్తారు. అనంతరం ఎంపిక చేసిన స్కూళ్లలో ‘తర్ల్’ కార్యక్రమం అమలును సీఏసీలు రోజూ రెండు స్కూళ్లకు వెళ్లి కార్యక్రమం అమలు తీరుతెన్నులను పరిశీలించాల్సి ఉంటుంది.
సరఫ్లస్ టీచర్లను పట్టించుకోకుండా...
సర్‌ఫ్లస్ (మిగులు) టీచర్లను సీఏసీలుగా నియమించేందుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. సర్‌ఫ్లస్ లేకున్నట్లయితే 4–5 మంది టీచర్లు పనిచేస్తున్న పాఠశాలల నుంచి ఒకరిని తీసుకోవచ్చు. అయితే అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకున్నారు. టీచర్లు కూడా చక్రం తిప్పారు. దీంతో ఇద్దరు, ముగ్గురు టీచర్లున్న స్కూళ్లలో ఒకరిని బయటకు తీసి సీఏసీగా నియమించారు. దీంతో తమపై భారం పెరుగుతుందని మిగతా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగా ఆయా స్కూళ్లలో పిల్లల చదువుకు ఆటంకం కలుగుతుంది. దీనికితోడు కొందరు ఎంఈఓలసు టీచర్ల అవసరాన్ని ఆసరగా చేసుకుని చేతివాటం ప్రదర్శిస్తూ విద్యార్థుల గురించి ఆలోచించకుండా సీఏసీల నియామకాలు చేపట్టారని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
వలంటీర్ల విషయాన్ని పట్టించుకోని ప్రభుత్వం
సీఏసీలుగా తీసుకున్న టీచర్ల స్థానాల్లో వలంటీర్లను నియమిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో 220 మంది వలంటీర్లు అవసరం అని ఇక్కడి అధికారులు నివేదిక పంపారు. ఇప్పటిదాకా అనుమతులు రాలేదు. ఈ క్రమంలో సీఏసీలుగా నియామకమైన వారి స్కూళ్లలో బోధన కుంటుపడుతుందని టీచర్లే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా సీఏసీ నియామకాల్లో కొన్ని...
♦ గుత్తి మండలం తురకపల్లి, కొత్తపల్లి స్కూళ్లలో సర్‌ఫ్లస్ టీచర్లున్నారు. వారిని కాకుండా ఇద్దరు టీచర్లున్న ఎంగిలిబండ, అబ్బేదొడ్డి, గుత్తి 8వ వార్డు స్కూళ్ల నుంచి ఒక్కో టీచరును నియమించారు.
♦ పామిడి మండలం జి.కొట్టాలు ప్రాథమిక పాఠశాలలో 50 మంది విద్యార్థులున్నారు. ఇద్దరు టీచర్లు పని చేస్తున్నారు. వీరిలో ఒకర్ని సీఏసీగా నియమించారు.
♦ కనగానపల్లి మండలంలో సీఏసీల నియామకంలో మంత్రి పరిటాల సునీత బంధువులు, స్థానిక టీడీపీ నాయకులు అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు చేసినట్లు తెలిసింది. ఫలితంగా అప్పటికే ముగ్గురు టీచర్లను ఎంపిక చేసి జాబితాను జిల్లా విద్యాశాఖకు పంపిన మండల అధికారులు... తెల్లవారే సరికే ఈజాబితాను మార్చడం విశేషం. రాత్రి జాబితాలో ఇద్దరు పేర్లను మార్పు చేసి ఉదయం కొత్త జాబితాను విడుదల చేయడం చర్చనీయాంశమైంది.
♦ ఆత్మకూరు మండలం వడ్డుపల్లి ప్రాథమిక పాఠశాలలోనూ 50 మంది విద్యార్థులుండగా... ఇద్దరు టీచర్లు పని చేస్తున్నారు. వీరిలో ఒక టీచరు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇంకా కోలుకోలేని పరిస్థితి. పాఠాలు చెప్పడానికి ఆరోగ్యం సహకరించలేదు. ఆయనకు కచ్చితంగా ఒకరు తోడుండాల్సిందే. అయితే ఈ స్కూల్ నుంచి కూడా ఉన్న మరో టీచరును సీఏసీగా నియమించారు. గ్రామస్తులు విన్నవించినా అధికారులు పట్టించుకోలేదు.
♦ బుక్కరాయసముద్రం మండలంలో ముగ్గురి టీచర్లను జాబితాలో కనబరిచారు. అయితే ఉత్తర్వులు మాత్రం నలుగురు టీచర్లకు ఇచ్చారు. ఇదేమి లెక్కో అధికారులకే తెలియాలి.
♦ గార్లదిన్నె మండలం పెనకచెర్ల ఎస్సీ కాలనీ మోడల్ ప్రైమరీ స్కూల్ నుంచి ఒక టీచరును సీఏసీగా నియమించారు. మోడల్ స్కూల్ నుంచి టీచర్లను బయటకు తీసుకురాకూడదనే నిబంధన ఉంది. ఇదే విషయమై సదరు స్కూల్ హెచ్‌ఎం ఎంఈఓతో గొడవకు దిగినట్లు తెలిసింది. టీచరును రిలీవ్ చేసేందుకు హెచ్‌ఎం ససేమిరా అంటున్నారు.
♦ శింగనమల మండలం ఆనందరావుపేట ప్రాథమికోన్నత పాఠశాలలో ముగ్గురు ఎస్జీటీలుండగా..1నుంచి 5 తరగతుల విద్యార్థులు 71 మంది ఉన్నారు. వీరిలో ఒకరిని సీఏసీగా నియమించారు.
‘సర్‌ఫ్లస్’నే నియమించాలి
సర్‌ఫ్లస్ టీచర్లనే నియమించుకోవాలని ఎంఈఓలకు స్పష్టంగా చెప్పాం. సర్‌ఫ్లస్ టీచర్లు లేకపోతే నలుగురి నుంచి ఐదు మంది టీచర్లు ఉన్న స్కూళ్ల నుంచి ఒకరిని తీసుకోవాలనే నిబంధన ఉంది. కొందరు ఎంఈఓలు ఇద్దరున్న స్కూళ్ల నుంచి ఒకరిని తీసుకున్నట్లు నా దృష్టికి కూడా వ చ్చింది. అలాంటి వారిని మార్చాలని ఎంఈఓలకు ఆదేశించా. – జనార్దనాచార్యులు, డీఈఓ
Comments
Please login to add a commentAdd a comment