ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైనం
డీజేలతో తలెత్తుతున్న సమస్యలు
రాజాం సిటీ: అంతవరకు అందరితో కలిసి డీజే ముందు డ్యాన్స్ చేసిన యువకుడు ఒక్కసారిగా అస్వస్థతకు గురై కుప్పకూలిపోయాడు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి మున్సిపాలిటీ పరిధి పొనుగుటివలస గ్రామంలో నిర్వహించిన వినాయక నిమజ్జనంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి గ్రామస్తులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి.
గ్రామానికి చెందిన వావిలపల్లి వినయ్ అనే ఇరవై ఏళ్ల యువకుడు వినాయకుని నిమజ్జనం సందర్భంగా ఏర్పాటు చేసిన డీజే వద్ద డ్యాన్స్‌చేసి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. విషయం గమనించిన కొంతమంది యువకులు అతనిని పరిశీలించగా అపస్మారకస్థితిలో ఉన్నట్లు గుర్తించి సపర్యలు చేపట్టి ఇంటికి చేర్చారు. అక్కడ నుంచి రాజాంలోని ఓ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు.
గుండె సంబంధిత సమస్యగా గుర్తించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిఫర్ చేశారు. అక్కడ నుంచి విశాఖపట్నం తరలించారు. డీజేల వల్ల పలు సమస్యలు తలెత్తుతున్నా యువత పట్టించుకోకపోవడం విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై రాజాం టౌన్, రూరల్ సీఐలు కె.అశోక్‌కుమార్, హెచ్.ఉపేంద్ర వద్ద ప్రస్తావించగా.. డీజేలకు ఎటువంటి అనుమతుల్లేవన్నారు. వినాయక నిమజ్జనాల్లో డీజేలు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment