విశ్వనగరి | New Vision invention CM KCR | Sakshi
Sakshi News home page

విశ్వనగరి

Published Thu, Feb 5 2015 12:18 AM | Last Updated on Tue, Aug 14 2018 10:51 AM

విశ్వనగరి - Sakshi

విశ్వనగరి

అభివృద్ధిలో వెనుకడుగు వేయబోయం విమర్శలకు వెరసేది లేదు
ఆలోచనలన్నీ  కార్యరూపం ఉపాధికి ప్రాధాన్యం
అత్యాధునిక సదుపాయాలతో మార్కెట్లు

 
‘న్యూ విజన్’ ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

 
అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ నగర అభివృద్ధి... ఉపాధి అవకాశాల కల్పన... ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వేలు... పేదలకు పక్కాగృహాలు... వానొస్తే ఎక్కడా  చుక్క నీరు నిలవకుండా ఏర్పాట్లు...  ఇదీ సీఎం కే సీఆర్ మనసులోని మాట.  నగర  ప్రజల ప్రస్తుత...భవిష్యత్తు  అవసరాలు... తన కలలు... ఇలా.. అనేక అంశాలపై తన అంతరంగాన్ని  ఆవిష్కరించారు. భాగ్యనగరాన్ని విశ్వనగరిగా తీర్చిదిద్దుతామని ఆశాభావం వ్యక్తం చేశారు.
 
సిటీబ్యూరో:  దేశంలోని ఏ నగరానికీ లేనివిధంగాసహజ సిద్ధ సౌకర్యాలు... నిజాం కాలం నుంచి అధునాతన సదుపాయాలు కలిగిన హైదరాబాద్ గత పాలకుల తీవ్ర నిర్లక్ష్యం వల్ల దుర్భర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. ఈ దుస్థితిని రూపుమాపేందుకు... హైదరాబాద్ రూపురేఖలు మార్చేందుకు ప్రణాళికాయుతంగా తమ ప్రభుత్వం ముందుకెళుతోందని చెప్పారు. బుధవారం రాత్రి ఓ టీవీ చానెల్‌లో ‘విజన్ హైదరాబాద్’పై ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. ‘కల్పన’ నుంచి కార్యరూపం దిశగా నడిచే చిత్తశుద్ధి, నిజాయితీ, నిబద్ధత తమకు ఉన్నాయన్నారు. ఎక్స్‌ప్రెస్ కారిడార్లు, ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వేలు, మల్టీలెవెల్ ఫ్లై ఓవర్ల గురించి వింటున్న వారు హైదరాబాద్‌లో అలాంటివి సాధ్యమా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని... వాటిని పటాపంచలు చేసేలా తాము ఆచరణలో చూపిస్తామన్నారు. ఏ పనిలోనైనా ప్రారంభంలో చాలామందికి నమ్మకం కలగదని... తెలంగాణ సాధనను సైతం తొలుత అలాగే పరిగణించారని గుర్తు చేశారు. ఆలోచన నుంచి పురోగమించి.. నిబద్ధతతో ముందుకు వెళ్తూ... మడమ తిప్పకుండా సాగితే కల సాకారమవుతుందని నిరూపించామన్నారు.

ఇదే తరహాలో హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ ఉద్యమ రూపం నుంచి ప్రభుత్వంగా అవతరించాక...అన్నిరకాలుగా తెలంగాణ అభివృద్ధికి వందశాతం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. అభివృద్ధిలో ఐదారు ప్రధాన నగరాలతో హైదరాబాద్ పోటాపోటీగా ముందుకెళ్తోందని చెప్పారు. పెరిగే జనాభాను అంచనా వేసి. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉందని.. నాటి పాలకుల నిర్లక్ష్యంతో హైదరాబాద్ తీవ్ర సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఓ మోస్తరు వాన కురిస్తే నీరు వెళ్లే మార్గం లే దని గుర్తు చేశారు. రాజ్ భవన్ రోడ్డు, అసెంబ్లీ, సీఎం క్యాంప్  కార్యాలయ ప్రాంతాలను దీనికి ఉదాహరణగా పేర్కొన్నారు.

