Naa Bangaru Talli
-
35 ఏళ్ల ఆకాంక్ష నెరవేరింది!
‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా కాలరెగరేసింది. మరోసారి టాలీవుడ్ కాలరెగరేసింది. వరల్డ్ సినిమాతో పోటీపడి మరీ ‘రక్తం’ అనే తెలుగు సిన్మా 22వ ‘ఇండీ గేదరింగ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’ (అమెరికన్)లో ఐదు నామినేషన్లు దక్కించుకుంది. ‘నా బంగారు తల్లి’ వంటి సినిమాను ప్రేక్షకులకు అందించిన దర్శక–నిర్మాతలు సునీతాకృష్ణన్, రాజేశ్ టచ్‌రివర్ ఈ సినిమా తీశారు. ఫీచర్ ఫిల్మ్–నిర్మాత సునీతాకృష్ణన్, డైరెక్టర్–రాజేశ్ టచ్‌రివర్, లీడ్ యాక్టర్–బెనర్జీ, లీడ్ యాక్ట్రెస్–మధుశాలిని, సినిమాటోగ్రాఫర్–రామతులసిలకు నామినేషన్లు దక్కాయి. ఈ సందర్భంగా దర్శకుడు రాజేశ్ టచ్‌రివర్, నటుడు బెనర్జీలతో ఇంటర్వ్యూలు.... ♦ కంగ్రాట్స్ బెనర్జీగారు.... ఎలా అనిపిస్తోంది? థ్యాంక్స్! అమెరికన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘ఉత్తమ నటుడు’ కేటగిరీలో తెలుగు నటుడికి నామినేషన్ రావడం అరుదైన విషయం. అదీ మన దేశం నుంచి నామినేషన్ దక్కించుకుని హాలీవుడ్ నటులతో పోటీపడుతున్నది నేనొక్కడినే. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ గ్రేట్. ఈ సందర్భంగా నా తల్లిదండ్రులకు, కళామతల్లికి కృతజ్ఞతలు. అలాగే, మా దర్శకుడు రాజేశ్ టచ్‌రివర్, నిర్మాత సునీతాకృష్ణన్, సహనిర్మాత మున్షీ రియాజ్ అహ్మద్, ‘రక్తం’ యూనిట్ సభ్యులకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ♦ రాజేశ్ టచ్‌రివర్ ‘నా బంగారు తల్లి’ వంటి సినిమాలు తీశారు. ఆయన మిమ్మల్ని సంప్రదించినప్పుడు మీరేమైనా ఆలోచించారా? రాజేశ్‌తో నాకు ఇంతకు ముందు పరిచయం కూడా లేదు. నన్ను, నా నటనను నమ్మి ‘రక్తం’లో లీడ్ రోల్‌కి సంప్రదించారు. కథ చెప్పిన వెంటనే ఓకే చెప్పేశా. నటుడిగా నా ప్రయాణం ప్రారంభించి 35 ఏళ్లవుతుంది. ఇన్నేళ్లూ ఇటువంటి సినిమా చేయాలని, ఇటువంటి పాత్రలో నటించాలని ఎదురుచూశా. నా 35 ఏళ్ల ఆకాంక్ష ‘రక్తం’తో తీరింది. ♦ మీరు కమర్షియల్ సినిమాల్లో నటిస్తుంటారు. ఓ ఆఫ్–బీట్ సినిమా చేయడం రిస్కేమో అనుకున్నారా? నటులెప్పుడూ మంచి క్యారెక్టర్స్ వస్తే ఎగ్జయిటవుతారు. తమ ప్రతిభను ప్రేక్షకులకు చూపించాలనుకుంటారు. నేనూ అంతే. ఎవరూ డబ్బు గురించి ఆలోచించరు. ముఖ్యంగా నేను! 30 ఏళ్లుగా నేను చిత్ర పరిశ్రమలో ఉన్నాను. ఎన్నో పాత్రలు చేశా. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి నామినేషన్ వచ్చేంత కెపాసిటీ ఉన్న క్యారెక్టర్ వస్తే ఎందుకు వదులుకుంటాను? నన్ను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లే పాత్ర ఇది. కెరీర్‌పై ఎఫెక్ట్ చూపిస్తుందేమో? రిస్కేమో! అనుకోలేదు. ‘రక్తం’ చూశాక దర్శక–రచయితలు నా కోసం మరిన్ని మంచి పాత్రలు రాస్తారని నమ్ముతున్నా! ♦ ∙‘ప్రాణాలు తీయడం ద్వారా విప్లవం తీసుకురాలేం’ అనే కథాంశంతో ‘రక్తం’ తీశానని రాజేశ్ టచ్‌రివర్ చెప్పారు. ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది? ఓ దళానికి నాయకుడిగా కనిపిస్తా. అందులో యువతీయువకులు, వయసైనవారు, బాగా చదువుకుని మంచి భావాలతో వచ్చినవారు... ఒక్కొక్కరూ ఒక్కోలా ఆలోచిస్తారు. మధ్య ఎవరైనా మరణిస్తే ‘అయ్యో పాపం’ అని కొందరు అంటే... ఏది ఏమైనా హైకమాండ్ అప్పగించిన పనిని పూర్తి చేయాలని మరికొందరు అంటారు. వాళ్లకు పరిస్థితులు అర్థమయ్యేలా వివరిస్తూ, అందర్నీ సమన్వయం చేసే పాత్ర. ఈ క్రమంలో మన విప్లవాన్ని ప్రజలు వ్యతిరేకించేలా, అసహ్యించుకునేలా ఉండకుండా చూసుకునే పాత్ర. ♦ మీరు ఎంతో అనుభవమున్న నటుడు... రాజేశ్ టచ్‌రివర్ రెగ్యులర్ కమర్షియల్ డైరెక్టర్ కాదు. సెట్లో మీ ఇద్దరి వర్కింగ్ స్టైల్ ఎలా ఉండేది? ఆయన ప్రతి సీన్ డిస్కస్ చేసి, నటించి చూపించమనేవారు. నచ్చితే బాగుందనే వారు. ఒకవేళ చిన్న చిన్న మార్పులుంటే చెప్పేవారు. ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. నా నుంచి ‘ది బెస్ట్ యాక్టింగ్’ తీసుకున్నారు. దర్శకుల్లో కమర్షియల్, ఆఫ్ బీట్ తేడాలు ఉండవు. నటీనటుల ప్రతిభను తెరపైకి తీసుకొచ్చేది వాళ్లే. ‘అంతా నాకే వచ్చు’ అనుకుంటే నా నటనలో మొనాటనీ వచ్చేస్తుంది. దర్శకులు చెప్పింది చేశాను కాబట్టే.. ఇన్నేళ్లుగా వైవిధ్యమైన పాత్రలు చేయగలిగాను. ఇప్పుడు ప్రతి ఐదేళ్లకు సినిమా రంగంలో కొత్త మార్పులొస్తున్నాయి. ఐయామ్ వెరీ హ్యాపీ. అందర్నీ చంపేస్తే కొత్త లోకం ఎక్కణ్ణుంచి వస్తుంది? ♦ కంగ్రాట్స్ రాజేశ్‌గారు... ఐయామ్ హ్యాపీ! ఇంగ్లీష్ సినిమాలతో పోటీ పడుతూ ఓ తెలుగు సినిమాకు అవార్డు రావడం, నటీనటులకు నామినేషన్స్ రావడం పెద్ద విషయమే కదా. ఆనందంగా ఉంది. ♦ ‘రక్తం’ కథేంటి? ఈ సినిమాలో మీరు ఏం చెబుతున్నారు? ఫ్రెంచ్ తత్వవేత్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆల్బర్ట్ కామ్స్ 1949లో రాసిన ‘లెస్ జస్టిస్’ నాటకం స్ఫూర్తితో ‘రక్తం’ తీశా. అప్పటికి, ఇప్పటికి పరిస్థితుల్లో పెద్దగా మార్పు లేదనిపించింది. చత్తీస్‌ఘడ్‌లో గతేడాది కొందరు పోలీసులను మావోయిస్టులు చంపేశారు. విప్లవం పేరుతో పలు దేశాల్లో ఇటువంటి మారణహోమాలు జరుగుతున్నాయి. ఓ మనిషిని చంపడం ద్వారా విప్లవం తీసుకురాలేరనే సందేశంతో ‘రక్తం’ రూపొందించా. చంపకుండా కూడా విప్లవం తీసుకురావొచ్చు. అందర్నీ చంపేస్తే కొత్త లోకం ఎక్కణ్ణుంచి వస్తుంది? అనేది నా ప్రశ్న. ♦ ‘నా బంగారు తల్లి’, ఇప్పుడీ ‘రక్తం’... ఓ సామాజిక బాధ్యతతో కూడిన సినిమాలే తీస్తున్నారెందుకు? నా దృష్టిలో ప్రతి ఒక్కరికీ సామాజిక బాధ్యత ఉంది. గద్దర్‌గారు పాట ద్వారా, జర్నలిస్టులు వార్తల ద్వారా, వేర్వేరు వ్యక్తులు వేర్వేరు పద్ధతుల ద్వారా తమ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. విప్లవాన్ని తీసుకొస్తున్నారు. ఓ దర్శకుడిగా నా సినిమాల ద్వారా ప్రజలకు మంచి చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు నేను ప్రేమకథలు, కమర్షియల్ సినిమాలు తీయాలనుకుంటే తీయొచ్చు. కానీ, సెన్సిబిల్ సిన్మాలు తీయాలనేది నా నిర్ణయం! ♦ ‘నా బంగారు తల్లి’కి వచ్చిన అవార్డులు–రివార్డులు పక్కన పెడితే, ప్రేక్షకుల స్పందన పట్ల మీరు హ్యాపీనా? మూడు జాతీయ అవార్డులు, నాలుగు నంది అవార్డులు, పదిహేను అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. థియేటర్లలో 25 రోజులు ఆడింది. టీవీలో వచ్చినప్పుడు ప్రేక్షకుల కోరిక మేరకు ఒక్కో నెల్లో నాలుగైదు సార్లు టెలికాస్ట్ చేశారు. అంతకు మించిన ఆనందం ఏముంటుంది చెప్పండి! ♦ ‘రక్తం’ సిన్మాను ఎప్పుడు విడుదల చేస్తారు? మంచి విడుదల తేదీ కోసం ఎదురు చూస్తున్నాం. అంతకంటే ముందు ఇంకా బోలెడన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు సిన్మాను పంపించాలనుకుంటున్నా. -
