జోరు పెరగాలంటే!
హైదరాబాద్: ‘‘హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాలున్నాయి. అందరికీ నచ్చే వాతావరణముంది. స్థానికులకు హిందీ భాష వస్తుంది. నైపుణ్యం గల యువతకు కొరతే లేదు. అన్నింటికీ మించి ఇళ్ల ధరలూ తక్కువగా ఉంటాయి. రానున్న రోజుల్లో మార్కెట్ తప్పకుండా వృద్ధి చెందుతుంది’’.. భాగ్యనగరం గురించి ఏ బిల్డర్‌ని అడిగినా ఇంచుమించు ఇలాగే చెబుతారు. గత కొంతకాలంగా ఇదే చెప్పుకుంటూ వస్తున్నారు కూడా. ఇందతా నిజమే అయినప్పటికీ.. కొత్త ప్రభుత్వం ఏర్పాటై ఏడు నెలలైనా మార్కెట్ మెరుగు కావటం లేదెందుకు? మునుపటి జోరెందుకు కన్పించటం లేదు? ఈ అంశంపై నగర నిర్మాణ సంస్థలు ఆలోచించాల్సిన అవసరముంది. అసలు తప్పు ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవాలి. దాన్ని సరిదిద్దుకోవాలనే విషయాన్ని ఆలోచించాలి. అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొని అడుగు ముందుకేయాలి. అప్పుడే హైదరాబాద్ స్థిరాస్తి మార్కెట్లో మళ్లీ మునుపటి జోరును చూడొచ్చు.
ఒకటి కాదు రెండు కాదు.. దాదాపు నాలుగేళ్ల నుంచి హైదరాబాద్ రియల్టీ మార్కెట్లో అనుకున్నంత ఊపు లేదు. ఆశించిన స్థాయిలో అమ్మకాలూ లేవు. ఆర్థిక మాంద్యం, స్థానిక రాజకీయాంశం వల్ల పెట్టుబడిదారులు పూర్తిగా నిష్ర్కమించారు. ఫలితంగా స్థిర నివాసానికి మొగ్గు చూపేవారే మిగిలిపోయారు. వీరిలోనూ అధికశాతం మంది వివిధ ప్రాంతాల్లో గల ప్రాజెక్టులన్నీ తిరిగి చూడటం, రేటు తక్కువున్న చోట కొనడం చేసేవారు. ఇంటికి సంబంధించి అంతిమ నిర్ణయం తీసుకోవడానికి రెండు లేదా మూడు నెలల సమయాన్ని తీసుకునేవారు. ఇంకొందరేమో సొంతిల్లు కొనాలన్న ఆశ ఉన్నప్పటికీ.. వారి బడ్జెట్‌కు తగ్గట్లు మార్కెట్లో ఇళ్లు దొరకని పరిస్థితి. కొన్ని చోట్ల ధరలు తక్కువున్నా.. అవి నగరానికి దూరంగానో.. మౌలిక సదుపాయాలూ అభివృద్ధి చెందని ప్రాంతాల్లోనో ఉన్నాయి. మరికొందరేమో హైదరాబాద్‌ను పూర్తిగా విస్మరించి బెంగళూరు, పుణె, చెన్నైల్లో కొనుగోలు చేశారు. ఇలా రకరకాల కారణాల వల్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి.
ధర ఎక్కువ
ఫ్లాట్ల ధరలు అందుబాటులోఉంటే.. మార్కెట్‌తో సంబంధం లేకుండా అమ్మకాలు మెరుగ్గా జరిగేవి. కాకపోతే పశ్చిమ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రెండు పడక గదుల ఫ్లాట్లు రూ.40-50 లక్షలు, మూడు పడక గదుల ఫ్లాట్లయితే రూ.60 లక్షలు పెట్టాల్సిందే. అంతంత రేటు పెట్టాలంటే ఐటీ రంగంలో కనీసం పదేళ్లకు పైగా అనుభవమున్న వారి వల్ల సాధ్యమవుతుంది. వారి శాతం ఇక్కడ చాలా తక్కువగా ఉంటుంది. ఇక ఇతర ప్రాంతాల్లో 2,3 బీహెచ్‌కే ఫ్లాట్ల కోసం కనీసం రూ.30-40 లక్షలు పెట్టాల్సి వస్తోంది. దీంతో సామాన్యులు వెనుకడుగు వేయాల్సిన దుస్థితి నెలకొంది. ఫ్లాట్ల విస్తీర్ణం తక్కువ పెడితే.. కొనుగోళ్లు మెరుగ్గా జరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కనీసం, కొత్తగా ఆరంభమయ్యే ప్రాజెక్టుల్లోనైనా తక్కువ విస్తీర్ణం గల ఫ్లాట్లకు పెద్ద ్దపీట వేయాలి. మార్కెట్ పోకడను అర్థం చేసుకోకుండా ఒంటెద్దు పోకడకు పోతే మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని గ్రహిం చాలి.
నమ్మకం పోయిందా..
బూమ్ సమయంలో ఆరంభమైన పలు గేటెడ్ కమ్యూనిటీల్లో ఫ్లాట్లు కొన్నవారు.. అందులో గృహ ప్రవేశం చేయడానికి నిర్ణీత గడువు కంటే ఎక్కువ సమయం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆలస్యంగా ఫ్లాట్లను అందజేయడం వల్ల రెండిందాల నష్టం జరిగింది. హైదరాబాద్ బిల్డర్లంటే ఆలస్యం చేస్తారన్న అపవాదు నెలకొంది. ముఖ్యంగా ఐటీ కంపెనీల్లో పనిచేసే ఇతర నగరాలకు చెందిన వారు ఇలాంటి ప్రతికూల సమాచారాన్ని అంతర్జాలంలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఫలితంగా చాలా మంది నగరంలో ఇళ్లు కొనడం మానేశారు. దీని బదులుగా బెంగళూరు, చైన్నైలను ఎంచుకోవటం మేలని భావిస్తున్నారు.
కొత్త రాష్ట్రం..
విభజన జరగక ముందు వరకూ హైదరాబాద్‌లో సీమాంధ్రకు చెందినవారు ఇళ్లను ఎక్కువగా కొనుగోలు చేసేవారు. వీరితో బాటు ఇతర ప్రాంతాలకు చెందిన ఐటీ నిపుణులు ముందంజలో ఉండేవారు. కానీ, రాష్ట్ర విభజన జరిగాక.. ఇక్కడ కొందరు కొనుగోళ్లు చేయడాన్ని నిలిపివేశారు. పొరుగు రాష్ట్రంలో ఏం జరుగుతుందోనని వేచి చూస్తున్నారు. పలువురు పెట్టుబడిదారులు ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. అందులో కొందరు అక్కడే ఇల్లో, ప్లాటో కొనాలని నిర్ణయానికి వచ్చారు. కాకపోతే అక్కడ పరిస్థితుల్ని అర్థం చేసుకొని ఆయా ప్రాంతాల్ని హైదరాబాద్‌తో బేరీజు వేసుకున్నాక ప్రస్తుతం చాలామంది పునరాలోచనలో పడ్డారు. వీరంతా తీసుకునే తదుపరి నిర్ణయం మీద ఆధారపడి ఇక్కడి అమ్మకాలు ఆధారపడతాయనేది మార్కెట్ నిపుణులు విశ్లేషణ.