- ‘ఆర్ట్ ఎట్ తెలంగాణ’లో గుర్తింపు
- అంతర్జాతీయ స్థాయి పుస్తకంలో చోటు
- ‘మెట్రో పోలిస్’ సదస్సులోనూ ప్రదర్శన
- ప్రతిభతో ప్రశంసలందుకుంటున్న వర్సిటీ ఆర్టిస్ట్ శ్రీనివాస్
రాజేంద్రనగర్: చిత్రకారుడు రమావత్ శ్రీనివాస్ నాయక్ తన కళా ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆర్టిస్టు, ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తోన్న ఈయన ‘ఆర్ట్ ఎట్ తెలంగాణ’కు ఎంపికయ్యారు.
గతనెల 27 నుంచి ఈనెల 6వ తేదీ వరకు నగరంలోని తారామతి బారాదరిలో నిర్వహించిన ‘ఆర్ట్ ఎట్ తెలంగాణ’ ఎగ్జిబిషన్‌లో శ్రీనివాస్ నాయక్ కుంచె నుంచి జాలువారిన అద్భుతమైన చిత్రాలకు అరుదైన గౌరవం దక్కింది. చిత్రకళా రంగంలో విశ్వఖ్యాతిని ఆర్జించిన పికాసో స్ఫూర్తితో లంబాడాల జీవన విధానాన్ని క్యూబిజమ్ శైలిలో అద్భుతంగా ఆవిష్కరించినందుకు శ్రీనివాస్ నాయక్ పలువురు అంతర్జాతీయ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్నారు.
నల్గొండ జిల్లా మారుమూల ప్రాంతం ఎర్ర చెరువు తండాకు చెందిన శ్రీనివాస్ పేద కుటుంబంలో జన్మించారు. ఈయన పాఠశాల స్థాయిలోనే అద్భుతమైన చిత్రాలు రూపొందించారు. నగరంలోని జేఎన్‌టీయూ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయంలో బీఎఫ్‌ఏలో ప్రవేశం పొందారు. అనంతరం వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆర్టిస్ట్‌గా ఉద్యోగంలో చేరారు. ఇప్పటివరకు ఈయన 500 క్యూబిజమ్ చిత్రాలు, రెండువేలకు పైగా క్యారికేచర్‌లు వేశారు.
ఆల్ ఇండియా ఆర్ట్ ఎగ్జిబిషన్ అవార్డు, స్టేట్ ఆర్ట్ గ్యాలరీ వారు నిర్వహించిన పోటీల్లోనూ అవార్డు అందుకున్నారు. ఉత్తమ చిత్రాలను వేసినందుకు గాను ఆర్ట్ ఎట్ తెలంగాణ నుంచి రూ.25 వేల నగదు పురస్కారాన్ని అందుకున్నారు. మెట్రో పోలిస్ సదస్సులో 90 చిత్రాలు, చిత్రకారుల బయోడేటాతో కూడిన పుస్తకాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో ముద్రించారు. వీటిని సదస్సుకు హాజరైన 114 దేశాల ప్రతినిధులకు అందజేశారు.