
నిర్మించిన తొలి సినిమాయే అంతర్జాతీయ స్థాయి వేదికపై ప్రదర్శితమయ్యే అవకాశం వస్తే ఏ నిర్మాతకైనా ఆనందంగానే ఉంటుంది. ఆ హ్యాపీ ఫీలింగ్‌లోనే ఉన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్. మ్యూజిషియన్ విశ్వేష్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించిన ‘99 సాంగ్స్’ చిత్రానికి ఏఆర్ రెహమాన్ ఒక నిర్మాతగా ఉన్నారు. అంతే కాదండోయ్ ఈ సినిమాకు రచయిత కూడా. ఈ ‘99 సాంగ్స్’ సినిమాతో ఇహన్ భట్, ఎడిల్సీ హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది.
వచ్చే నెల 3 నుంచి 12 వరకు 24వ దక్షిణ కొరియాలో బూసాన్ ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. ఈ చిత్రోత్సవాల్లో అక్టోబరు 9న ‘99 సాంగ్స్’ ప్రదర్శితం కానుంది. ‘‘99 సాంగ్స్’ చిత్రం బూసాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితం కాబోతుందని చెప్పడానికి చాలా హ్యాపీగా ఉంది. టీమ్ అందరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు ఏఆర్ రెహమాన్. 85 దేశాల నుంచి వచ్చిన దాదాపు 299 సినిమాలు ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శితం కానున్నాయి. స్క్రీనింగ్ అయ్యే సినిమాల జాబితాలో ‘ది స్కై ఈజ్ పింక్, ఆధార్’ వంటి హిందీ చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించే వాటిలో కొన్ని షార్ట్‌ఫిల్మ్స్ కూడా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment