పార్వతీపురం మన్యం: ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లిన పాలకొండకు చెందిన ఓ విద్యార్థి విగతజీవిగా సొంతూరుకు శనివారం చేరాడు. దీంతో తల్లిదండ్రులు, బంధువుల రోదనలతో పాలకొండ శోకసంద్రమైంది. చదువే లోకంగా జీవించిన ఆ విద్యార్థి కలలు కల్లలయ్యాయి. తమ బిడ్డపై ఆ తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే... పాలకొండలోని బట్టి మఠం కాలనీలో రాకోటి వెంకటరమణ, ఆదిలక్ష్మి దంపతులు నివసిస్తున్నారు.
వీరికి కుమారుడు రాకోటి సాయినికేష్(21), కుమార్తె లేఖ ఉన్నారు. సాయినికేష్ ఇటీవల ఇంజినీరింగ్ పూర్తి చేసి ఎంఎస్ కోసం గత నెల డిసెంబర్ ఆఖరులో అమెరికా వెళ్లాడు. హర్ట్‌పోర్టు సిటీలో సీక్రెడ్ యూనివర్సిటీలో సీటు రావడంతో అక్కడ ఎంఎస్‌లో చేరాడు. అమెరికా వెళ్లిన 15 రోజుల్లోనే ఈ నెల 12న శుక్రవారం తాను ఉంటున్న గదిలో అనుమానాస్పదంగా మృతి చెందాడు.
సాయినికేష్‌తో పాటు అదే గదిలో ఉంటున్న తెలంగాణ రాష్ట్రం వనపర్తికి చెందిన మరో తెలుగు విద్యార్థి కూడా మృతి చెందాడు. విష వాయువు పీల్చడంతోనే వీరిద్దరు మృతి చెందినట్టు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. శనివారం సాయినికేష్ మృతదేహం ఇక్కడకు రాగా అంత్యక్రియలు నిర్వహించారు. ఇదిలా ఉండగా తమ బిడ్డ మృతికి పూర్తి కారణాలు తెలియడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయినికేష్ మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన సహచర విద్యార్థులు, స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ సంఘటనతో పాలకొండ పట్టణంలో విషాదం అలముకుంది.
Comments
Please login to add a commentAdd a comment