ప్రమాదానికి కారణమైన పెట్రోల్ టాంకు ఇదే
విజయనగరం: రెప్పపాటులో ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కూలి పనికి వెళ్లిన ఒకరు.. సహా యం చేసేందుకు వెళ్లిన మరొకరిని మృత్యువు కాటేసింది. వారి కుటుంబాలకు తీరని శోకం మిగిల్చింది. మూతపడిన పెట్రోల్ బంకును మళ్లీ తెరిపించే ప్రయత్నంలో అండర్ గ్రౌండ్ ట్యాంకును పరి శుభ్రం చేస్తున్న వ్యక్తి ఒకరు ఊపిరాడక మృతి చెందగా, సహాయం కోసం వెళ్లిన వ్యక్తి కూడా ఊపిరాడక టాంకులోనే మృతి చెందిన దుర్ఘటన బొబ్బిలి లో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... బొబ్బిలి గ్రోత్ సెంటర్‌లో ఉన్న ఎస్సార్ పెట్రోల్ బంకును సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి నడుపుతున్నారు.
ఈ బంకు కొద్ది రోజులుగా మూతపడి ఉంది. మళ్లీ తెరిపిద్దామన్న ఉద్దేశంతో బంకులోని ట్యాంకులను శుభ్రం చేసేందుకు సోమవారం చింతాడకు చెందిన పెద్దింటి పోలినాయుడు, యామలపల్లి తవిటినాయుడు, అల్లు నారాయణరావును కూలికి పిలిచారు. ఈ క్రమంలో అండర్ గ్రౌండ్‌లో ఉన్న బంకు టాంకు ఓపెన్ చేశారు. శుభ్రం చేయాలంటే కిందకు దిగాలనడంతో... కూలీల్లో ఒకరైన పెద్దింటి పోలినాయుడు (55)కు నూతుల్లో దిగే అనుభవం ఉండడంలో వెంటనే దిగాడు. దిగిన క్షణాల్లోనే ఊపిరాడక ట్యాంకులోనే ఉండిపోయాడు. పైన ఉన్న కూలీలు కేకలు వేయడంతో పెట్రోల్ బంకు ఎదురుగా ఉన్న మరో రోడ్డులో మరమ్మతుల కోసం నిలిచిఉన్న లారీ క్లీనర్ పాట్నాకు చెందిన అన్షు (35) సహాయం చేసేందుకు పరుగున వెళ్లాడు.
ట్యాంకులో దిగాడు. అంతే.. క్షణాల్లో ఆయన ప్రాణం కూడా గాలిలో కలిసిపోయింది. ఇద్దరి మృతితో ఆ ప్రాంతమంతా కన్నీటిసంద్రంగా మారింది. ఎస్సై చదలవాడ సత్యనారాయణ తన సిబ్బందితో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పెట్రోల్ బంకు యజమానిని అదుపులోకి తీసుకున్నారు. మృత దేహాలను పోస్టుమార్టం కోసం బొబ్బిలి సీహెచ్‌సీకి తరలించారు. మృతుడు పెద్దింటి పోలినాయుడుకు హైదబాద్‌లో ఉద్యోగం చేస్తున్న కుమారుడు సురేష్, పెళ్లయిన కుమార్తె పోలీసు ఉన్నారు. మేనల్లుడు హోంగార్డు ఘటనా స్థలంలోనే ఉండి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మరో మృతుడు అన్షు పాట్నాకు చెందిన వ్యక్తికాగా, లారీ ఓనర్ బరంపురానికి చెందినవారు.
Comments
Please login to add a commentAdd a comment