'నాబార్డ్ నుంచి రాయితీలు రావడం కష్టమే'
ఒంగోలు: కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆప్కాబ్‌కు నాబార్డు నుంచి రాయితీలు రావటం కష్టంగా మారిందని ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం ఒంగోలులో జరిగిన ఉమ్మడి రాష్ట్రాల కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు ఉద్యోగుల సంఘం సదస్సులో పిన్నమనేని మాట్లాడుతూ... ఏడాదికి రూ.10 వేల కోట్ల టర్నోవర్ ఆప్కాబ్‌కు ఉంటే నాబార్డు నుంచి రాయితీలు వస్తాయని పేర్కొన్నారు. అలాంటిది రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో రూ.7 వేల కోట్లు, తెలంగాణలో రూ.3 నుంచి రూ.4 వేల కోట్ల టర్నోవర్ మాత్రమే జరుగుతుందన్నారు. దీంతో రెండు రాష్ట్రాలకు నాబార్డు నుంచి రాయితీలు రావడం కష్టమేనని అభిప్రాయపడ్డారు. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ సదస్సులో రెండు రాష్ట్రాలకు సంబంధించి కొత్త కమిటీలను ఎన్నుకోనున్నారు. -
'నా బంగారు తల్లి'కి వినోద పన్ను మినహాయింపు
హైదరాబాద్: నా బంగారు తల్లి సినిమాకు వినోదపు పన్ను మినహాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సినిమాపై వంద శాతం వినోదపు పన్ను మినహాయింపు ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. సమాజానికి పనికివచ్చే సినిమాలను తాము తప్పకుండా ప్రోత్సహిస్తామని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాస్తవమైన కథను ఆధారంగా చేసుకుని హ్యుమన్ ట్రాఫికింగ్ అనే పాయింట్ ద్వారా వచ్చిన 'నా బంగారు తల్లి' సినిమా ప్రేక్షుకులను ఎంతో ఆకట్టుకుంది. వ్యభిచార ముఠా చేతిలో చిక్కిన యువతి కష్టాలు పడటం, అలాగే అక్కడినుంచి తప్పించుకునేందుకు యువతి ప్రయత్నించే సన్నివేశాలను దర్శకులు బాగా తెరకెక్కించారు. ఈ సినిమా అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో అనేక అవార్డులను కైవశం చేసుకున్న సంగతి తెలిసిందే. -
అదే నా లక్ష్యం : రాజేశ్ టచ్‌రివర్
తెలుగు సినిమాలపై అభిమానంతో హైదరాబాద్‌లో స్థిరపడ్డ మలయాళీ... రాజేశ్ టచ్‌రివర్. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘ఇన్ ద నేమ్ ఆఫ్ బుద్ధా’ చిత్రం కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శితమైంది. రీసెంట్గా ఆయన తీసిన ‘నా బంగారు తల్లి’ చిత్రం మూడు జాతీయ అవార్డులను, అయిదు అంతర్జాతీయ పురస్కారాలను దక్కించుకుంది. తెలుగు సినిమాకు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టడమే తన ముందున్న లక్ష్యమని చెబుతున్న రాజేశ్ టచ్ రివర్‌తో ‘సాక్షి’ జరిపిన సంభాషణ. ‘నా బంగారు తల్లి’ ఆలోచన ఎవరిది? తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన యథార్థ గాథ ఇది. వ్యభిచార వృత్తిలో నలిగిపోతున్న స్త్రీలకు విముక్తిని కల్పించడమే లక్ష్యంగా నా భార్య సునీత కృష్ణన్ స్థాపించిన స్వచ్ఛంద సంస్థ ‘ప్రజ్వల’. ఆ సంస్థ ద్వారా ఇప్పటికి 20 వేల మంది స్త్రీలకు విముక్తిని అందించడం జరిగింది. ఈ 20వేల మందిలో ఒక్కొక్కరిదీ ఒక్కో కథ. ఆ కథల్లో మా ఇద్దరి మనసుల్ని కదిలించింది ఓ కథ. దాన్ని అందరికీ చెప్పాలనిపించింది. నిజానికి ఈ కథను సినిమాగా చేస్తే... కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు తీయాలి. కానీ... ఎలాంటి అసభ్యత లేకుండా, అందరూ చూసేలా సినిమా తీయాలని నా భార్య సూచించింది. తను చెప్పినట్లే... ఆ కథను ‘నా బంగారు తల్లి’గా తీశాను. సమాజానికి పెను ప్రమాదంగా సంభవించిన అక్రమ రవాణా అంశాన్ని ఈ సినిమాలో చర్చించాం. సామాజిక సంస్కరణలో మార్పు మన నుంచే మొదలవ్వాలని ఇందులో చెప్పాను. సినీ ప్రముఖులందరూ ఈ సినిమా చూసి అభినందించారు. ప్రేక్షకుల నుంచి కూడా ఈ సినిమాకు విశేష స్పందన లభిస్తోంది. ఇక ముందు కూడా ఇలాంటి సినిమాలే తీస్తారా? అలాంటిదేం లేదు. యువతరం కథతో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ తీయబోతున్నా. ఇందులో అందరూ కొత్తవారే నటిస్తారు. వచ్చే నెలలో ఆ సినిమా మొదలవుతుంది. దర్శకునిగా నా లక్ష్యం ఒక్కటే. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలి. దాని కోసం అహర్నిశలూ శ్రమిస్తా. ప్రేమ, యాక్షన్.. ఈ రెండిటి చుట్టే తెలుగు సినిమా తిరుగుతుంటే... మీరు అందుకు భిన్నంగా సామాజిక విలువలతో కూడిన సినిమా తీశారు. సాధారణంగా మలయాళంలో ఇలాంటి సినిమాలొస్తుంటాయి. మీరు మలయాళీ కావడం వల్లే ఇలా ఆలోచించారని అనొచ్చా? అలాంటిదేం లేదండీ... ఇది తెలుగు నేలపై జరిగిన కథ. అసలు నేను దర్శకుణ్ణి అయ్యింది తెలుగు సినిమాలు చూసి. చిరంజీవి, కె.రాఘవేంద్రరావుల చిత్రాలు కేరళలో అనువాదమయ్యేవి. అవి చూసే.. సినిమాలపై నాకు ఇష్టం పెరిగింది. లండన్‌లో డెరైక్షన్‌పై పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. నాలోని ప్రతిభ గమనించి బ్రిటిష్ గవర్నమెంట్ స్కాలర్ షిప్ కూడా ఇచ్చింది. ఆ తర్వాత 1996లో యానిమేషన్ మేకింగ్ నేర్చుకోవడానికి హైదరాబాద్ వచ్చాను. అప్పట్నుంచి ఇక్కడే ఉంటున్నా. కేరళ నా మాతృభూమి అయితే... తెలుగునేల నా కర్మభూమి. తెలుగు సినిమాతో మీ అనుబంధం? కళా దర్శకుడు అశోక్‌కుమార్‌గారి వద్ద సహాయకునిగా ఇక్కడ నా కెరీర్ మొదలైంది. చిరంజీవిగారి ‘మాస్టర్’కి తొలిసారి అసిస్టెంట్ ఆర్ట్ డెరైక్టర్‌గా చేశా. ఆ తర్వాత బావగారు బాగున్నారా, ఇద్దరు మిత్రులు చిత్రాలకు కూడా పనిచేశాను. ‘స్టూడెంట్ నెం 1’ చిత్రంతో ఆర్ట్ డెరైక్టర్‌గా ప్రమోట్ అయ్యాను. ఆ తర్వాత వచ్చిన ‘మనసంతా నువ్వే’ చిత్రానికి కూడా నేనే ఆర్ట్ డెరైక్టర్ని. చివరి ప్రశ్న... మీ మెడలో ఆ వెరైటీ హారం ఏంటి? ఆ హారం వయసు 460 సంవత్సరాలు. అది నా మెడలో గమ్మత్తుగా చేరింది. కొనేళ్ల క్రితం మధ్యప్రదేశ్‌లో భవానీమాత ఆలయానికి వెళ్లాను. అక్కడ గుంపుగా వెళుతున్న పదిహేనుమంది సాధువులు... నన్ను చూసి ఆగి ‘ఇది అతి పురాతనమైన అమ్మవారి నగ. ధరించు.. నీకు శుభం జరుగుతుంది’ అని నా మెడలో వేసి వెళ్లిపోయారు. ఆ రోజు నుంచి ఇది నా శరీరంలో భాగమైంది. నన్ను కలిసిన చిన్న పరిచయస్తులు కూడా... మొదట అడిగే ప్రశ్న... ‘మీ మెడలో అదేంటండీ?’ అని. ఇప్పటివరకూ ఎంతోమందికి చెప్పినా... మొత్తానికి మీ ద్వారా అది ప్రపంచానికి తెలుస్తున్నందుకు సంతోషం. -
సిగ్గుగా ఉంది!
‘‘ఇదొక కళాఖండం. ఇలాంటి ప్రయోజనాత్మక చిత్రాలు సమాజానికి చాలా అవసరం’’ అని కథానాయిక సమంత అన్నారు. ఆమె చెబుతున్నది ‘నా బంగారు తల్లి’ చిత్రం గురించి. రాజేశ్ టచ్‌రివర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ చిత్రాన్ని వీక్షించిన సమంత ‘ఇప్పటివరకు ఇలాంటి చిత్రంలో నటించనందుకు సిగ్గుగా ఉంది’ అని పేర్కొనడంతో పాటు, ఇది అందరూ చూడదగ్గ చిత్రం అని ట్విట్టర్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. ‘‘మహిళలపై జరుగుతున్న అత్యాచారాల గురించి తెరరూపం ఇస్తే, ఆర్ట్ సినిమాలా ఉంటుందేమో అని ఎక్కువమంది చూడరు. అందరికీ ఈ సందేశం చేరాలనే నా వంతు బాధ్యతగా ప్రచారం చేస్తున్నా. ఇలాంటి ప్రయోజనాత్మక చిత్రాల్లో అవకాశం వస్తే తప్పకుండా నటిస్తా. అయితే ఇప్పటివరకు నన్నెవరూ సంప్రదించలేదు. నేను రిటైర్ అయ్యేలోపు ఇలాంటిది ఒక్క సినిమా అయినా చేయాలని ఉంది’’ అన్నారు. -
ఊరిస్తున్న ఐస్‌క్రీమ్-2
హైదరాబాద్: రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ఐస్‌క్రీమ్-2 సినిమా శుక్రవారం(నవంబర్ 21) ప్రేక్షకుల ముందుకురానుంది. ఐస్‌క్రీమ్ సినిమాను ఒకే ఇంట్లో రూపొందించిన వర్మ సీక్వెల్ లో ఎక్కువ శాతం అవుట్ డోర్ లో తెరకెక్కించారు. మొదటి 'ఐస్‌క్రీమ్' కంటే, ఈ రెండో 'ఐస్‌క్రీమ్' ఇంకా బాగుంటుందని వర్మ ఊరించారు. ఐస్‌క్రీమ్-2తో పాటు రౌడీ ఫెలో, నా బంగారు తల్లి, రాజ్యాధికారం, 33 ప్రేమకథలు ఈ వారం విడుదలవుతున్నాయి. హ్యాపీ ఎండింగ్ హిందీ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఐస్‌క్రీమ్- 2(హార్రర్) తారాగణం: జేడీ చక్రవర్తి, నందు, నవీన, భూపాల్, సిద్దు, ధన్‌రాజ్ దర్శకత్వం: రాంగోపాల్ వర్మ నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ ప్రొడక్షన్: భీమవరం టాకీస్ రౌడీ ఫెలో(యాక్షన్-రొమాంటిక్) తారాగణం: నారా రోహిత్, విశాఖసింగ్, రావు రమేష్, పోసాని, పరుచూరి వెంకటేశ్వరరావు, తాళ్లూరి రామేశ్వరి దర్శకత్వం: కృష్ణచైతన్య నిర్మాత: ప్రకాశ్‌రెడ్డి సంగీతం: సన్నీ ప్రొడక్షన్: మూవీ మిల్స్ అండ్ సినిమా 5 రాజ్యాధికారం తారాగణం: ఆర్. నారాయణమూర్తి, తనికెళ్ల భరణి, ఎల్బీ శ్రీరామ్ కథ, కథనం, మాటలు, ఫొటోగ్రఫీ, సంగీతం, దర్శకత్వం, నిర్మాత: ఆర్. నారాయణమూర్తి ప్రొడక్షన్: స్నేహచిత్ర పతాకం నా బంగారు తల్లి తారాగణం: సిద్ధిఖీ, అంజలీ పాటిల్, లక్ష్మీ మీనన్ దర్శకత్వం: రాజేశ్ టచ్‌రివర్ నిర్మాతలు: ఎంఎస్ రాజేశ్, సునీతా కృష్ణన్ సంగీతం: శాంతనూ మొయిత్రా 33 ప్రేమకథలు(రొమాన్స్) తారాగణం: వివేక్, సునీత మరసీయర్, శ్రావణి, నూకారపు సూర్యప్రకాశరావు, పూర్ణిమ, కృష్ణుడు దర్శకత్వం: శివగణేష్ నిర్మాత: ఫణిచంద్ర సంగీతం: అజయ్ పట్నాయక్ ప్రొడక్షన్: యువన్ టూరింగ్ టాకీస్ హ్యేపీ ఎండింగ్(హిందీ) తారాగణం: గోవిందా, సైఫ్ అలీఖాన్, ఇలియానా, రణ్వీర్ శోరే, కల్కీ కోయ్చ్లిన్ దర్శకత్వం: డీకే కృష్ణ, రాజ్ నిడిమోరు నిర్మాతలు: సైఫ్ అలీఖా, దినేష్ విజాన్, సునీల్ లుల్లా ప్రొడక్షన్: ఎల్లుమినాటి ఫిల్మ్స్ -
‘నా బంగారు తల్లి’మూవీ పోస్టర్స్
-
ఓ నిజజీవిత స్త్రీ మూర్తి కథ
‘‘లైంగిక వేధింపులకు గురవుతూ నరకప్రాయంగా జీవితాన్ని సాగిస్తున్న పన్నెండు వేల మంది స్త్రీలను ఆ ఊబిలో నుంచి బయటకు తీసుకొచ్చాన్నేను. ఆ క్రమంలో నేను చూసిన ఓ స్త్రీ జీవితం ఆధారంగా ‘నా బంగారు తల్లి’ చిత్రాన్ని తెరకెక్కించాం. ఇది అవార్డుల కోసం తీసిన సినిమా కాదు’’ అని నిర్మాతల్లో ఒకరైన సునీతా కృష్ణన్ అన్నారు. ఎం.ఎస్.రాజేశ్‌తో కలిసి, రాజేశ్ టచ్‌రివర్ దర్శకత్వంలో ఆమె నిర్మించిన చిత్రం ‘నా బంగారు తల్లి’. అంజలీ పాటిల్, సిద్ధిఖీ, లక్ష్మీమీనన్, రత్న శేఖర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా సునీతా కృష్ణన్ మాట్లాడుతూ -‘‘మూడు జాతీయ అవార్డులు, అయిదు అంతర్జాతీయ అవార్డులు అందుకున్న సినిమా ఇది. చిరంజీవి ఈ సినిమా చూసి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటానని మాట ఇచ్చారు. ఈ సినిమా విడుదలకు ఇబ్బంది పడుతుంటే, అమల ‘క్రౌడ్ ఫండింగ్’ ద్వారా ప్రయత్నించమని సలహా ఇచ్చారు. దాంతో రూ. 32 లక్షలు పోగయ్యాయి. ఓ అజ్ఞాత వ్యక్తి ఏకంగా 12 లక్షల రూపాయలు ఇచ్చారు’’ అని తెలిపారు. -
ప్రతి తండ్రి చూడాల్సిన చిత్రమిది: చిరంజీవి
‘‘ఇది మనసుని ఎడ్యుకేట్ చేసే సినిమా. మహిళలతో ఎలా నడుచుకోవాలో కూడా తెలియజేస్తుందీ సినిమా’’ అన్నారు చిరంజీవి. అంజలి పాటిల్, సిద్ధిఖీ, లక్ష్మీమీనన్, రత్నశేఖర్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘నా బంగారు తల్లి’. ఎం.ఎస్.రాజేశ్‌తో కలిసి ప్రజ్వల సంస్థ వ్యవస్థాపకురాలు సునీత కృష్ణన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రాజేశ్ టచ్‌రివర్ దర్శకుడు. బాలీవుడ్ క్రేజీ మ్యూజిక్ డెరైక్టర్ శంతన్ మొయిత్రా స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. బిగ్ సీడీని, ఆడియో సీడీని ఆవిష్కరించి చిరంజీవి మాట్లాడారు. ‘‘స్త్రీలపై జరుగుతున్న అకృత్యాలను ఇతివృత్తంగా తీసుకొని, అశ్లీలత లేకుండా దర్శకుడు ఈ సినిమాను మలిచాడు. అంజలి పాటిల్‌ను చూస్తుంటే స్మితాపాటిల్ గుర్తొచ్చారు. ఆమె ఎక్కడా నటించలేదు. బిహేవ్ చేశారు. ఇది స్త్రీల చిత్రం కాదు. పురుషుల చిత్రం. ప్రతి తండ్రీ చూడాల్సిన చిత్రం. ‘స్టాలిన్’లో నేను చెప్పినట్లు, ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మరో ముగ్గురికి చూడమని చెప్పండి’’ అని కోరారు. ‘‘ఇది నేను చూసిన కథ. నన్ను చలించిపోయేలా చేసిన కథ. దీనికి తెరరూపమివ్వాలని పలువురు నిర్మాతల్ని కలిశా. ఎవరూ స్పందించకపోవడంతో నేనే తీశా. రిలీజ్ కోసం చాలామందిని కలిశాను. కానీ.. సహకారం అందలేదు. దాంతో ఇంట్లో ఫర్నీచర్ కూడా అమ్ముకున్నాం. సినిమా తీయడం కంటే విడుదల చేయడమే కష్టమని తెలిసింది. అయితే, అల్లు అరవింద్, అక్కినేని అమల దైవదూతల్లా వచ్చి సినిమా విడుదలకు సహకరించారు. వీరితో పాటు నిమ్మగడ్డ ప్రసాద్‌గారికి, రిలయన్స్ సంజయ్గారికి రాష్ట్ర పోలీస్ వ్యవస్థకి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈ నెల 21న వంద థియేటర్స్‌లో సినిమాను విడుదల చేస్తాం’’ అని సునీత కృష్ణన్ చెప్పారు. ఇది లక్షలమంది ఆడపిల్లల కథ అనీ, ఎన్నో అడ్డంకుల్ని అధిగమించి తెరకెక్కించానని దర్శకుడు చెప్పారు. ‘‘సునీతకు నేను చేసిన సాయం.. చిరంజీవిగారికి ఈ సినిమా చూపించడమే. నా మాటపై నమ్మకంతో ఈ వేడుకకు విచ్చేసిన ఆయనకు కృతజ్ఞతలు’’ అన్నారు అల్లు అరవింద్. ఇంకా అమిత్ మిశ్రా, మహేశ్ భగవత్, మధుశాలిని, భరత్‌భూషణ్, వెంకటరత్నం, సునీల్, రత్నశేఖర్, వరుణ్జోసఫ్, రఘు, అనంతరామ్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు. Follow @sakshinews -
‘నా బంగారు తల్లి’ మూవీ ఆడియో రిలీజ్
-
‘నా బంగారు తల్లి’ వర్కింగ్ స్టిల్స్
-
‘నా బంగారు తల్లి’ మూవీ న్యూ స్టిల్స్
-
ఒకే పరీక్షతో.. చదువు, శిక్షణ, ఉద్యోగం..
ఎన్డీఏ అండ్ ఎన్ఏ ఎగ్జామినేషన్ ద్వారా పుణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ)లో ప్రవేశం పొందొచ్చు. తద్వారా ఒక చేత్తో డిగ్రీ పట్టా.. మరో చేత్తో కమిషన్డ్ ర్యాంకు అధికారిగా అపాయింట్మెంట్ సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుత నోటిఫికేషన్ ద్వారా ఎన్డీఏ 134వ కోర్సు, ఇండియన్ నావల్ అకాడమీ 96వ కోర్సులోకి ప్రవేశం కల్పిస్తారు. ఇవి 2015, జూలై 2 నుంచి ప్రారంభమవుతాయి. మొత్తం ఖాళీలు: 375 ఎన్డీఏ: 320 (ఆర్మీ-208, నేవీ-42, ఎయిర్‌ఫోర్స్-70) నావల్ అకాడమీ (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్): 55 ప్రవేశ విధానం: రాత పరీక్ష, ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్(ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ) దశల్లో చూపిన ప్రతిభ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ఈ మొత్తం ప్రక్రియకు 1800 మార్కులు కేటాయించారు. ఇందులో రాత పరీక్ష 900 మార్కులకు, ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ 900 మార్కులకు ఉంటుంది. రాత పరీక్షలో నిర్దేశించిన అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులను మాత్రమే ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్‌కు హాజరయ్యేందుకు అనుమతిస్తారు. రాత పరీక్ష: రాత పరీక్షను మల్టిపుల్ చాయిస్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రాన్ని ఇంగ్లిష్/హిందీ భాషల్లో రూపొందిస్తారు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. అవి.. పేపర్ ప్రశ్నలు మార్కులు సమయం మ్యాథమెటిక్స్ 120 300 150 ని. జనరల్ ఎబిలిటీ టెస్ట్ 150 600 150 ని. మొత్తం 900 జనరల్ ఎబిలిటీ టెస్ట్‌లో పార్ట్-ఎ, పార్ట్-బి అనే రెండు పేపర్లు ఉంటాయి. పార్ట్-ఎ ఇంగ్లిష్ పేపర్, పార్ట్-బి జనరల్ నాలెడ్జ్ పేపర్. రెండు పేపర్లలో కలిపి అడిగే 150 ప్రశ్నల్లో ఇంగ్లిష్ నుంచి 50, జనరల్ నాలెడ్జ్ నుంచి 100 ప్రశ్నలు ఇస్తారు. పార్ట్-ఎ ఇంగ్లిష్ పేపర్‌కు 200 మార్కులు, పార్ట్-బి జనరల్ నాలెడ్జ్ పేపర్‌కు 400 మార్కులు కేటాయించారు. క్లిష్టత మేరకు మార్కులు: సబ్జెక్ట్ క్లిష్టత మేరకు ప్రశ్నలకు మార్కులను కేటాయిస్తారు. ఈ క్రమంలో సరైన సమాధానాలకు మ్యాథమెటిక్స్‌లో 2.5 మార్కులు, ఇంగ్లిష్‌కు 4 మార్కులు, జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలకు 4 మార్కులు ఇస్తారు. నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంది. ఇందులో కూడా ఆయా సబ్జెక్ట్‌లను బట్టి నెగిటివ్ మార్కింగ్ ఇస్తారు. తప్పు సమాధానాల విషయంలో మ్యాథమెటిక్స్ విభాగంలో 0.83 మార్కులు, ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్ విభాగాల్లో 1.33 మార్కు కోత విధిస్తారు. ప్రిపరేషన్ ప్లాన్ మ్యాథమెటిక్స్: మ్యాథమెటిక్స్‌లో అర్థమెటిక్, మెన్సురేషన్, ఆల్జీబ్రా, జ్యామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఇంటిగ్రల్ కాలిక్యులస్- డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ప్రొబబిలిటీ, స్టాటిస్టిక్స్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్న సిలబస్ ఆధారంగా ప్రశ్నలు వస్తాయి. అభ్యర్థిలోని అవగాహన స్థాయిని, ప్రాథమిక భావనలను పరీక్షించే విధంగా ప్రశ్నల క్లిష్టత ఉంటుంది. ప్రతిసారీ ప్రశ్నల క్లిష్టత 12వ తరగతి, సీబీఎస్ఈ స్థాయిలో ఉండకపోవచ్చు. కాబట్టి ఆయా అంశాల్లోని ప్రాథమిక భావనలపై పట్టు సాధించడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అదే సమయంలో సమస్యలను వేగంగా సాధించే చిట్కాలను నేర్చుకోవాలి. సిలబస్‌లో పేర్కొన్న అన్ని అంశాలకు ప్రాధాన్యం ఇచ్చేలా ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తారు. కాబట్టి ప్రాక్టీస్‌లో అన్ని అంశాలపై దృష్టి సారించడం ప్రయోజనకరం. ముఖ్యంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి ప్రతి సారి ప్రశ్నలు ఇస్తున్నారనే విషయాన్ని గమనించాలి. ఆల్జీబ్రా, జ్యామెట్రీ అంశాలు చక్కని స్కోరింగ్‌కు దోహదం చేస్తాయి. ఈ నేపథ్యంలో ఆయా అంశాలకు ప్రాక్టీస్‌లో ప్రాధాన్యతనివ్వాలి. మరో ముఖ్య విషయం.. గత పేపర్లను విధిగా ప్రాక్టీస్ చేయాలి. అంతేకాకుండా అందులోని ప్రశ్నలను నిమిషంలో సాధించేలా ప్రిపరేషన్ సాగించాలి. జనరల్ ఎబిలిటీ టెస్ట్: ఇంగ్లిష్ (పార్ట్-ఎ): ఇంగ్లిష్ భాషపై కనీస పరిజ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలనే ఎక్కువగా అడుగుతారు. ఈ క్రమంలో ఎక్కువగా యూసేజ్, వొక్యాబులరీ, రీడింగ్ కాంప్రహెన్షన్ వంటి విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రతి రోజు కొత్తగా 15 నుంచి 20 పదాలు నేర్చుకోవడం, షార్ట్ స్టోరీస్ చదవడం, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్ అభ్యసనం, చిన్నపాటి ప్యాసేజ్‌లను చదివి వాటిలో ప్రశ్నలు అడగటానికి ఆస్కారం ఉన్న వాటిని గుర్తించడం ద్వారా ఈ విభాగంలో రాణించవచ్చు. చాలా మంది యూసేజ్ ఆఫ్ ఆర్టికల్స్ విషయంలో తప్పులు చేస్తుంటారు. కాబట్టి ఈ అంశంపై ఎక్కువగా దృష్టి సారించాలి. ఎర్రర్ ఫైండింగ్, అన్ జంబ్లింగ్ అంశాల నుంచి ప్రతి సారీ ప్రశ్నలు ఉంటున్నాయనే విషయాన్ని గమనించాలి. జనరల్ నాలెడ్జ్ (పార్ట్-బి): ఈ విభాగం పలు సబ్జెక్ట్‌ల కలయికగా ఉంటుంది. ఇందులో ఫిజిక్స్ (సెక్షన్-ఎ), కెమిస్ట్రీ (సెక్షన్-బి), జనరల్ సైన్స్ (సెక్షన్-సి), ఇండియన్ హిస్టరీ-భారత స్వాతంత్య్రోద్యమం-సివిక్స్ (సెక్షన్-డి), జాగ్ర ఫీ (సెక్షన్-ఈ), కరెంట్ ఈవెంట్స్ (సెక్షన్-ఎఫ్) అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. వీటికి మొత్తం 400 మార్కులు కేటాయించారు. ఇందులో వేర్వేరు సబ్జెక్ట్‌లకు వేర్వేరు మార్కులను నిర్దేశించారు. ఈ క్రమంలో ఫిజిక్స్ నుంచి 100 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. కెమిస్ట్రీ నుంచి 60 మార్కులు, జాగ్రఫీ నుంచి 80 మార్కులు, జనరల్ సైన్స్ నుంచి 40 మార్కులు, హిస్టరీ, స్వాతంత్య్రోద్యమం అంశాల నుంచి 80 మార్కులు, కరెంట్ ఈవెంట్స్ నుంచి 40 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. జనరల్ నాలెడ్జ్ పేపర్‌ను పరిశీలిస్తే మొత్తం మీద.. 50 శాతం ప్రశ్నలు సైన్స్ విభాగం నుంచే వస్తాయి. ఈ విభాగంలో ప్రశ్నలు.. ఆయా అంశాలపై అభ్యర్థుల ప్రాథమిక అవగాహనను పరీక్షించే విధంగా ఉంటాయి. మ్యాథ్స్/సైన్స్ అభ్యర్థులు జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, కరెంట్ ఈవెంట్స్ అంశాలను నిర్లక్ష్యంచేస్తుంటారు. అలా కాకుండా వీటిపై కూడా దృష్టి సారిస్తే స్కోర్‌ను మరింత పెంచుకోవచ్చు.మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంశాలకు సంబంధించి ఎన్సీఈఆర్టీ 8 - 12వ తరగతి పుస్తకాలను చదవాలి.బయాలజీ, జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్ కోసం ఎన్సీఈఆర్టీ 10వ తరగతి పుస్తకాలను చదవాలి. జనరల్ సైన్స్‌లో బయాలజీ, పర్యావరణం వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. వీటిని సమకాలీన సంఘటనలతో సమన్వయం చేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. హిస్టరీ, సివిక్స్ అంశాల ప్రిపరేషన్లో భారతదేశ సంబంధిత అంశాలకు అధిక ప్రాధాన్యతనివ్వాలి. భారత రాజ్యాంగంపై ప్రాథమిక అవగాహన ఉండాలి. భారత స్వాతంత్య్రోద్యమానికి సంబంధించి కీలక నాయకులు, ముఖ్య సంఘటనలు, సమావేశాలు- అధ్యక్షులు, సంవత్సరాలు వంటి అంశాలకు ప్రాధాన్యతనివ్వాలి. జాగ్రఫీలో ప్రధానంగా భూమి లక్షణాలు, భారతదేశ వాతావరణ పరిస్థితులపై ప్రశ్నలు ఉండొచ్చు. కరెంట్ ఈవెంట్స్ విషయానికొస్తే.. గత రెండేళ్ల వరకు అన్ని రంగాల్లోని కీలక సంఘటనలను తెలుసుకోవాలి. ఇందుకోసం ప్రతి రోజూ ఏదైనా ఒక ప్రామాణిక దినపత్రికను లేదా ఫ్రంట్‌లైన్ వంటి మ్యాగజీన్లు, ఇండియా ఇయర్ బుక్ వంటి పుస్తకాలను చదవాలి. ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ: రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు సర్వీసెస్ సెలక్షన్ బోర్డ (ఎస్ఎస్బీ) ఇంటర్వ్యూకు హాజరుకావాలి. ఐదు రోజులపాటు జరిగే ఈ ప్రక్రియలో అభ్యర్థికున్న మానసిక ధ్రుడత్వాన్ని పరిశీలిస్తారు. మొత్తం 900 మార్కులకు వివిధ రకాల పరీక్షలను నిర్వహిస్తారు. అవి.. ఇంటెలిజెన్స్ టెస్ట్, వెర్బల్ టెస్ట్, నాన్ వెర్బల్ టెస్ట్: అభ్యర్థిలో సామాజిక అంశాలపై అవగాహనను, తార్కిక విశ్లేషణ శక్తిని ఈ పరీక్షల్లో పరిశీలిస్తారు.పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్క్రిప్షన్ టెస్ట్: ఈ విభాగంలో ఒక ఇమేజ్(పటం)ను చూపించి దానికి సంబంధించిన సముచిత స్టోరీని రాయమంటారు. ఇందులో రాణించడానికి ప్రధాన మార్గం కమ్యూనికేషన్ స్కిల్స్, లాజికల్ థింకింగ్‌ను పెంచుకోవడమే.సైకలాజికల్ టెస్ట్: ఈ టెస్ట్ మరో నాలుగు విభాగాల్లో జరుగుతుంది. అవి.. వర్డ్ అసోసియేషన్, పిక్చర్ స్టోరీ టెస్ట్, సిట్యుయేషన్ రియాక్షన్ టెస్ట్, సెల్ఫ్ డిస్క్రిప్షన్. మెడికల్ టెస్ట్: మొదటి రెండుదశల్లో విజయం సాధించిన అభ్యర్థులకు చివరగా మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో ఫిట్నెస్ నిరూపించుకున్న అభ్యర్థులకు ఎన్డీఏలో ప్రవేశం లభిస్తుంది. కెరీర్ విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ త్రివిధదళాల్లో... వరుసగా లెఫ్టినెంట్, సబ్ లెఫ్టినెంట్, ఫ్లైయింగ్ ఆఫీసర్ కేడర్‌తో ఆఫీసర్ స్థాయి కెరీర్ ప్రారంభమవుతుంది. పూర్తి కాలం సర్వీస్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ సంబంధిత విభాగంలో మేజర్ జనరల్/రేర్ అడ్మిరల్/ ఎర్ వైస్ మార్షల్ స్థారుుకి తప్పకుండా చేరుకుంటారు. విభాగాల వారీగా పరిశీలిస్తే..ఆర్మీ: లెఫ్టినెంట్ హోదాతో కెరీర్ ప్రారంభించి అత్యున్నత స్థానమైన చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాప్ వరకు చేరుకునే అవకాశం ఉంది. సర్వీసు ప్రకారం వీరు కెప్టెన్, మేజర్, లెఫ్టినెంట్ కల్నల్, కల్నల్, బ్రిగేడ్, మేజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్, వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ హోదాలు లభిస్తాయి. నేవీ: ప్రారంభ స్థాయి అయిన సబ్‌లెఫ్టినెంట్ నుంచి విశిష్ట హోదా అయిన అడ్మిరల్ వరకు చేరుకునే అవకాశం ఉంది. సర్వీసు నిబంధనలకనుగుణంగా లెఫ్టినెంట్,లెఫ్టినెంట్ కమాండర్,కమాండర్,కెప్టెన్,కమడోర్, రేర్ అడ్మిరల్, వైస్ అడ్మిరల్, వైస్ అడ్మిరల్(వీసీఎన్ఎస్) హోదాలను చేరుకొవచ్చు.ఎయిర్‌ఫోర్స్: ఫ్లైయింగ్ ఆఫీసర్‌గా కెరీర్ ప్రారంభమవుతంది. తర్వాత అవకాశాన్ని బట్టి అత్యున్నత హోదా ఎయిర్ చీఫ్ మార్షల్ స్థాయిని కూడా చేరుకోవచ్చు. సర్వీసుకు అనుగుణంగా ఫ్లైయింగ్ లెఫ్టినెంట్, స్క్వాడ్రన్ లీడర్, వింగ్ కమాండర్, గ్రూప్ కెప్టెన్, ఎయిర్ కమాండర్, ఎయిర్ వైస్ మార్షల్, ఎయిర్ మార్షల్, ఎయిర్ మార్షల్ (వీసీఎన్ఎస్) హోదాలను చేరుకొవచ్చు. వేతనాలు: ఎన్డీఏ శిక్షణ సమయంలో నెలకు రూ. 21,000 స్టైపెండ్‌గా చెల్లిస్తారు. శిక్షణ పూర్తిచేసుకున్న తర్వాత జీతం రూపంలో నెలకు రూ. 35,000 వరకు లభిస్తాయి. వీటికి అలవెన్సులూ కలుపుకుంటే రూ. 45,000 జీతంతో కెరీర్ మొదలవుతుంది. క్యాంటీన్, వసతి, ఆహార సామగ్రి, ఉచిత భోజనం, ఉచిత రైలు, విమాన ప్రయాణాలు, పిల్లలకు ఉచిత చదువులు, ఇన్సూరెన్స్ కవరేజ్...వంటి సదుపాయాలు అదనం. ఆర్మీ/నేవీ/ఎయిర్ ఫోర్స్ ఏ విభాగంలో చేరిన వేతనాల్లో వ్యత్యాసాలుండవు. శిక్షణ ఇలా ఎన్డీఏలో అడుగుపెట్టిన విద్యార్థులకు రెండున్నరేళ్లపాటు క్లాస్ రూం ట్రైనింగ్.. ఫీల్డ్ ట్రైనింగ్ ఇస్తారు. దీన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న విద్యార్థులకు వారి సబ్జెక్టులకు అనుగుణంగా ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) బీఎస్సీ, బీఏ డిగ్రీలను ప్రదానం చేస్తుంది. ఇందుకోసం ఎన్డీఏలో ప్రవేశ సమయంలోనే విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న డిగ్రీని తెలియజేయాలి. ఎయిర్‌ఫోర్స్, నేవీ, నావల్ అకాడమీ కోర్సులకు ఎంపికైన అభ్యర్థులు బీఎస్సీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్/కెమిస్ట్రీ) కోర్సును ఎంచుకోవచ్చు. ఆర్మీ గ్రూప్ కోర్సుకు ఎంపికైన అభ్యర్థులు బీఏలో హిస్టరీ/జాగ్రఫీ/ ఎకనామిక్స్/పొలిటికల్ సైన్స్‌ల్లో నచ్చిన మూడు ఆప్షన్లను తీసుకోవచ్చు. అకాడమీలో అన్ని విభాగాల వారికీ శిక్షణ ఒకే పద్ధతిలో ఉంటుంది. రక్షణ దళాల అవసరాలకనుగుణంగా శారీరక శిక్షణతోపాటు వర్క్‌షాప్, ఏరియూ స్టడీ, మిలిటరీ హిస్టరీలను సిలబస్‌తోపాటు బోధిస్తారు. ఎయిర్‌ఫోర్స్ వింగ్‌కు ఎంపికైన అభ్యర్థులు ఎయిర్ ఫోర్స్ అకాడమీ (హైదరాబాద్)లో ఏడాది, ఆర్మీ వింగ్‌కు ఎంపికైన అభ్యర్థులు (ఇండియన్ మిలటరీ అకాడమీ, డెహ్రాడూన్)లో ఏడాది, నావల్ అకాడమీ ఎంపికైన అభ్యర్థులకు ఎజిమలాలో శిక్షణనిస్తారు. దరఖాస్తు సమయంలో నావల్ అకాడమీ (ఎజిమలా) ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్‌కు తొలి ప్రాధాన్యమిస్తే.. ఆ అభ్యర్థులకు విడిగా ఎజిమలాలో నాలుగేళ్ల శిక్షణనిస్తారు. ఆ శిక్షణ పూర్తి చేసుకుంటే బీటెక్ డిగ్రీ కూడా అందజేస్తారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత త్రివిధ దళాల్లో క్లాస్-1 కమిషన్డ్ అధికారి హోదాలో కెరీర్ ప్రారంభించవచ్చు. నోటిఫికేషన్ సమాచారం అర్హత:ఆర్మీ వింగ్: ఇంటర్మీడియెట్ లేదా 10+2/తత్సమానం ఎయిర్‌ఫోర్స్-నావల్ వింగ్స్: మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్‌లుగా ఇంటర్మీడియెట్ లేదా 10+2/తత్సమానంచివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులే. అయితే నోటిఫికేషన్లో పేర్కొన్న తేదీ నాటికి సంబంధిత సర్టిఫికెట్లను సమర్పించాలి. అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.నిర్దేశిత శారీరక ప్రమాణాలుండాలి. వయసు: 1996, జనవరి 2-1999 జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి.దరఖాస్తు: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: జూలై 21, 2014. రాత పరీక్ష తేదీ: సెప్టెంబర్ 28, 2014 వివరాలకు: www.upsc.gov.in -
నేషనల్ అవార్డుల్లోనూ బంగారు తల్లే !
-
సమాజానికి అద్దం... ఈ ‘బంగారు తల్లి’
చిత్ర నిర్మాణ సంఖ్య రీత్యా దేశంలో ద్వితీయ స్థానంలో ఉన్నా, జాతీయ అవార్డుల రీత్యా ఆఖరు స్థానానికే పరిమితమవుతున్న తెలుగు సినిమా బుధవారం నాడు జాతీయ స్థాయిలో తలెత్తుకు నిలబడింది. 2013వ సంవత్సరానికి గాను బుధవారం సాయంత్రం ప్రకటించిన 61వ జాతీయ అవార్డుల్లో రాజేశ్ టచ్‌రివర్ దర్శకత్వంలో రూపొందిన ‘నా బంగారు తల్లి’ మూడు అవార్డులు గెలుచుకుంది. తెలుగులో ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా నిలవడమే కాక, ఉత్తమ నేపథ్య సంగీతానికి (శాంతనూ మొయిత్రా) అవార్డు దక్కించుకుంది. సినిమాలో కీలక పాత్ర పోషించిన అంజలీ పాటిల్‌కు స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది. ‘‘జాలి, దయ లేని సెక్స్ వ్యాపార ప్రపంచం ఎంతగా వేళ్ళూనుకొందో తెరపై అధిక్షేపిస్తూ చూపించిన’’ సినిమాగా ‘నా బంగారు తల్లి’ని జ్యూరీ ప్రశంసించింది. ఆలోచింపజేసే కథ... అంతర్జాతీయ ప్రశంసలు... సెక్స్ అవసరాల నిమిత్తం ఆడపిల్లల అక్రమ రవాణా, అమ్మకమనే అంశం చుట్టూ ఈ చిత్ర కథ నడుస్తుంది. ‘‘నిత్యం మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాల గురించి పత్రికల్లో చదువుతున్నాం. సమాజాన్ని పీడిస్తున్న ఈ అంశం ఆధారంగా తీసిన సినిమా ఇది. దేశంలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో జరిగిన కథగా చిత్రీకరించిన ఈ సినిమా అన్ని ప్రాంతాల వారి మనసులనూ కదిలిస్తుంది’’ అని రాజేశ్ అభిప్రాయపడ్డారు. సామాన్య ప్రేక్షకులకు ‘నా బంగారు తల్లి’ గురించి పెద్దగా తెలియకపోయినా, నిజానికి ఈ చిత్రం ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికలపై ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ఇండొనేసియాలో అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్సీ, బెస్ట్ సినిమా ఆఫ్ ఫెస్టివల్, అమెరికాలోని డెట్రాయిట్లో జరిగిన ట్రినిటీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్-2013లో ఉత్తమ చలనచిత్రం సహా పలు అంతర్జాతీయ అవార్డులు సంపాదించుకుంది. ఇప్పుడు ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ స్థాయి గౌరవం సాధించుకుంది. ‘‘ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు పేరు వచ్చినా, ఇక్కడ సరైన గుర్తింపు రాలేదని వెలితిగా ఉండేది. కానీ, ఈ జాతీయ అవార్డులతో ఆ వెలితి తీరిపోయింది’’ అని దర్శకుడు రాజేశ్ టచ్‌రివర్ తన ఆనందం పంచుకున్నారు. ‘బీజింగ్ ఫిల్మ్ ఫెస్టివల్’లో పాల్గొనేందుకు వెళ్ళి, ప్రస్తుతం అక్కడే ఉన్న ఆయన ఇ-మెయిల్ ద్వారా తన స్పందనను తెలిపారు. వాస్తవిక జీవితం నుంచి వెండి తెరకు... మనుషుల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న స్వచ్ఛంద సేవకురాలు సునీతా కృష్ణన్ ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించడమే కాక, ‘కాన్సెప్ట్ ఎడ్వైజర్’గా దర్శకుడికి అండగా నిలిచారు. ఆమె స్వయంగా చూసిన నిజజీవిత అనుభవాలు కూడా ఈ చిత్ర రూపకల్పనకు తోడ్పడ్డాయి. ఇక, జ్యూరీ నుంచి ప్రత్యేక ప్రశంస అందుకున్న ఈ చిత్ర నటి అంజలీ పాటిల్ నిజజీవితంలో ఆడపిల్లల అక్రమ వ్యాపారమనే చేదు అనుభవాన్ని చవిచూసినవారే. ‘‘ధైర్యంగా ముందుకు వచ్చి నిజజీవిత కథను ప్రపంచానికి చెప్పినందుకు’’ గాను ఆమె తెగువను జ్యూరీ ప్రశంసించింది. ఇక, దర్శకుడు రాజేశ్ టచ్‌రివర్ శ్రీలంకలోని అంతర్యుద్ధంపై గతంలో ఆయన ‘ఇన్ ది నేమ్ ఆఫ్ బుద్ధ’ సినిమా తీసి, అనేక అవార్డులు గెలుచుకొన్నారు. ‘‘ఎయిడ్స్, ప్రపంచ శాంతి, అక్రమ రవాణా లాంటి అనేక సమస్యలను ఎత్తిచూపేందుకు దృశ్య మాధ్యమాన్ని వినియోగించుకోవాలని నా భావన’’ అని రాజేశ్ అన్నారు. అందుకు తగ్గట్లే ‘ప్రయోజనాత్మక చిత్ర’ నిర్మాణమే ధ్యేయంగా ఎన్నో ఏళ్ళుగా సినిమాలను నిర్మిస్తున్నారాయన. హైదరాబాద్‌లో స్థిరపడిన ఈ మలయాళీ ఇలా మన తెలుగు సినిమాకు గౌరవం తేవడం విశేషం. -
ఉత్తమ తెలుగు చిత్రం 'నా బంగారు తల్లి'
న్యూఢిల్లీ: 61వ జాతీయ సినిమా అవార్డులను బుధవారం ప్రకటించారు. ఆనంద్ గాంధీ దర్శకత్వంలో నిర్మించిన 'షిప్ ఆఫ్ తెస్యుస్' ఉత్తమ చిత్రంగా ఎంపికయింది. 'భాగ్ మిల్కా భాగ్' ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా అవార్డు దక్కించుకుంది. 'షహీద్' సినిమాను రూపొందించిన హన్సల్ మెహతా ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యాడు. 'షహీద్' నటించిన రాజ్‌కుమార్, 'పెరారియాతవర్'లో నటించిన సూరజ్ వెంజారుమూడు సంయుక్తంగా ఉత్తమ నటులుగా ఎంపికయ్యారు. 'లియర్ డీస్'లో నటించిన గీతాంజలి థాపా ఉత్తమ నటి అవార్డు దక్కించుకుంది. 'జోలీ ఎల్ఎల్ బీ' లో నటించిన సౌరభ్ శుక్లా ఉత్తమ సహాయ నటుడిగా ఎంపికయ్యారు. ప్రాంతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా 'నా బంగారు తల్లి' ఎంపికయింది. జాతీయ ఉత్తమ నేపథ్య సంగీత అవార్డు కూడా ఈ సినిమాకు దక్కింది. శాంతారాం మొయిత్రా సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో నటించిన అంజలి పాటిల్‌కు ప్రత్యేక ప్రశంస దక్కింది. 'సినిమాగా సినిమా'కు ఉత్తమ సినిమా పుస్తక అవార్డు లభించింది. -
మాతృభూమి సేవలో.. ఎన్డీఏ అండ్ ఎన్ఏ
ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, నేవల్ అకాడెమీల్లో ప్రవేశానికి యూపీఎస్సీ నిర్వహించే నేషనల్ డిఫెన్స్ అకాడెమీ (ఎన్డీఏ) అండ్ నేవల్ అకాడెమీ (ఎన్ఏ) ప్రకటన వెలువడింది.ఈ పరీక్షలో విజయం సాధించినవారు బీటెక్, బీఎస్సీ, బీఏ కోర్సులు ఉచితంగా పూర్తిచేయడమే కాకుండా లెఫ్టినెంట్, సబ్ లెఫ్టినెంట్, ఫ్లైయింగ్ ఆఫీసర్ హోదాతో త్రివిధ దళాల్లో కెరీర్‌కు బాటలు వేసే ఎన్డీఏ-ఎన్ఏ ఎగ్జామ్ వివరాలు.. రాత పరీక్ష విధానం: ఇందులో రెండు పేపర్లుంటాయి. అవి.. 1. మ్యాథ్స్ (300 మార్కులు), 2. జనరల్ ఎబిలిటీ టెస్ట్ (600 మార్కులు). రెండో పేపర్ జనరల్ ఎబిలిటీ టెస్ట్‌లో భాగంగా పార్ట్-ఏ, పార్ట్-బీ అనే రెండు విభాగాలు ఉంటాయి. పార్ట్-ఏలో ఇంగ్లిష్ 200 మార్కులకు, పార్ట్-బీలో జనరల్ నాలెడ్జ్ 400 మార్కులకు ప్రశ్నలడుగుతారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. నెగెటివ్ మార్కులుంటాయి. ఒక్కో పేపర్ వ్యవధి రెండున్నర గంటలు. మొత్తం ఖాళీలు: నేషనల్ డిఫెన్స్ అకాడెమీ:320 (ఆర్మీ-208, నేవీ-42, ఎయిర్‌ఫోర్స్-70) నేవల్ అకాడెమీ (10+2 కేడెట్ ఎంట్రీ స్కీమ్): 55 విద్యార్హత: ఆర్మీ వింగ్ (ఎన్డీఏ):ఏదైనా గ్రూప్‌తో 10+2 ఉత్తీర్ణత. ఎయిర్‌ఫోర్స్, నేవల్ విభాగాలు (ఎన్డీఏ); 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ (ఇండియన్ నేవల్ అకాడెమీ): ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌లతో 10+2 ఉత్తీర్ణత. వయోపరిమితి: అవివాహిత పురుషులు మాత్రమే అర్హులు. వీరు జూలై 2, 1995- జూలై 1, 1998 మధ్య జన్మించి ఉండాలి. నోటిఫికే షన్లో పేర్కొన్న నిర్దేశిత శారీరక ప్రమాణాలను కలిగి ఉండాలి. ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 20, 2014 పరీక్ష తేదీ: ఏప్రిల్ 20, 2014 వెబ్సైట్: upsconline.nic.in సన్నద్ధమవ్వండిలా.. పేపర్-1 మ్యాథ్స్ దీనికి మూడొందల మార్కులు ఉంటాయి. ఆల్జీబ్రాలో భాగంగా కాన్సెప్ట్స్ ఆఫ్ సెట్, వెన్ చిత్రాలు, డీ మోర్గాన్ లా, రిలేషన్, ఈక్వలెన్స్ రియాక్షన్స్‌పై ప్రశ్నలుంటాయి. కాంప్లెక్స్ నంబర్స్- బేసిక్ ప్రాపర్టీస్, మాడ్యూల్స్, ఆర్గ్యుమెంట్, కూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ, బైనరీ సిస్టమ్స్ ఆఫ్ నంబర్స్, క్వాడ్రియాటిక్ ఈక్వేషన్స్, జియోమెట్రిక్ అండ్ హార్మోనిక్ ప్రోగ్రెషన్స్ల నుంచి ప్రశ్నలడుగుతారు. మ్యాట్రిసెస్ అండ్ డెటర్మినెంట్స్లో భాగంగా బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మెంట్స్పై ప్రశ్నలుంటాయి. ఇంకా ట్రిగ్నామెట్రీ, ఎనలిటికల్ జియోమెట్రీ ఆఫ్ టూ అండ్ త్రీ డెమైన్షన్స్, డిఫరెన్షియల్ కాలిక్యులస్, ఇంటిగ్రెల్ కాలిక్యులస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, వెక్టార్ ఆల్జీబ్రా, స్టాటిస్టిక్స్, ప్రాబబులిటీల నుంచి ప్రశ్నలడుగుతారు. ఈ పరీక్ష స్థాయి ఇంటర్మీడియెట్ కాబట్టి సంబంధిత తరగతుల మ్యాథ్స్ పాఠ్యపుస్తకాల్లోని ముఖ్యమైన భావనలను, ప్రాథమిక అంశాలను, వివిధ సూత్రాలను బాగా చదవాలి. అదేవిధంగా వివిధ సూత్రాలను ఉపయోగించి సమస్యలను పరిష్కరించడం ప్రాక్టీస్ చేయాలి. రెండో పేపర్‌తో పోలిస్తే మొదటి పేపర్లోనే విద్యార్థులు ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంది. ఎందుకంటే జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్, ఎంసెట్, ఇతర ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్‌లకు సిద్ధమయ్యేవారు ఈ ప్రశ్నలకు మిగిలినవారితో పోలిస్తే సులువుగానే సమాధానాలు గుర్తించొచ్చు. సిలబస్‌లో ఉన్న చాప్టర్లపై ఎక్కువ దృష్టి సారించి బాగా సాధన చేస్తే అత్యధిక మార్కులు సాధించొచ్చు. అదేవిధంగా ప్రీవియస్ ఇయర్స్ ప్రశ్నపత్రాలను సేకరించి సాధన చేస్తే ప్రశ్నల సరళి తెలియడంతోపాటు ఏ చాప్టర్లకు ఎక్కువ వెయిటేజ్ ఉందో తెలుస్తుంది. అందుకనుగుణంగా విద్యార్థులు ప్రిపరేషన్ శైలిని మలచుకోవాలి. పేపర్-2 జనరల్ ఎబిలిటీ టెస్ట్ పార్ట్-ఎ ఇంగ్లిష్: దీనికి 200 మార్కులు ఉంటాయి. అభ్యర్థికి ఇంగ్లిష్‌లో ఏమేరకు అవగాహన ఉందో తెలుసుకునేలా ప్రశ్నలుంటాయి. పదాలు ఉపయోగించడం, వ్యాకరణం, పదసంపద (వొకాబులరీ), కాంప్రహెన్షన్ అంశాల్లో అభ్యర్థిని పరీక్షిస్తారు. సెంటెన్స్ కరెక్షన్, ఆర్టికల్స్, టెన్సెస్, ప్రిపోజిషన్స్, డెరైక్ట్ ఇన్‌డెరైక్ట్ సెంటెన్సెస్ మొదలైన అంశాల నుంచి ప్రశ్నలడుగుతారు. పదో తరగతి, ఇంటర్ ఫస్టియర్ స్థాయిల్లో ఉండే జనరల్ ఇంగ్లిష్‌కు సంబంధిత తరగతుల పాఠ్యపుస్తకాల్లో ఉన్న వివిధ వ్యాకరణాంశాలను సాధన చేయాలి. పార్ట్-బీ జనరల్ నాలెడ్జ్: ఇందులో ఆరు సెక్షన్లు (సెక్షన్ ఎ నుంచి ఎఫ్ వరకు) ఉంటాయి. వీటికి 400 మార్కులు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్, జాగ్రఫీ, కరెంట్ ఈవెంట్స్ అంశాల నుంచి ప్రశ్నలడుగుతారు. సెక్షన్-ఏ ఫిజిక్స్: 25 శాతం ప్రశ్నలు ఈ సబ్జెక్ట్ నుంచే అడుగుతారు. సూత్రాలు, నియమాలు, ప్రమాణాలు, పదార్థాల ధర్మాలు, ద్రవ్యరాశి, భారం, ఘనపరిమాణం, పీడనం, వేగం, త్వరణం, గురుత్వాకర్షణ శక్తి, న్యూటన్ నియమాలు, శక్తి, శబ్దతరంగాలు, లఘు లోలకం, కాంతి, పరావర్తనం, వక్రీభవనం.. ఇలా భౌతికశాస్త్రంలోని అన్ని ప్రాథమికాంశాలనూ బాగా చదువుకోవాలి. జేఈఈ మెయిన్స్, నీట్ మొదలైన పోటీపరీక్షల మెటీరియల్‌ను సిలబస్ ఆధారంగా ఒక క్రమ పద్ధతిలో చదవడంతోపాటు ఇంటర్ రెండేళ్ల ఫిజిక్స్ పాఠ్యపుస్తకాల్లోని ప్రధాన సూత్రాలను, భావనలను చదివితే ఈ విభాగం నుంచి అధిక మార్కులు సాధించొచ్చు. సెక్షన్-బీ కెమిస్ట్రీ: ఈ సబ్జెక్టుకు 15 శాతం మార్కులు కేటాయించారు. పదార్థ భౌతిక, రసాయన మార్పులు; సూత్రాలు, సంకేతాలు, సమీకరణాలు, ధర్మాలు, ఆమ్లాలు, క్షారాలు, లవణాలు, ఆక్సీకరణం, క్షయకరణం; కార్బన్, దాని రూపాంతరాలు; సహజ, రసాయన ఎరువులు; వివిధ పదార్థాల ఉత్పత్తికి అవసరమయ్యే ఇతర పదార్థాలు, పరమాణు సిద్ధాంతాలు మొదలైనవాటిని క్షుణ్నంగా చదవాలి. 9, 10 తరగతుల్లోని సంబంధిత టాపిక్స్‌లోని ప్రాథమిక అంశాలను చదువుతూ నోట్స్ రాసుకోవాలి. ఈ ప్రాథమిక భావనలను దగ్గర ఉంచుకుని ఇంటర్ కెమిస్ట్రీ పాఠ్యపుస్తకాలను లోతుగా అధ్యయనం చేస్తే అధిక మార్కులు పొందొచ్చు. సెక్షన్-సి జనరల్ సైన్స్: 10 శాతం ప్రశ్నలు ఈ విభాగం నుంచే అడుగుతారు. వీటిలో ఎక్కువ ప్రశ్నలు జీవశాస్త్రం నుంచే వస్తాయి. సజీవులు-నిర్జీవుల మధ్య భేదాలు, కణాల జీవనం, మొక్కలు, జంతువుల ఎదుగుదల, వాటి పునరుత్పత్తి, మానవ దేహం, అందులోని ముఖ్యావయవాలపై ప్రాథమిక పరిజ్ఞానం, సాధారణ రోగాలు- కారణాలు- నివారణ, ఆహారం, శక్తి కేంద్రకాలు, సమతులాహారం, సౌర కుటుంబం, ప్రముఖ శాస్త్రవేత్తల ఆవిష్కరణలు..వంటి అంశాల్లో ప్రశ్నలొస్తాయి. 8, 9,10 తరగ తుల జీవ శాస్త్రం పాఠ్యపుస్తకాల్లో ముఖ్యాంశాలను సినాప్సిస్ రూపంలో రాసుకుని చదువుకుంటే ఈ విభాగంలో అధిక మార్కులు సాధించొచ్చు. సెక్షన్-డీ చరిత్ర, స్వాతంత్య్రోద్యమం: 20 శాతం ప్రశ్నలు ఈ విభాగం నుంచే వస్తాయి. భారతదేశ చరిత్ర, నాగరికత, సంస్కృతి, భారత స్వాతంత్య్రోద్యమం, భారత రాజ్యాంగం ప్రాథమికాంశాలు, కార్యనిర్వహణ వ్యవస్థ, పంచవర్ష ప్రణాళికలు- ప్రాథమిక అంశాలు, పంచాయతీరాజ్, గాంధీజీ బోధనలు, ఆధునిక ప్రపంచం, అమెరికా స్వాతంత్య్రోద్యమం, ఫ్రెంచ్ విప్లవం, పారిశ్రామిక విప్లవం, రష్యా విప్లవం, సమాజంపై సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రభావం, పంచశీల సూత్రాలు, ప్రజాస్వామ్యం, సోషలిజం, కమ్యూనిజం, ఆధునిక ప్రపంచంలో భారత్ పాత్ర... అంశాల నుంచి ఈ విభాగంలో ప్రశ్నలొస్తాయి. సెక్షన్-ఈ జాగ్రఫీ: ఈ సెక్షన్‌కు 20 శాతం ప్రశ్నలు కేటాయించారు. భూమి, ఆకారం, పరిమాణం, అక్షాంశాలు, రేఖాంశాలు, టైమ్ కాన్సెప్ట్, ఇంటర్నేషనల్ డేట్ లైన్; భూ భ్రమణం, భూ పరిభ్రమణం- వాటి ప్రభావాలు, శిలాజాలు-వాటి వర్గీకరణ, భూకంపాలు, వాతావరణం, పీడనం, గాలులు, తుపాన్లు, తేమ, భారతదేశ భూగోళం, దేశంలో లభించే ఖనిజాలు, ముఖ్య శక్తి కేంద్రకాలు, వ్యవసాయ, పారిశ్రామిక కేంద్రకాలు, దేశంలో రేవు పట్టణాలు, రోడ్డుమార్గాలు-రవాణావ్యవస్థ, ఎగుమతులు, దిగుమతులు అంశాల నుంచి ప్రశ్నలడుగుతారు. సెక్షన్-ఎఫ్ కరెంట్ ఈవెంట్స్: ఈ విభాగానికి 10 శాతం మార్కులు కేటాయించారు. ఈ మధ్య కాలంలో మన దేశంలో జరిగిన వివిధ ముఖ్య సంఘటనలతోపాటు ప్రపంచంలో తాజా పరిణామాలు కూడా తెలుసుకోవాలి. వ్యక్తులు- అవార్డులు, క్రీడలు, సదస్సులు- ప్రదేశాలులాంటివాటిపై దృష్టిపెట్టాలి. పరీక్ష తేదీనాటికి ఆరు నెలల ముందు నుంచి ముఖ్యమైన సంఘటనలను ఒక వరుస క్రమంలో చదివితే ఈ విభాగంలో అత్యధిక మార్కులు సాధించొచ్చు. మలయాళ మనోరమ ఇయర్ బుక్, ఏవైనా కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్లను చదవాలి. శిక్షణ ఇలా.. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ ఏ సర్వీస్‌కి ఎంపికైనా మూడేళ్ల పాటు పుణెలోని నేషనల్ డిఫెన్స్ అకాడెమీలో శిక్షణ నిర్వహిస్తారు. మొదటి రెండున్నరేళ్లు ఈ మూడు సర్వీస్‌లకూ శిక్షణ ఒకేవిధంగా కొనసాగుతుంది. డిగ్రీ తరగతులతోపాటు సంబంధిత ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత అభ్యర్థి ప్రాధమ్యాల ఆధారంగా బీఎస్సీ/ బీఎస్సీ(కంప్యూటర్ సైన్స్), బీఏ డిగ్రీలను ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రదానం చేస్తుంది. ఆ తర్వాత ఆర్మీ క్యాడెట్లు ఇండియన్ మిలటరీ అకాడెమీ-డెహ్రాడూన్, నేవల్ క్యాడెట్లు ఇండియన్ నావల్ అకాడెమీ- ఎజిమల, ఎయిర్‌ఫోర్స్ క్యాడెట్లు ఎయిర్ ఫోర్స్ అకాడెమీ-హైదరాబాద్‌లో సంబంధిత అంశాల్లో ఏడాదిపాటు శిక్షణ పొందుతారు. ఈ ట్రైనింగ్‌లో నెలకు రూ.21,000 స్టైపెండ్ చెల్లిస్తారు. ఎన్డీఏ ఎంపికైనవాళ్లకు నాలుగేళ్లపాటు అకడమిక్, ఫిజికల్ ట్రైనింగ్ ఇండియన్ నేవల్ అకాడెమీ-ఎజిమలలో కొనసాగుతుంది. శిక్షణ తర్వాత బీటెక్ డిగ్రీ అందిస్తారు. ఆ తర్వాత ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ క్యాడెట్లను వివిధ హోదాల్లో నియమిస్తారు. ఏ సర్వీస్‌కు ఎంపికైనా నెలకు రూ.35,000కు పైగా పొందొచ్చు. దీంతోపాటు అలవెన్సులూ ఉంటాయి. భవిష్యత్తులో సంబంధిత విభాగానికి చీఫ్‌గా ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. రిఫరెన్స్ బుక్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ: ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పాఠ్యపుస్తకాలు, ఎంసెట్/జేఈఈ/నీట్ స్టడీ మెటీరియల్ ఇంగ్లిష్: రెన్ అండ్ మార్టిన్ హైస్కూల్ ఇంగ్లిష్ గ్రామర్, -నార్మన్ లూయీస్ వర్డ్ పవర్ మేడ్ ఈజీ జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్,జాగ్రఫీ: ఎన్సీఈఆర్టీ 8, 9,10తరగతుల సోషల్, బయాలజీ పుస్తకాలు, అట్లాస్ కరెంట్ ఈవెంట్స్: మనోరమ ఇయర్ బుక్ ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ నిర్వహించే పర్సనాలిటీ టెస్ట్‌కు 900 మార్కులుంటాయి. వివిధ అంశాల్లో అభ్యర్థి ప్రాథమిక పరిజ్ఞానాన్ని తెలుసుకోవడానికి వెర్బల్, నాన్ వెర్బల్ పరీక్షలు నిర్వహిస్తారు. గ్రూప్ డిస్కషన్, గ్రూప్ ప్లానింగ్, ఔట్ డోర్ గ్రూప్ టాస్క్స్, ఏదైనా సబ్జెక్ట్/అంశంలో ప్రసంగించమనడం... లాంటివన్నీ ఈ పరీక్షలో భాగమే. అభ్యర్థి మానసిక సామర్థ్యం, తెలివితేటలు, సమాజంపై అవగాహన, వర్తమాన వ్యవహారాలపై ఆసక్తి... ఇవన్నీ ఈ పరీక్షల ద్వారా తెలుసుకుంటారు. ఫిజికల్ టెస్ట్ రాత పరీక్ష ఉత్తీర్ణులకు నిర్వహిస్తారు. నిర్దేశిత ఎత్తు, దానికి తగ్గ బరువు ఉండాలి. ఏ విధమైన శారీరక లోపాలు ఉండకూడదు. ఛాతీ విస్తీర్ణం కనీసం 81 సెం.మీ. ఉండాలి. ఊపిరి పీల్చక ముందు, పీల్చిన తర్వాత వ్యత్యా సం 5 సెం.మీ.కు తక్కువ కాకూడదు. దృష్టిదోషాలు ఉండకూడదు. 2.4 కి.మీ. దూరాన్ని 15 నిమిషాల్లో పరుగెత్తాలి. పదోన్నతులిలా... ఆర్మీ నేవీ ఎయిర్‌ఫోర్స్ లెఫ్టినెంట్ సబ్ లెఫ్టినెంట్ ఫ్లైయింగ్ ఆఫీసర్ కెప్టెన్ లెఫ్టినెంట్ ఫ్లైట్ లెఫ్టినెంట్ మేజర్ లెఫ్టినెంట్ కమాండర్ స్క్వాడ్రన్ లీడర్ లెఫ్టినెంట్ కల్నల్ కమాండర్ వింగ్ కమాండర్ కల్నల్ కెప్టెన్ గ్రూప్ కెప్టెన్ (సెలెక్షన్) (సెలెక్షన్) (సెలెక్షన్) కల్నల్ కెప్టెన్ గ్రూప్ కెప్టెన్ (సెలెక్షన్) (టైంస్కేల్) (టైంస్కేల్) బ్రిగేడియర్ కమోడర్ ఎయిర్ కమోడర్ మేజర్ జనరల్ రేర్ అడ్మిరల్ ఎయిర్ వైస్‌మార్షల్ లెఫ్టినెంట్ జనరల్ వైస్ అడ్మిరల్ ఎయిర్‌మార్షల్ జనరల్ అడ్మిరల్ ఎయిర్‌చీఫ్ మార్షల్ -
‘నా బంగారు తల్లి’కి అంతర్జాతీయ పురస్కారం
‘ఇన్ ద నేమ్ ఆఫ్ బుద్ధ’ ఫేమ్ రాజేష్ టచ్ రివర్ దర్శకత్వంలో రూపొందిన ‘నా బంగారు తల్లి’ చిత్రం ట్రినిటి ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో ఉత్తమ చలనచిత్రంగా ఎంపికైంది. అంజలి పాటిక్, సిద్ధిక్ ముఖ్యతారలుగా ఎం.ఎస్.రాజేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రాజేష్ టచ్ రివర్ మాట్లాడుతూ -‘‘హ్యూమన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో ఈ సినిమా తీశాం. దాదాపు 23 ఏళ్ల తర్వాత ఓ తెలుగు సినిమాకు ట్రినిటి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో గుర్తింపు దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇతర చిత్రోత్సవాలక్కూడా ఈ సినిమాను పంపిస్తున్నాం. సెన్సార్ పూర్తయింది. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: సురేష్, కెమెరా: రామతులసి, సంగీతం: శరత్, సహనిర్మాతలు: సునీతకృష్ణన్.