 ఇదే తగిన సమయం

హైదరాబాద్ అభివృద్ధికి ఇదే తగిన సమయమని సీఎం అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో 5 లక్షల ఎస్‌ఎఫ్‌టీలో తమ సంస్థలు విస్తరించేందుకు విప్రో ప్రేమ్‌జీ వంటి వారు ముందుకొస్తున్నారని చెప్పారు. తద్వారా 5వేల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. తొలి దశలో రూ.1250 కోట్లతో ఆ ప్రాజెక్టులు అమలు చేయనున్నట్లు చెప్పారు. జీహెచ్‌ఎంసీ త్వరలోనే వాటికి టెండర్లు పిలవనుందని తెలిపారు. ఐదారేళ్లలో వాటిని పూర్తి చేస్తామన్నారు. దీనికిప్రజల సహకారం కావాలని కోరారు. వివిధ దేశాల ప్రముఖ సంస్థలు పెట్టుబడులకు శరవేగంగా ముందుకొస్తున్నాయన్నారు. ఫ్లై ఓవర్ల మలుపుల్లో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని... భవిష్యత్తులో నిర్మించే వాటి వల్ల ఇలాంటి వాటికి తావులేకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఆ మార్గాల్లోని భవంతులకు రెండింతలైనా నష్ట పరిహారం చెల్లిస్తామని చెప్పారు.
 
నాలాల విముక్తికి...


నాలాలు కబ్జాకు గురికావడంతో వర్షాలు వస్తే నీరు వెళ్లే మార్గం లేకుండా పోయిందని జీహెచ్‌ఎంసీ కమిషనర్, అధికారులు తనకు వివరించారని సీఎం తెలిపారు. ఈ దుస్థితి నుంచి బయట పడేందుకురూ.10 వేల కోట్లు ఖర్చవుతుందన్నారు.
 
ఫ్లై ఓవర్లు.. స్కైవేలు..


నగరంలో ప్రయాణ సమస్యలు లేకుండా ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వేలు, మల్టీ లెవెల్ ఫ్లై ఓవర్లు, జిల్లాల నుంచి వచ్చే వారి కోసం స్కైవేలు నిర్మిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఐదు మార్గాల్లో స్కైవేలు నిర్మిస్తామని తెలిపారు. మల్కాజిగిరి, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో దిగాలనుకునే వారికి ర్యాంప్‌లు ఉంటాయన్నారు. ప్రపంచంలోనే పేరెన్నికగన్న లీ అసోసియేట్స్ కన్సల్టెన్సీలు డిజైన్లు రూపొందిస్తున్నాయని తెలిపారు. జేబీఎస్ నుంచి తూముకుంట వరకు ఒక స్కైవే నిర్మిస్తామన్నారు. అమెరికాలోని డల్లాస్ తరహాలో హైదరాబాద్‌ను మారుస్తామని చెప్పారు. ఇవన్నీ చేయాలంటే శస్త్ర చికిత్సలాంటి పని జరగాలని అభిప్రాయపడ్డారు.
 
మార్కెట్లు నిర్మిస్తాం

ప్రజల అవసరాలు తీరేలా ఆధునిక మార్కెట్లు నిర్మిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. దాదాపు కోటి జనాభా ఉన్న నగరంలో కనీసం వెయ్యి మార్కెట్లు ఉండాలని అభిప్రాయపడ్డారు. కేవలం 24 మాత్రమే ఉండటం శోచనీయమన్నారు. చాలా మార్కెట్లు ఎకరం లోపు విస్తీర్ణంలో ఉండడం దారుణమన్నారు.మెహదీపట్నం మార్కెట్ వద్దే ఆటోలు, పశువులు ఉండటాన్ని ప్రస్తావిస్తూ అక్కడ ఆధునిక మార్కెట్‌ను కట్టి చూపిస్తామన్నారు. ప్రభుత్వ ప్రదేశాల్లో మార్కెట్లు ఏర్పాటు చేస్తామన్నారు. అవసరాల కోసం ప్రభుత్వ భూములు పరిశీలిస్తుంటే కొందరు సచివాలయ భూములు అమ్ముతారా ? అని చిల్లర మాటలు మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. అలాంటి వారందరికీ తగిన సమాధానం చెప్పేలా హైదరాబాద్‌ను సుందర నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. హరితహారంలో భాగంగా మూడేళ్లలో పది కోట్ల మొక్కలు నాటుతామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement