నిడదవోలు, న్యూస్‌లైన్ : క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడమే వైఎంసీఏ ప్రధాన ధ్యేయమని వైఎంసీఏ నేషనల్ బోర్డు సభ్యుడు, ఇండియన్ వైఎంసీఏ చైర్మన్ కె.రాజారత్నం ఐజాక్ పేర్కొన్నారు. నిడదవోలులో శనివారం ఆల్ ఇండియా ఇంటర్ వైఎంసీఏ వాలీబాల్ టోర్నమెంట్ ముగింపు సందర్భంగా బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ వైఎంసీఏ ఆధ్వర్యంలో బాస్కెల్ బాల్, క్రికెట్‌లో రాణించిన వారిని జర్మనీ, ఇంగ్లండ్, శ్రీలంక దేశాలకు పంపించామన్నారు. అమెరికాలో ఉన్న స్పింగ్ ఫీల్డు యూనివర్సిటీతో అనుబంధంగా చెన్నై వైఎంసీఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. క్రీడలతో పాటు సామాజిక కార్యక్రమాలను కూడా చేపడుతున్నట్టు తెలిపారు. గతంతో వచ్చిన సునామీతో నష్టపోయిన పలు కుటుంబాలను ఆదుకున్నామన్నారు. నెల్లూరు జిల్లాలో నాగపట్నం, మధురై, సంజావూర్ ప్రాంతాల్లో సుమారు రూ.22 కోట్లతో గృహాలు నిర్మించామన్నారు. విశాఖపట్నంలో 50 మంది చిన్నారులకు ఆశ్రయం కల్పించినట్టు చెప్పారు.