
న్యూఢిల్లీ: సైబర్ దాడుల ముప్పులను దీటుగా ఎదుర్కొనేందుకు సైబర్‌సెక్యూరిటీ విషయంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. జీ20 సభ్య దేశాలన్నీ కలిసికట్టుగా.. సవాళ్లను అధ్యయనం చేసి, పరిష్కార సాధనాలను కనుగొనడంపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. యూపీఐ, ఓఎన్‌డీసీ, కోవిన్ వంటి భారీ స్థాయి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఊతంతో టెక్నాలజీ ప్రయోజనాలను సామాన్యులకు కూడా భారత్ అందజేయగలుగుతోందని ఆయన పేర్కొన్నారు.
‘సైబర్‌సెక్యూరిటీ అనేది అందరికీ ఉమ్మడి సవాలే. అది చాలా సంక్లిష్టమైనది దానికి సరిహద్దులేమీ లేవు. టెక్నాలజీ నిత్యం రూపాంతరం చెందుతోంది. ఇవాళ ఒక సమస్యకు పరిష్కారం కనుగొంటే.. రేపు మరో కొత్త సమస్య పుట్టుకొస్తోంది. కృత్రిమ మేథ (ఏఐ)తో సంక్లిష్టత మరిన్ని రెట్లు పెరుగుతుంది‘ అని మంత్రి వివరించారు. ఈ నేపథ్యంలో అందరి ప్రయోజనాల కోసం కొత్త పరిష్కార సాధనాలను రూపొందించడం, పరస్పరం పంచుకోవడం అవసరమని ఆయన చెప్పారు. తాము అభివృద్ధి చేసిన కొన్ని సైబర్‌సెక్యూరిటీ సాధనాలను, వాటిపై ఆసక్తి గల దేశాలతో పంచుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని వైష్ణవ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment