సానియాకు ‘ఖేల్ రత్న'!
క్రీడా మంత్రిత్వ శాఖ యోచన
న్యూఢిల్లీ: ఏడాది కాలంగా అంతర్జాతీయస్థాయిలో అద్వితీయ విజయాలు సాధిస్తోన్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పేరును దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ గాంధీ ఖేల్ రత్న’కు సిఫారసు చేయాలని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. గత ఏప్రిల్‌లో మహిళల డబుల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సాధించి... ఇటీవల వింబుల్డన్ మహిళల డబుల్స్ టైటిల్‌నూ నెగ్గి చరిత్ర సృష్టించిన సానియా ఇప్పటివరకు ఈ అవార్డుకు వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకోలేదు.
అయితే నిబంధనల ప్రకారం క్రీడా మంత్రిత్వ శాఖ అర్హత ఉన్న వారి ఎవరి పేరునైనా ఈ అవార్డుకు సిఫారసు చేసే వీలుంది. సానియా గతేడాది ఇంచియోన్ ఆసియా క్రీడల్లో సాకేత్ మైనేనితో కలిసి మిక్స్‌డ్ డబుల్స్‌లో స్వర్ణం, ప్రార్థన తొంబారేతో కలిసి మహిళల డబుల్స్‌లో కాంస్యం సాధించింది. అంతేకాకుండా బ్రూనో సోరెస్ (బ్రెజిల్)తో కలిసి యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. అయితే ‘ఖేల్త్న్ర’ అవార్డు విషయంపై ఇప్పుడే ఒక అంచనాకు రావడం తొందరపాటే అవుతుందని క్రీడా శాఖ కార్యదర్శి అజిత్ శరణ్ తెలిపారు.