అదే నా లక్ష్యం : రాజేశ్ టచ్‌రివర్
తెలుగు సినిమాలపై అభిమానంతో హైదరాబాద్‌లో స్థిరపడ్డ మలయాళీ... రాజేశ్ టచ్‌రివర్. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘ఇన్ ద నేమ్ ఆఫ్ బుద్ధా’ చిత్రం కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శితమైంది. రీసెంట్‌గా ఆయన తీసిన ‘నా బంగారు తల్లి’ చిత్రం మూడు జాతీయ అవార్డులను, అయిదు అంతర్జాతీయ పురస్కారాలను దక్కించుకుంది. తెలుగు సినిమాకు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టడమే తన ముందున్న లక్ష్యమని చెబుతున్న రాజేశ్ టచ్ రివర్‌తో ‘సాక్షి’ జరిపిన సంభాషణ.
‘నా బంగారు తల్లి’ ఆలోచన ఎవరిది?
తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన యథార్థ గాథ ఇది. వ్యభిచార వృత్తిలో నలిగిపోతున్న స్త్రీలకు విముక్తిని కల్పించడమే లక్ష్యంగా నా భార్య సునీత కృష్ణన్ స్థాపించిన స్వచ్ఛంద సంస్థ ‘ప్రజ్వల’. ఆ సంస్థ ద్వారా ఇప్పటికి 20 వేల మంది స్త్రీలకు విముక్తిని అందించడం జరిగింది. ఈ 20వేల మందిలో ఒక్కొక్కరిదీ ఒక్కో కథ. ఆ కథల్లో మా ఇద్దరి మనసుల్ని కదిలించింది ఓ కథ. దాన్ని అందరికీ చెప్పాలనిపించింది. నిజానికి ఈ కథను సినిమాగా చేస్తే... కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు తీయాలి. కానీ... ఎలాంటి అసభ్యత లేకుండా, అందరూ చూసేలా సినిమా తీయాలని నా భార్య సూచించింది. తను చెప్పినట్లే... ఆ కథను ‘నా బంగారు తల్లి’గా తీశాను. సమాజానికి పెను ప్రమాదంగా సంభవించిన అక్రమ రవాణా అంశాన్ని ఈ సినిమాలో చర్చించాం. సామాజిక సంస్కరణలో మార్పు మన నుంచే మొదలవ్వాలని ఇందులో చెప్పాను. సినీ ప్రముఖులందరూ ఈ సినిమా చూసి అభినందించారు. ప్రేక్షకుల నుంచి కూడా ఈ సినిమాకు విశేష స్పందన లభిస్తోంది.
ఇక ముందు కూడా ఇలాంటి సినిమాలే తీస్తారా?
అలాంటిదేం లేదు. యువతరం కథతో పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ తీయబోతున్నా. ఇందులో అందరూ కొత్తవారే నటిస్తారు. వచ్చే నెలలో ఆ సినిమా మొదలవుతుంది. దర్శకునిగా నా లక్ష్యం ఒక్కటే. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలి. దాని కోసం అహర్నిశలూ శ్రమిస్తా.
ప్రేమ, యాక్షన్.. ఈ రెండిటి చుట్టే తెలుగు సినిమా తిరుగుతుంటే... మీరు అందుకు భిన్నంగా సామాజిక విలువలతో కూడిన సినిమా తీశారు. సాధారణంగా మలయాళంలో ఇలాంటి సినిమాలొస్తుంటాయి. మీరు మలయాళీ కావడం వల్లే ఇలా ఆలోచించారని అనొచ్చా?
అలాంటిదేం లేదండీ... ఇది తెలుగు నేలపై జరిగిన కథ. అసలు నేను దర్శకుణ్ణి అయ్యింది తెలుగు సినిమాలు చూసి. చిరంజీవి, కె.రాఘవేంద్రరావుల చిత్రాలు కేరళలో అనువాదమయ్యేవి. అవి చూసే.. సినిమాలపై నాకు ఇష్టం పెరిగింది. లండన్‌లో డెరైక్షన్‌పై పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. నాలోని ప్రతిభ గమనించి బ్రిటిష్ గవర్నమెంట్ స్కాలర్ షిప్ కూడా ఇచ్చింది. ఆ తర్వాత 1996లో యానిమేషన్ మేకింగ్ నేర్చుకోవడానికి హైదరాబాద్ వచ్చాను. అప్పట్నుంచి ఇక్కడే ఉంటున్నా. కేరళ నా మాతృభూమి అయితే... తెలుగునేల నా కర్మభూమి.
తెలుగు సినిమాతో మీ అనుబంధం?
కళా దర్శకుడు అశోక్‌కుమార్‌గారి వద్ద సహాయకునిగా ఇక్కడ నా కెరీర్ మొదలైంది. చిరంజీవిగారి ‘మాస్టర్’కి తొలిసారి అసిస్టెంట్ ఆర్ట్ డెరైక్టర్‌గా చేశా. ఆ తర్వాత బావగారు బాగున్నారా, ఇద్దరు మిత్రులు చిత్రాలకు కూడా పనిచేశాను. ‘స్టూడెంట్ నెం 1’ చిత్రంతో ఆర్ట్ డెరైక్టర్‌గా ప్రమోట్ అయ్యాను. ఆ తర్వాత వచ్చిన ‘మనసంతా నువ్వే’ చిత్రానికి కూడా నేనే ఆర్ట్ డెరైక్టర్‌ని.
చివరి ప్రశ్న... మీ మెడలో ఆ వెరైటీ హారం ఏంటి?
ఆ హారం వయసు 460 సంవత్సరాలు. అది నా మెడలో గమ్మత్తుగా చేరింది. కొనేళ్ల క్రితం మధ్యప్రదేశ్‌లో భవానీమాత ఆలయానికి వెళ్లాను. అక్కడ గుంపుగా వెళుతున్న పదిహేనుమంది సాధువులు... నన్ను చూసి ఆగి ‘ఇది అతి పురాతనమైన అమ్మవారి నగ. ధరించు.. నీకు శుభం జరుగుతుంది’ అని నా మెడలో వేసి వెళ్లిపోయారు. ఆ రోజు నుంచి ఇది నా శరీరంలో భాగమైంది. నన్ను కలిసిన చిన్న పరిచయస్తులు కూడా... మొదట అడిగే ప్రశ్న... ‘మీ మెడలో అదేంటండీ?’ అని. ఇప్పటివరకూ ఎంతోమందికి చెప్పినా... మొత్తానికి మీ ద్వారా అది ప్రపంచానికి తెలుస్తున్నందుకు సంతోషం.