శ్రీకాకుళం క్రైమ్: ‘తండ్రీ యేసు ప్రభువా.. నన్ను క్షమించు.. నా చావు నేనే డిసైడ్ చేసుకున్నా.. ఈ దేశంలో నేనే అందర్నీ మోసగించా.. నేను చేసిన నేరాలకు అందరూ క్షమించండి’.. అంటూ సూసైడ్ లెటర్ రాసి ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్రమైన మానసిక ఆందోళనతో బాధ పడుతున్న విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మన్యం (పార్వతీపురం) జిల్లా సీతంపేట మండలం సంకిలి గ్రామానికి చెందిన ఊయక లక్కయ్ (20) శ్రీకాకుళంలోని ఆర్ట్స్ కళాశాల బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
రెండో పట్టణ ఎస్‌ఐ కె.లక్ష్మి, స్థానికులు, విద్యార్థి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. లక్కయ్ శ్రీకాకుళం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్‌లో ఈ జూన్‌లో చేరాడు. ఆర్ట్స్ కళాశాల సమీపంలో ఉన్న ప్రభుత్వ కళాశాల బాలుర వసతి గృహంలో ఉంటున్నాడు. తల్లిదండ్రులు, అన్నదమ్ములు పోడు వ్యవసాయం చేసుకుంటూ గ్రామంలోనే జీవిస్తున్నారు. ఈ క్రమంలో వారం రోజుల కిందట లక్కయ్ ఊరెళ్లగా కుటుంబ సభ్యులంతా సెలవులపై వచ్చాడనుకున్నారు.
కానీ లక్కయ్ డల్‌గా కనిపిస్తూ రాత్రి పూట బైబిల్ చదువుతూ పరధ్యానంగా ఉండేవాడు. దీంతో సోదరుడు రాజేష్ లక్కయ్‌ను ప్రశ్నించగా తనకు చదువుపై ఇంట్రస్ట్ లేదని చెప్పాడు. ఈ నెల 25న చర్చికి వెళ్తానని చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చిన లక్కయ్ తిరిగి ఇంటికి వెళ్లలేదు. బంధువుల ఇంటికి వెళ్లుంటాడులే అని కుటుంబ సభ్యులంతా భావించారు.
ఈ నేపథ్యంలో లక్కయ్ ఆదివారం కాలేజీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పక్కనే గ్రౌండ్‌లో ఆడుకుంటున్న కుర్రాళ్లకు శబ్దం వినిపించడంతో వెళ్లి చూడగా.. లక్కయ్ నిస్సహాయంగా చూస్తూ కనిపించాడు. వెంటనే రిమ్స్‌కు తరలించగా అక్కడే చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అంతకుముందే వసతి గృహంలో పనిచేస్తున్న వై.అప్పలరాజు లక్కయ్ అన్నయ్య రాజేష్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు. లక్కయ్ వారం రోజులుగా హాస్టల్‌లో లేడని, ఈ రోజు ఉదయం ఆర్ట్స్ కళాశాల మీద నుంచి దూకేశాడని.. రిమ్స్‌లో చేర్పించామని, చేతిలో ఏదో సూసైడ్ నోట్ రాసి ఉందని చెప్పారు.
దీంతో వారంతా రిమ్స్‌కు చేరుకుని సూసైడ్ లెటర్‌ను చూడగా.. ‘జీసస్ ఈజ్ మై ఎవ్రీథింగ్.. ఐలవ్యూ జీసస్.. ఫర్ యెవర్ ఫర్ యెవర్.. తండ్రీ యేసు ప్రభువా.. నన్ను క్షమించు.. నా చావు నేనే డిసైడ్ చేసుకున్నా.. ఈ దేశంలో నేనే అందర్నీ మోసగించా.. నేను చేసిన నేరాలకు అందరూ క్షమించండి’ అని రాసి ఉంది. ఈ విషయమై రెండో పట్టణ ఎస్‌ఐ లక్ష్మిని వివరణ కోరగా విద్యార్థి సైకలాజికల్‌గా ఇబ్బంది పడుతూ ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని.. మేడ మీద నుంచి దూకడం వలన ఊపిరితిత్తులు ఛిద్రమయ్యాయని మిగతా భాగాల్లో ఎక్కడా గాయాలు లేవని, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం పూర్తయ్యిందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment