హైదరాబాద్‌లో అభివృద్ధి పనులకు రూ. లక్షన్నర కోట్లు
రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలి: సీఎం రేవంత్
చెన్నై, బెంగళూరు వంటి పరిస్థితి హైదరాబాద్‌కు రావొద్దు
ఆదిమానవుల్లా మారుదామా.. ఆధునికంగా బతుకుదామా?
నగర అభివృద్ధి, మూసీ ప్రక్షాళన జరగాల్సి ఉంది
రోజుకు 18 గంటలు పనిచేసే బాధ్యత తీసుకుంటా..
మేమేం చేస్తున్నా ప్రతిపక్షాలు అడ్డుకుంటామంటే కుదరదు
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌కు ఏం తెచ్చారని నిలదీత
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రూ.7 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ముఖ్యమంత్రి
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా నగరాలు కాలుష్యం, ట్రాఫిక్ జామ్‌లతో నివాసయోగ్యం కాకుండా పోతున్నాయని.. ఆ పరిస్థితి హైదరాబాద్‌కు రాకుండా ఉండాలంటే నగర అభివృద్ధితోపాటు మూసీ ప్రక్షాళన జరగాల్సి ఉందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కాలుష్యాన్ని తొలగించలేని పరిస్థితితో అడవుల్లోకి వెళ్లి మళ్లీ ఆది మానవుల్లా బతకాలా? ఆధునిక నగరంలో అధునాతనంగా జీవించాలా? అన్నది ఆలోచించుకోవాలని కోరారు.
నాలుగున్నరేళ్లలో రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తే... ప్రపంచ పెట్టుబడులకు వేదికగా అద్భుత నగరం రూపుదిద్దుకుంటుందని, ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన టోక్యో, న్యూయార్క్, సింగపూర్ నగరాలతో పోటీపడతామని ప్రకటించారు.
కాంగ్రెస్ ఏడాది ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మంగళవారం మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ‘హైదరాబాద్ రైజింగ్’పేరిట హెచ్‌ఎండీఏ మైదానంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దాదాపు రూ.7 వేల కోట్ల విలువైన పనులకు సీఎం రేవంత్ వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం మాట్లాడారు. సీఎం ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే...
‘‘మూసీలో పారిశ్రామిక వ్యర్థాలు, మనుషులు, పశువుల కళేబరాలు కొట్టుకొస్తున్నాయి. అలాంటి మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటున్న బీఆర్‌ఎస్, బీజేపీలకు కనీస అవగాహన లేదా? హైదరాబాద్ ప్రపంచంతో పోటీపడాలంటే రీజనల్, రేడియల్ రోడ్లు, ఫ్లైఓవర్లు, ఎస్టీపీలు, కృష్ణా, గోదావరి జలాలు, మెట్రో విస్తరణ అవసరం. వాటికి రూ. లక్షన్నర కోట్లు కావాలి. ఆ నిధులు నాలుగున్నరేళ్లలో ఖర్చు చేస్తే అద్భుత నగరంగా, ప్రపంచ పెట్టుబడులకు వేదికగా అవుతుంది. ఇందుకు కేంద్రం సహకరించాలి.
నగర అభివృద్ధి అంతా కాంగ్రెస్‌తోనే..
హైదరాబాద్ అభివృద్ధి అంతా కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి హైటెక్‌సిటీకి శిలాఫలకం వేస్తే... టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నిర్మాణం పూర్తిచేసి ఐటీ కంపెనీలు తెచ్చారు. తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి ఐటీ కంపెనీలను కొనసాగించడమేకాక ఔటర్ రింగ్ రోడ్‌ను, అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్‌ను, ఫార్మా కంపెనీలను తెచ్చారు. దీనితో రియల్ ఎస్టేట్, పరిశ్రమలు పెరిగాయి. పి.జనార్దనరెడ్డి కృషితో నగరానికి తాగునీళ్లు వచ్చాయి.
రాష్ట్ర ఖజానాకు 65శాతం ఆదాయం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచే.. నాటి సీఎంల ముందుచూపుతోనే వస్తోంది. న్యూయార్క్, టోక్యో, సింగపూర్ వంటి నగరాలతో పోటీపడేలా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తాం. ఇందుకు అవసరమైన దాదాపు 40–50 వేల ఎకరాల భూమికిగాను దాదాపు 15 వేల ఎకరాలు ఇచ్చేందుకు రైతులు సహకరించాలి. ఇబ్రహీంపట్నంలో 250 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో వెజిటబుల్, ఫ్రూట్ మార్కెట్లు, డెయిరీ, పౌల్ట్రీ, మీట్.. ఇలా అన్ని ఉత్పత్తులు ఒకేచోటికి తెస్తాం. కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తాం.
గప్పాలతోనే పదేళ్లు గడిపారు
గత ప్రభుత్వంలో సీఎం గప్పాలతోనే పదేళ్లు గడిపారు. హుస్సేన్‌సాగర్‌ను శుద్ధిచేస్తామని మురికికూపంగా మార్చారు. ఆ పార్టీ వాళ్లు సెల్ఫీలు తీసుకునే, ట్విట్టర్‌లో పెట్టుకునే శిల్పారామం, ట్యాంక్‌బండ్ కూడా కాంగ్రెస్ అభివృద్ధి చేసినవే. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నదని విష ప్రచారం చేశారు. గత ప్రభుత్వం ఉన్న 2023 ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య కంటే.. తమ ప్రభుత్వం వచ్చాక అదే సమయంలో 29శాతం అభివృద్ధిని రియల్ ఎస్టేట్ రంగం సాధించింది.
మంచి చెబితే అమలు చేస్తాం
బీఆర్‌ఎస్ గతంలో చేసింది అంతా అప్పులు, తప్పులే. అధికారం పోయాక జ్ఞానోదయమై ఏవైనా సూచనలు చేస్తామంటే అభ్యంతరం లేదు. మేం చేసేది నచ్చకపోతే... వారి విధానాలేమిటో, ఎన్ని నిధులు అవసరమో చెప్పాలి. అవి సహేతుకమైతే, ప్రజలకు ఉపయోగపడేవే అయితే భేషజాలు లేకుండా అమలుచేస్తాం. ఇందుకోసం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో ఉప సంఘం వేస్తున్నాం. అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తాం. బీఆర్‌ఎస్, బీజేపీ వారి ప్రతిపాదనలు పంపాలి.
అడ్డుకుంటామంటే కుదరదు
మేం ఏది చేస్తామన్నా ప్రతిపక్షాలు అడ్డుకుంటామంటే కుదరదు. మా మీద కోపంతో నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలను శిక్షించవద్దు. హైదరాబాద్ నగరమే మన ఆదాయం, జీవన విధానం, ఆత్మగౌరవం. దీన్ని కోల్పోతే సర్వం కోల్పోయినట్టే. అందుకే ఏ రకంగానైనా కాపాడుకుంటాం. అందుకోసం విదేశీ పెట్టుబడులు ఆకర్షిస్తాం. టోక్యో, న్యూయార్క్, సింగపూర్ నగరాలతో పోటీపడతాం..’’అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే దానం నాగేందర్, అధికారులు పాల్గొన్నారు.
పారిశుధ్య కార్మీకురాలితో సీఎం కరచాలనం..
‘హైదరాబాద్ రైజింగ్’కార్యక్రమానికి వచ్చిన సీఎం రేవంత్.. వేదికపైకి వెళ్లే ముందు అక్కడున్న పారిశుధ్య కార్మికులతో మాట్లాడి, భద్రత కిట్స్‌ను పంపిణీ చేశారు. ఒక కార్మికురాలితో కరచాలనం చేసి, స్థితిగతులను తెలుసుకున్నారు. అక్కడికి వచ్చిన దివ్యాంగులను పలకరించారు.
నా ప్రశ్నలకు సమాధానం చెప్పు కిషన్‌రెడ్డీ...
‘‘గుజరాత్‌లో సబర్మతి ఫ్రంట్‌కు చప్పట్లు కొట్టిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. ఇక్కడ మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారు. మూసీలో మునిగినా, అందులో ఆత్మహత్య చేసుకున్నా పట్టించుకోబోం. ప్రక్షాళన చేసి తీరుతాం. ప్రధాని మోదీ దగ్గర ఏటా రూ.40 వేల కోట్ల బడ్జెట్ ఉంటుంది. అందులోనుంచే సబర్మతి ఫ్రంట్‌తోపాటు గుజరాత్‌కు గిఫ్ట్ సిటీ, బుల్లెట్ రైలు తీసుకెళ్లారు.
మరి నువ్వు తెలంగాణకు ఏం తెచ్చావు? మోదీ గుజరాత్‌కు నిధులు తీసుకెళ్తుంటే గుడ్లప్పగించి చూస్తున్నారా? మెట్రో విస్తరణకు రూ.35 వేల కోట్లు కావాలి. రీజనల్‌రింగ్ రోడ్డుకు మరో రూ.35 వేల కోట్లు కావాలి. మోదీ గుజరాత్, బెంగళూరు, చెన్నైలకు ఇస్తారుగానీ.. హైదరాబాద్‌కు ఎందుకివ్వరు? నా ప్రశ్నలకు సమాధానం చెప్పు కిషన్‌రెడ్డీ... మీరు నిధులు తెస్తారా లేక గుజరాత్‌కు వలసపోతారా? సికింద్రాబాద్ ఎంపీగా ట్రాఫిక్ చిక్కులు తీర్చేందుకు, మెట్రో విస్తరణకు, ఫ్లైఓవర్ల నిర్మాణానికి నీ యాక్షన్ ప్లాన్ ఏంటి? కేంద్ర మంత్రిగా, ఎంపీగా నీ ప్రతిపాదనలేవో ప్రజలకు జవాబు చెప్పు. ఎన్ని నిధులు తెస్తావో చెప్పు. రాష్ట్రానికి రూ.లక్షన్నర కోట్లు తీసుకురా. 10 లక్షల మంది ప్రజలతో మోదీని, నిన్ను సన్మానించే జిమ్మేదారి నాది’’
మూసీ వెంట గుడిసె వేసుకుని ఉండి చూడు
– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి భట్టి సవాల్
‘‘మూసీ పరీవాహక ప్రాంతంలో ఒకరోజు నిద్రపోవడం కాదు.. అక్కడే గుడిసె వేసుకుని కుటుంబంతో సహా నివసించి చూపించు..’’అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సవాల్ విసిరారు. ప్రజలను మభ్యపెట్టడానికి ఒకరోజు మూసీ వద్ద నిద్రపోయి తర్వాతి నుంచి విలాసవంతమైన ప్యాలెస్‌లో ఉండటం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ‘హైదరాబాద్ రైజింగ్’కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
మూసీని జీవనదిగా మార్చాలని ముందుకు వెళ్తుంటే ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని భట్టి మండిపడ్డారు. బీఆర్‌ఎస్ మూసీ ప్రాజెక్టుపై సోషల్ మీడియా ద్వారా ప్రజలను రెచ్చగొడుతూ, కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఢిల్లీ తరహా కాలుష్యం ముప్పు హైదరాబాద్‌కు రాకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
సీఎం చేసిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలివే..
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.3,446 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. జల మండలి ఆధ్వర్యంలో రూ.669 కోట్లతో నిర్మించిన మురుగు నీటి శుద్ధి ప్లాంట్ల (ఎస్టీపీల)ను, తాగునీటి సరఫరా కోసం రూ.45 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ నిర్మించిన 19 రిజర్వాయర్లను ప్రారంభించారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో పలు జంక్షన్ల సుందరీకరణ పనులను కూడా ప్రారంభించారు.
ఇక హైదరాబాద్ రోడ్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌ఆర్‌డీసీఎల్) ఆధ్వర్యంలో రూ.1,500 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేసే పనులకు శంకుస్థాపన చేశారు. కృత్రిమ మేధ అనుసంధానంతో కొత్త ఆన్‌లైన్ బిల్డింగ్ అప్రూవల్, లేఅవుట్ అప్రూవల్ సాఫ్ట్‌వేర్‌ను లాంఛనంగా ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment